చంద్రబాబులో మానవ రక్తమే ప్రవహిస్తోందా?

కర్నూలు, 5 సెప్టెంబర్ 2013:

వజ్రం లాంటి మన రాష్ట్రాన్ని విభజించడానికి చంద్రబాబు ఇచ్చిన లేఖ కారణం కాదా? అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నిలదీశారు. పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసి, ఇప్పుడెలా బస్సు యాత్ర చేస్తారని నిలదీశారు. చంద్రబాబుకు ఆత్మ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? పోనీ ఆ వెన్నుపోటు ఆత్మకు గౌరవం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తామని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ నిరసన వ్యక్తంచేసినా కాంగ్రెస్, టిడిపి నాయకులలో మాత్రం చలనం లేదన్నారు. సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి గబ్బిలంలా ఇప్పటి వరకూ పదవిని పట్టుకుని వేలాడుతున్నారన్నారు. బొత్స సహా సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ దర్బార్‌లో వంగి వంగి సలామ్‌లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా కర్నూలు టౌనులో నిర్వహించిన గురువారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. కొండారెడ్డి బురుజు సాక్షిగా ఆమె చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ ఇచ్చేయండి అంటూ ఒక బ్లాంక్‌ చెక్కులా కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసి ఇచ్చేశారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. చంద్రబాబు లేఖ వల్లనే కదా కాంగ్రెస్‌ విభజన సాహసం చేసిందన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని ప్రధాని సహా పెద్దలందరూ చెబుతుంటే రాష్ట్రం విడిపోవడానికి బీజం వేసింది వైయస్ఆర్‌ అనడాన్ని తప్పుపట్టడమేటిన్నారు. రాష్ట్ర విభజనకు తాను చేసిందంతా చేసిన చంద్రబాబు ఇప్పుడు దానికి కారణం వైయస్ఆర్‌ అని చెబుతున్నారంటే ఆయన వంట్లో ప్రవహించేది మానవ రక్తం కాదనుకోవాలా? అని ప్రశ్నించారు.

విభజనకు వ్యతిరేకంగా వైయస్‌ విజయమ్మ, జగనన్నతో సహా పదవులకు రాజీనామాలు చేసి, నిరాహార దీక్షలు కూడా చేసి, ఇప్పటికి ఇంకా ఉద్యమాలు చేస్తున్నది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కాదా అన్నారు. న్యాయం చేయలేకపోతే విభజించే బాధ్యతను, అధికారాన్ని ఎందుకు తీసుకున్నారని కాంగ్రెస్‌ పార్టీని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మళ్ళీ మళ్ళీ డిమాండ్‌ చేస్తోందన్నారు. న్యాయం చేయరని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని డిమాండ్‌ చేశారు.

తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని హైదరాబాద్‌ను రాజధానిగా చేయడానికి ఇదే కర్నూలు నగరం గొప్ప త్యాగం చేసిందన్నారు. ఇప్పుడు 60 ఏళ్ళుగా కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్‌ మీది కాదు, వెళ్ళిపొమ్మంటుంటే సీమాంధ్రులు ఏమి కావాలో కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలన్నారు.

జనంలో ఉన్నా, జైలులో ఉన్నా జగనన్న జన నేతే. బయట ఉన్నా కాంగ్రెస్‌, టిడిపి నాయకులు దొంగలే అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము కాంగ్రెస్, టిడిపిలకు లేదు కనుకే వెనుక నుంచి సిబిఐతో దాడి చేయించి జైలులో పెట్టారని విమర్శించారు. బోనులో ఉన్న సింహం సింహమే అన్నారు. త్వరలో జగనన్న వస్తారని రాజన్న రాజ్యం వైపు మనందరిని నడిపిస్తారని అన్నారు.

రాజశేఖరరెడ్డిగారు ఉన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా కళకళలాడిందో నేను మీకు చెప్పనక్కర్లేదు. వ్యవసాయానికి 7 గంటలు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన రోజులవి. విద్యార్థుల గురించి ఆయన ఒక కన్న తండ్రి స్థానంలో ఆలోచించి ఉన్నత చదువులు చదవడానికి ఫీజు రీయింబర్సుమెంటు పెట్టారన్నారు. పేదలు కూడా గొప్ప ఆస్పత్రికి వెళ్ళి గొప్ప వైద్యం చేయించుకోవాలని ఆరోగ్యశ్రీని తెచ్చారన్నారు. ఎన్నో పథకాలను రాజశేఖరరెడ్డిగారు అద్భంతంగా చేసి చూపించారన్నారు.

రాజశేఖరరెడ్డిగారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఆయన పథకాలన్నింటికీ తూట్లు పెట్టింది. ఆయన ఆలోచనలను విమర్శించింది. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య అగ్గిపెట్టి చలి కాచుకుంటోంది. కేంద్రంలో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకోవడం కోసం కోట్లాది మంది తెలుగువారిని కష్టాల్లోకి నెట్టేసింది. తెలుగువారి భిక్షతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ఇప్పుడు తెలుగువారికే వెన్నుపోటు పొడుస్తోందని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి నదులపైన ఇప్పటికే పైనున్న రాష్ట్రాలతో నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.

చంద్రబాబు చెబుతున్నట్టు ఇటలీకి - ఇడుపులపాయకు లింకు ఉంటే జగనన్న ఈ పాటికే చిరంజీవిలా ఏ కేంద్ర మంత్రో, ముఖ్యమంత్రో అయ్యేవారు కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఐఎంజి, ఎమ్మార్‌ కేసులు విచారణ జరగకుండా చీకట్లో చిదంబరాన్ని కలిసి మేనేజ్‌ చేసుకుంది మీరు కాదా అన్నారు. ఎఫ్‌డిఐ బిల్లు సమయంలో కాంగ్రెస్‌ కుమ్మక్కైంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కుమ్మక్కు కాకపోయి ఉంటే మైనార్టీలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఏ విధంగా కాపాడారని నిలదీశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైపోయి జగనన్నపై కుట్రలు చేసి, కేసులు బనాయించి 16 నెలలుగా జైలులో పెట్టించింది మీరు కాదా చంద్రబాబూ అని ప్రశ్నించారు.

జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర... జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర... జోహార్‌ రాజేఖరరెడ్డి, జై జగన్‌ అనే నినాదాలతో శ్రీమతి షర్మిల తన కర్నూలు సమైక్య శంఖారావం సభను ముగించారు.

Back to Top