700 చీకటి జీవోలతో దొంగపాలన

రహస్య జీవోలు ఎవరికోసం చంద్రబాబు
జీవోల బండారం బయటపెట్టు

హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ జిల్లాల అభివృద్ధిపై ప్రతిపక్ష నేతలు బహిరంగ చర్చకు రావాలన్న చంద్రబాబు సవాల్ కు తాము సిద్ధమని వాసిరెడ్డి పద్మ తేల్చిచెప్పారు.  రాయలసీమకు చెందిన ఏ జిల్లాకు  చంద్రబాబు న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి  బాలకృష్ణ వియ్యంకుడికి , మీతనయుడు నారా లోకేష్ స్నేహితుడికి, గల్లా అరుణకుమారికి వందల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడమే నీవు చేసిన న్యాయమా అని చంద్రబాబును ప్రశ్నించారు. 

ప్రజలకు సమాధానం చెప్పాలి..!
చంద్రబాబు చీకట్లో జీవోలు తీసుకొస్తూ దొంగపాలన సాగిస్తున్నాడని....హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు పాలన మొదలైనప్పటి నుండి 700 జీవోలు రహస్యంగా విడుదల చేశారని పద్మ అన్నారు. ఈచీకటి జీవోలు ఎవరికోసమని వాసిరెడ్డి పద్మ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. పారదర్శకత మీద గిరీషం లెక్కలు ఇచ్చే చంద్రబాబు... ప్రజలకు తెలియకుండా చీకట్లో జీవోలు ఎందుకు తొక్కిపెడుతున్నారో చెప్పాలన్నారు. 

ఇదంతా ఎవరికోసమో..!
చంద్రబాబు పైకి ఒకటి చెబుతూ ప్రజలకు తెలియకుండా లోపల మరొకటి చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని  భూములు, వనరులు, సంపదకు రక్షణలేకుండా పోతుందనడానికి చంద్రబాబు చేస్తున్న బాగోతాలే నిదర్శనమన్నారు.  ఎంతమందికి భూకేటాయింపులు చేశారు. సింగపూర్, జపాన్ లకు ఎంత కట్టబెట్టారో చెప్పాలని నిలదీశారు. జీవోల బండారంపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని పద్మ డిమాండ్ చేశారు.
Back to Top