చంద్రబాబూ.. మీకు పాదయాత్రలు ఎందుకు?

ఇబ్రంహీంపట్నం:

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదని మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఓవైపు ప్రభుత్వాన్ని తిడుతూనే మరోవైపు ఆ ప్రభుత్వాన్ని కాపాడుతూ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి పడగొట్టే శక్తి ఉన్నా ఆ పని చేయకుండా పాదయాత్రల పేరుతో ఆయన నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. జగన్ బయట ఉంటే తమ ఆటలు సాగవనే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించారు. ‘పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. ఉదయించే సూర్యుణ్ణి ఆపడం ఎవ్వరి తరమూ కాదో అలాగే జగనన్న త్వరలోనే వస్తాడు. రాజన్న రాజ్యం తెస్తాడు’ అని చెప్పారు.

ప్రజా సమస్యల వెల్లువ..
     రోజుకు నాలుగు గంటలే కరెంటు ఇస్తున్నారు.. బిల్లేమో నాలుగింతలు పెరిగిందంటూ ఓ మహిళ ఫిర్యాదు. పింఛన్ రావడం లేదంటూ ఓ అవ్వ ఆవేదన. స్కూలుకు వెళ్లేందుకు కూడా బస్సు లేదంటూ ఓ బాలిక బాధ! రావిరాలలో షర్మిల నిర్వహించిన రచ్చబండలో గ్రామస్థులు ఇలా తమ సమస్యలను చెప్పుకున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు తుక్కుగూడ నుంచి బయల్దేరిన షర్మిల 10.30 గంటలకు రావిరాల చేరుకుని రచ్చబండ నిర్వహించారు. జనం సమస్యలను ఓపిగ్గా విన్న షర్మిల.. ‘‘కొంతకాలం ఓపిక పట్టండి. రాజన్న కలలు నెరవేర్చేందుకు జగనన్న వస్తాడు..’’ అంటూ వారికి ధైర్యం చెప్పి ముందుకు సాగారు. గురువారం షర్మిల 16 కిలోమీటర్లు నడిచారు. రాత్రి 7 గంటల సమయంలో నాదర్‌గుల్ సమీపంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకున్నారు. పాదయాత్రలో పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధ్దన్, కె.కె.మహేందర్‌రెడ్డి రాజ్ ఠాకూర్, జనార్దన్‌రెడ్డి, అమృతసాగర్, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు దేప సురేఖ, హరివర్ధన్‌రెడ్డి, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top