చంద్రబాబువి నీచ రాజకీయాలు: అంబటి

గుంటూరు : ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచమైన స్వార్థ రాజకీయాలు నడుపుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. గాడి తప్పిన ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించాల్సిన చంద్రబాబు ఆ పార్టీతోనే కలిసి ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు.

ప్రజల ఆకాంక్షలు, ఆమోదాలను గౌరవించని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క క్షణ‌ం కూడా అధికారంలో ఉండేందుకు వీలులేదని పాదయా యాత్రలో పదేపదే చెబుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వార్థంతో కూడిన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని రాంబాబు విమర్శించారు. గుంటూరులోని మాయాబజార్ సెంట‌ర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో అంబటి ప్రసంగించారు.

అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వస్తే ఇప్పటికిప్పుడు ప్రజలు తమ పార్టీకి ఓటు వేయరన్న భయంతోనే బాబు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వెనుకంజ వేశారని అంబటి ఆరోపించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా చంద్రబాబు గాని, ఆయన కొడుకు లోకేష్‌గాని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోలేరని ఆయన పేర్కొన్నారు.

రాబోయే మున్సిపల్, జె‌డ్‌పి, పంచాయతీ ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహిస్తే వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తన తడాఖా చూపుతుంద‌న్నారు. ప్రజల్లో తనకు ఉన్న బలాన్ని చాటుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పొట్టన బెట్టుకున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. పార్టీ నేతలు రావి వెంకట రమణ, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు.
Back to Top