బాబుకు ప్రాజెక్టుల‌పై ధ్యాసే లేదు

  • సాగునీటి ప్రాజెక్ట్ లపై బాబు చెప్పేవన్నీ అబద్ధాలే
  • ప్రత్యేకహోదా విషయంలో జూన్ వరకు చూస్తాం
  • ఆతర్వాత మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా
  • బాబుకు దమ్ముంటే ఆ 21మందిపై వేటువేసి ఉపఎన్నికలకు రావాలి
  • మీడియాతో చిట్ చాట్ లో వైయస్ జగన్ సవాల్
ఏపీ అసెంబ్లీ: చ‌ంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అవుతున్నా ప్రాజెక్టులు పూర్తి చేయాల‌న్న ధ్యాసే లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. బుధ‌వారం అసెంబ్లీ వాయిదా అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని మండిప‌డ్డారు. 80 శాతం ప్రాజెక్టుల పనులు చంద్రబాబు రాకముందే పూర్తయ్యాయని, మిగతా 20శాతం పనులను కూడా  టీడీపీ స‌ర్కార్‌ పూర్తి చేయలేదన్నారు. గండికోట, చిత్రావతి, పోతిరెడ్డిపాడు సహా ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు.

శ్రీశైలంలో నీళ్లున్నా రాయలసీమకు నీళ్లివ్వలేదని, అలాంటి మనిషి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని వైయ‌స్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. పులిచింతల ప్రాజెక్టు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికే పూర్తయిందని, ఇప్పటివరకూ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని ఆయన గుర్తు చేశారు. జల దినోత్సవం అంటూ సభలో చంద్రబాబు అరగంటసేపు ప్రకటన చేశారని, ఆ ప్రకటన రెచ్చగొట్టేలా ఉందని, కావాలనే పాత అంశాలను ప్రస్తావనకు తెచ్చారన్నారు. ఆ ప్రకటన ఆత్మస్తుతి, పరనిందలా ఉందని ప్ర‌తిప‌క్ష నేత‌ వ్యాఖ్యానించారు. పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తినా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని, ప్రకటన సమయంలో పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌కు అవకాశం లేదని సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 

ప్రతిపక్ష నేత అడిగితే సమయం ఇవ్వరా? మరి చంద్రబాబు చేసింది సరైనదేనా? అని వైయస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యాక తాము సభలోకి వెళ్లామని, అప్పుడు కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. సభలో తాను మాట్లాడకూడదనే అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారని ఆయన మీడియాతో అన్నారు. చంద్ర‌బాబుకు ద‌మ్ముంటే పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేసి ఉప ఎన్నిక‌ల‌కు రావాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ స‌వాల్ విసిరారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో జూన్ వ‌ర‌కు వేచి చూస్తామ‌ని, ఆ త‌రువాత వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల‌తో రాజీనామా చేయించి, దేశ‌మంతా రాష్ట్రం వైపు చూసేలా పోరాటం చేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.
Back to Top