భూమా మృతికి బాబే కారణం

  • నాగిరెడ్డి మృతికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంతాపం
  • చంద్రబాబు భూమాను మానసిక క్షోభకు గురిచేశాడు
  • అలాంటి వారితో కలిసి సంతాప కార్యక్రమంలో పాల్గొనలేం
  • వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ విప్ పిన్నెళ్లి, దాడిశెట్టి రాజా
అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి చంద్రబాబే కారణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాలు ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో భూమా నాగిరెడ్డి మృతికి  వైయస్‌ఆర్‌సీపీ పగాఢ సానుభూతి ప్రకటించారు. ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించినట్లు  పిన్నెళ్లి, దాడిశెట్టి రాజా తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..భూమా నాగిరెడ్డి కుటుంబానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, ఆయనకు పీఏసీ చైర్మన్‌ పదవి ఇచ్చి గౌరవిచిందని తెలిపారు. అయితే  చంద్రబాబు మంత్రి పదవి ఆశ చూపి ఇవ్వకపోవడం వల్లే భూమా నాగిరెడ్డి మానసిక క్షోభకు గురై మృతి చెందారని వారు ఆరోపించారు.  

మోసం చేసిన వారితో కలిసి సంతాప తీర్మాన కార్యక్రమంలో పాల్గొనకూడదని పార్టీ నిర్ణయించిందన్నారు.   ఇలాంటి సమయంలో సంతాప కార్యక్రమంలో పాల్గొంటే ఆయన ఆత్మను కూడా మానసిక క్షోభకు గురిచేసిన వారు అవుతారని పేర్కొన్నారు. అందుకే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భూమా సంతాప సభకు హాజరుకావడం లేదని పిన్నెళ్లి, దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. టీడీపీలో చేరిన మరికొందరి పరిస్థితి కూడా భూమా నాగిరెడ్డి మాదిరిగానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రగాఢ సానుభూతి ప్రకటించినట్లు చెప్పారు. మానసిక క్షోభకు గురి చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. గతంలో ఇలాగే ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్‌టీ రామారావును మానసిక క్షోభకు గురి చేసి ఆయన మృతికి కారణమయ్యారని విమర్శించారు.
Back to Top