దోచుకుంది దాచుకోవడానికే బాబు విదేశీ పర్యటనలు

- సీఎం పదవికి బాబు అనర్హుడు
-కాలిఫోర్నియా గవర్నర్‌తో సీఎం భేటీ ఆశ్చర్యకరం
–రాష్ట్ర విభజన కోరుకుంది చంద్రబాబే
–ఏపీలో దోచుకున్నది దాచుకోవడానికే బాబు విదేశీ పర్యటనలు
–అమరావతిలో రైతుల ఆర్తనాధాలు ప్రభుత్వానికి వినపడటం లేదు
– కేంద్రంతో విభేదిస్తే చంద్రబాబు జైలుకే
– గ్రూప్‌–2 పరీక్షలు వాయిదా వేయాలి
– వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనర్హుడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుకు సొంత రాష్ట్రం కంటే విదేశాలపైనే మోజు ఎక్కువుగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. సీఎం అమెరికా పర్యటన రాష్ట్ర ప్రజల కోసం కాదని, దోచుకున్నవి దాచుకోవడానికే విదేశాలకు వెళ్లారని అంబటి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు విదేశీ పర్యటనలు వెళ్లడం కొత్తేమి కాదన్నారు. ఇంతకు ముందుకు అనేక సందర్భాల్లో సింగపూర్, జపాన్, దాహోస్, చైనా, మలేషియా, ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్లారని తెలిపారు. విదేశీ పర్యటనలకు వెళ్లడం చంద్రబాబుకు ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఎవరూ కూడా చంద్రబాబు మూడేళ్ల వ్యవధిలో చేసిన విదేశీ పర్యటనలు చేసి ఉండరని అనుమానం వ్యక్తం చేశారు.  విదేశాల్లో పెట్టుబడిదారులను ఆకర్శించి, పెట్టుబడుల వెల్లువ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతానని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మూడేళ్ల వ్యవధిలో చంద్రబాబు పర్యటనల వల్ల ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయే సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ నేతలు గొప్పలు చెబుతున్నా.. అధికారిక లెక్కలు చూస్తే దారి ఖర్చులకు కూడా సరిపడ పెట్టుబడులు రాలేదని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు వెళ్లినా ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్తుంటారని తెలిపారు.

దోచుకున్నది దాచుకోవడానికే..
చంద్రబాబు విదేశీ పర్యటనలపై అందరికి అనుమానాలు ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం కంటే, ఇక్కడ దోచుకున్న లక్షలాది రూపాయలను అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పరిస్థితులు ఉన్నాయో, లేవో పరిశీలించేందుకు వెళ్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికే పారిశ్రామిక వేత్తలను విశాఖపట్నానికి పిలిచి ఇప్పటికే రెండుసార్లు ఇండస్ట్రియల్‌ సమ్మిట్‌ పెట్టారని చెప్పారు. వందల కోట్లు ఈ సమ్మిట్లకు ఖర్చు పెడితే ఒకసారి రూ.5 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారని, రెండో సారి రూ.10 లక్షల కోట్లు వచ్చాయని ప్రభుత్వం గొప్పలు చెప్పినట్లు గుర్తు చేశారు. వివరాల్లోకి వెళ్లి చూస్తే ఇంతవరకు ఒక్క పైసా కూడా రాలేదని ఆరోపించారు. గుమస్తాలకు సూట్, బూట్‌ వేసి వారిని ఇండస్ట్రియలిస్ట్‌ అని ప్రభుత్వం మసిపూసి మారడి కాయ చేసిందని ధ్వజమెత్తారు. ఇవాళ చంద్రబాబు అమెరికా పర్యటన కూడా అదే పరిస్థితిలో కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.

కాలిఫోర్నియా గవర్నర్‌తో పనేంటి?
అమెరికా పర్యటన వెళ్లిన చంద్రబాబు కాలిఫోర్నియా గవర్నర్‌తో భేటీ కావడం ఆశ్చర్యంగా ఉందని అంబటి రాంబాబు విమర్శించారు. చాలా బిజీగా ఉన్న చంద్రబాబు వీలు చూసుకొని కాలిఫోర్నియా గవర్నర్‌ను కలిసి..మన రాష్ట్రం అశాస్త్రీయంగా విభజించబడిందని ఆయనకు వివరించినట్లు ప్రకటన విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన కావాలని కోరుకుంది చంద్రబాబే అని తెలిపారు. రాష్ట్ర విభజనకు లేఖలు ఇచ్చింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. అసలు చంద్రబాబుకు మతిస్థిమితం సరిగా ఉందా? లేదా అన్నది అర్థం కావడం లేదన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లి మన దేశంలో ఉన్న అంతర్గత విభేదాలను అక్కడ మాట్లాడటం చట్ట విరుద్ధమన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కాలిఫోర్నియా గవర్నర్‌తో ఇలాంటి విషయాలు చర్చించారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అని ప్రశ్నించారు. మన రాష్ట్ర్ర సమస్యలు కాలిఫోర్నియ గవర్నర్‌ ఏం చేస్తారని, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

అమరావతిలో రైతుల ఆర్తనాదాలు పట్టడం లేదు
రాష్ట్ర రాజధాని అమరావతిలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆర్తనాధాలు చేస్తున్నారని తెలిపారు. గుంటూరులో మిర్చి రైతులు మద్దతు ధర కోసం ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. మార్క్‌ఫెడ్‌తో కొనుగోలు చేస్తామని ఒకసారి, మరోసారి ఇంకో మాట మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. మిర్చి ధర పడిపోతే కేంద్ర ప్రభుత్వం పది శాతం మద్దతు ధర చెల్లించేందుకు ముందుకు వచ్చిందన్నారు. వాస్తవానికి ఇంకా ఎక్కువ ధరకు మిర్చి కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ ఎక్కడున్నారని అంబటి నిలదీశారు. అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకురావడం మంచిదే, అయితే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 

లోకేష్‌ అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుతుంటారు
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్‌ అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుతుంటారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. లోకేష్‌ పొరపాటున మాట్లాడుతారో? సీరియస్‌గా మాట్లాడుతాడో తెలియదన్నారు. ఇవాళ విశాఖ జిల్లా నక్కపల్లిలో లోకేష్‌ మాట్లాడుతూ..‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని కేంద్రంతో విభేదించే పరిస్థితి మాకు  లేదు’’ అని లోకేష్‌ వాస్తవాన్ని తెలిపారన్నారు. ఎందుకంటే  చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయారని, అందువల్ల కేంద్రంతో విభేదిస్తే చంద్రబాబును జైల్లో పెడతారని లోకేష్‌ గ్రహించారన్నారు. లక్షల కోట్లు రాజధానిలో కాజేస్తున్నారని కేంద్రానికి తెలుసు అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాలు రానప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నప్పుడు, ప్రత్యేక రైల్వే జోన్‌ లేకుండా పోతున్న సందర్భంలో కూడా మేం విభేదించే పరిస్థితి లేదని చెప్పడం బాధాకరమన్నారు. కేంద్రం ఇవ్వకున్నా చేతులు కట్టుకుని కూర్చోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు దొరికిపోయిన దొంగ కాబట్టి మౌనంగా ఉన్నారని ఆరోపించారు.

బాబుకు విదేశాలంటే విపరీతమై మోజు
ఏపీ సీఎం చంద్రబాబుకు విదేశాలంటే విఫరీతమై మోజుందని అంబటి రాంబాబు అన్నారు. ఇప్పటికే ఎన్నోమార్లు విదేశీ యాత్రలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు గతంలో మాట్లాడుతూ..‘‘నాకు, వెంకయ్యకు ఇండియాలో పుట్టాలని ఎందుకనుకుంటాం. ధనవంతమైన అమెరికాలో పుట్టాలనుకుంటాం’’ అని చంద్రబాబు తన మనసులోని మాటను వెల్లడించారన్నారు. అంటే డబ్బుమీద, విలాసాల మీద, అమెరికా వంటి దేశాల మీద మోజు తప్ప భారత దేశంపైనా, ఆంధ్రరాష్ట్రం పైనా ఎలాంటి మమకారం లేదని అంబటి తెలిపారు. చంద్రబాబు ఏ దేశానికి వెళ్తే ఆ దేశాన్ని పొగడటం, మన దేశాన్ని కించపరిచే పరిస్థితుల్లోకి తీసుకెళ్లడం చాలా దారుణమన్నారు. ఇలాంటి చర్యలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు అంబటి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర్రాన్ని విదేశాల్లో అవమానపరిచేలా వ్యవహరించడం సరికాదన్నారు. విదేశీ పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారని ఆయన నిలదీశారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని విదేశీ పర్యటనలు చేయలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అన్నది ఒక దేశమని చంద్రబాబు భావిస్తూ..ఆయన వెళ్లి విదేశీ అధ్యక్షులతో నేరుగా మాట్లాడి పెట్టుబడులు తీసుకొస్తారన్న తప్పుడు అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో విదేశాల్లో ఏవిధంగా పెట్టుబడులు పెట్టాలో పరిశీలించేందుకు చంద్రబాబు వెళ్తున్నారని ఆరోపించారు. విదేశీ పర్యటనలు విహార యాత్రలకు పరిమితం కాకూడదని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా విదేశీ పర్యటనలు ఉంటే సంతోషిస్తామని, లేకపోతే విమర్శిస్తామన్నారు. గ్రూప్‌–2 పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు కోరుకుంటున్నట్లు అంబటి తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top