మాకు హాని జరిగితే బాబుదే బాధ్యత: భూమా అఖిల


హైదరాబాద్, నవంబర్ 6: తన తండ్రి భూమా నాగిరెడ్డి, తన కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. నంద్యాల స్థానానికి ఉపఎన్నిక వస్తుందంటూ టీడీపీ నేతలు బాహాటంగా చేస్తున్న ప్రకటనల తర్వాత, ఈ విషయంలో తన భయం తనకి ఉందని అందుకే తానీ మాట చెప్పాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి తన తండ్రిపై కేసులు నమోదు చేశారని తప్పుబట్టారు. తమవైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా ఎంత దూరమైనా పోరాడుతామని చెప్పారు.

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ పిఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డితో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. నంద్యాలలో ఉప ఎన్నిక వస్తుందంటూ కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. భూమాను కేసులో ఎలా ఇరికించారనే విషయమై డీజీపీతో, సీఎంతో చర్చించామని వెంకటేశ్వర్లు వ్యాఖ్యానిస్తున్న నేపధ్యంలో తన తండ్రికి గాని, తన కుటుంబానికి గాని ఏదైనా ఇబ్బంది జరిగితే సీఎం బాధ్యత వహించాలన్నారు.

నంద్యాల మున్సిపల్ సమావేశంలో ఏం జరిగిందనే విషయమై కొన్ని టీవీ ఛానళ్లు ఏకపక్షంగా చూపిస్తున్నాయి. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం నాగిరెడ్డికి ఎమ్మెల్యేగా మాట్లాడే హక్కు ఉన్నా మున్సిపల్ చైర్మన్ సులోచన గౌరవించలేదు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నపుడు మధ్యలో అంతరాయం కలిగించకూడదనే ప్రొటోకాల్ కూడా పాటించకుండా ఎజెండా ముగిసిందంటూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమయంలో 'తలుపులు వేయండ్రా..' అని నా తండ్రి చెప్పిన ఒక్క మాటను పట్టుకుని ఆయనపై మూడు తప్పుడు కేసులు బనాయించి రిమాండ్ కు పంపారు.

పథకం ప్రకారం హత్యాయత్నం చేయాలనుకుంటే పోలీసులు, మీడియా అంతా ఉండగా చేస్తారా? పోలీసులకు కేసు పెట్టేప్పుడు కనీసం ఆలోచన కూడా రాలేదా? రెండు పార్టీలు కొట్టుకున్నప్పుడు ఇద్దరిపైన కేసులు పెట్టాలి కదా? నాగిరెడ్డిపైనే కేసు ఎలా  పెట్టారు? అసెంబ్లీ, లోక్ సభలో అధికార, ప్రతిపక్షాలు గొడవపడుతున్నప్పుడు కూడా స్పీకర్, ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేతలపై ఇలాగే కేసులు పెట్టి, వారిపై రౌడీషీట్లు తెరుస్తారా?

నా తల్లిదండ్రులు ఏనాడూ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలేదు. రౌడీయిజం, గూండాయిజం చేసి ఉంటే నా తండ్రి నాలుగుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీగా, నా తల్లి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారే కాదు. నా తల్లి చనిపోయిన షాక్ నుంచి మా కుటుంబం ఇంకా తేరుకోకముందే ఆయనను మానసికంగా బలహీనుడిని చేయాలన్న దురుద్దేశంతోనే ఆయనపై హత్యాయత్నం కేసు మోపారు.

జిల్లా ఎస్పీకి బుద్ధిలేదా?: మైసూరారెడ్డి

నాగిరెడ్డిపై రౌడీషీటు తెరవడం అనేది దుర్మార్గమైన చర్య. ఐపీఎస్ చదువుకున్న జిల్లా ఎస్పీ అధికారపక్షం ఒత్తిళ్లకు తలొగ్గి బుద్ధిలేకుండా వ్యవహరించారు. ఒక వ్యక్తిపై రౌడీషీటుకు అవకాశం కల్పిస్తూ జారీ అయిన 743 స్టాండింగ్ ఆర్డర్ కు ఎలాంటి రాజ్యాంగబద్ధత లేదని, వాటికి ఎలాంటి నియమ నిబంధనల స్వభావం లేదని 1999, మార్చి 30వ తేదీన 'మహ్మద్ ఖదీర్ వర్సెస్ హైదరాబాద్ పోలీసు కమీషనర్' కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఐపీఎస్ చదివిన వ్యక్తికి ఈ విషయం తెలీదా?

స్థానిక ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీటీసీలు సమావేశానికి వెళ్తూ ఉంటే ముస్లిం ఎమ్మెల్యేపైనా, అంబటి రాంబాబుపైనా ముసుగులతో దాడి చేసిన వారిపై ఈ రోజుకు కేసులు పెట్టలేదు? మరోవైపు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రోజా, సునీల్, చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారు. సరస్వతి సిమెంట్స్ భూముల విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ పై అకారణంగా రౌడీషీటు పెట్టారు.

Back to Top