సిబిఐ తీరుపై ప్రజాప్రతిస్పందన తప్పదు!

హైదరాబాద్ 21 నవంబర్ 2012 : జగన్మోహన్ రెడ్డి బెయిల్ దరఖాస్తుపై కౌంటర్ దాఖలు చేసేందుకు సిబిఐ మరోసారి గడువు కోరడం "దురదృష్టకర"మని వైయస్ఆర్ కాంగ్రెస పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిని వీలైనంత కాలం జైలులోనే ఉంచేందుకు జరుగుతున్నరాజకీయ కుట్రలో సిబిఐ పాలుపంచుకోవడం "దారుణ"మని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సిబిఐ గడువు కోరడం కేసును తేలనీయకుండా జాప్యం చేసే ఎత్తుగడ తప్ప వేరుకాదన్నారు.
ఈనెల 16న జగన్మోహన్ రెడ్డిగారు సిబిఐ కోర్టులో చేసిన బెయిల్ దరఖాస్తుకు సంబంధించి బుధవారం సిబిఐ వ్రాతపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయవలసి ఉన్నా, ఆ పని చేయకుండా ఎప్పటిలాగానే మరోసారి వ్యవధి కోరిందని, దీంతో 23 వ తేదీకి కేసు వాయిదా పడిందని ఆయన వివరించారు.సిబిఐ ఒక రాజకీయ పార్టీలాగా వ్యవహరిస్తూ ఇంకా లీకులు ఇస్తూనే ఉందన్నారు. తమ వ్యవహారశైలిపై పునరాలోచించుకోవాలని ఆయన సిబిఐ ఉన్నతాధికారులకు హితవు పలికారు. రాజకీయ కక్ష సాధింపులకు పనిముట్టుగా మారుతున్న సిబిఐ తీరుపై "ప్రజాప్రతిస్పందన" తప్పదని ఆయన హెచ్చరించారు.
రాంబాబు మాటల్లోనే...
"ఇలా సిబిఐ టైము కోరడం, వాయిదాలు అడగడం ఇదేమీ మొదటిసారి కాదు, చివరి సారీ కాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ కోర్టులో బెయిలు దరఖాస్తు దాఖలు చేసినా సిబిఐ జాప్యం చేసే ఎత్తుగడలను అనుసరిస్తోంది. కౌంటర్ వేయాల్సిన రోజున కౌంటర్ వేయకపోవడం, సమయం తీసుకోవడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు కనుక బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ కౌంటర్ దాఖలు చేయడం పరిపాటిగా మారింది.  కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల చేతుల్లో సిబిఐ ఒక పనిముట్టుగా మారింది. ప్రజాస్వామ్యదేశంలో అత్యున్నత విచారణ సంస్థగా భావిస్తున్న సిబిఐ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చేందుకు అధికారపార్టీ చేతుల్లో ఒక కీలుబొమ్మగా మారడం చాలా దురదృష్టకరం. సుప్రీంకోర్టులో కూడా బెయిలు దరఖాస్తు వేసినప్పుడూ ఇలాగే వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డిగారిని నిరంతరం జైలులో అట్టిపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో సిబిఐ పాలుపంచుకుంటోంది. సిబిఐ ఏమనుకుంటోందో అర్థం కావడం లేదు. అది రాజ్యాంగేతర శక్తేమీ కాదు. చట్టాలకు లోబడి పని చేయాల్సిన సంస్థ వ్యక్తిగత కక్ష సాధింపులకు పాల్పడడం ఘోరం. ఈ దేశంలో ఏం చేసినా చలామణి అవుతుందని సిబిఐ భావిస్తున్నట్లుంది. కానీ ప్రజలు అంతా గమనిస్తున్నారు. మీరు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల చేతుల్లో ఎలా కీలుబొమ్మగా వ్యవహరిస్తోందీ జనం గమనిస్తున్నారు. చూస్తూ కలకాలం ఊరుకోరు. తక్కువ అంచనా వేయవద్దు. తప్పనిసరిగా త్వరలోనే దీనికి ప్రజా ప్రతిస్పందన వస్తుంది.
శంకర్ రావు, ఎర్రన్నాయుడు కలిసి పిటిషన్ వేసినప్పుడు మూడువారాల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వమని కోర్టు చెబితే, అబ్బే రెండువారాలు చాలునని హడావుడిగా 29 టీములు పెట్టి దాడులు చేస్తున్నట్లుగా చేసి రెండువారాలకే సీల్డు కవర్లో నివేదిక ఇచ్చిన ఘనులు సిబిఐ వారు. మరి పదహారు మాసాల నుండి విచారణ జరుపుతున్నవారు కౌంటర్, చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ఎందుకు గడువులు కోరుతున్నారు? ఎందుకంటే చార్జ్‌షీట్ ఫైల్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి బెయిలు వస్తుందని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భావిస్తున్నాయి కాబట్టి. ఇలాంటి నీచమైన కుట్రలో భాగంగా  సిబిఐ పాలుపంచుకోవడం చాలా దురదృష్టకరం.
సాక్షులను బెదిరిస్తున్నది సిబిఐయే!
సుప్రీంకోర్టులో బెయిలు దరఖాస్తు వేస్తే, సిబిఐ లాయర్లు మూడు మాసాల్లో విచారణ పూర్తి చేసి చార్జ్‌షీట్ ఫైల్ చేస్తామన్నారు. బయటకు వచ్చిన తర్వాత సిబిఐ జెడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమకు కోర్టు ఏమీ గడువు షరతు విధించలేదంటారు. కోర్టులో చేసిన వాదనలకూ గౌరవం లేని పరిస్థితిని కల్పిస్తారు. 26 జీఓలకు సంబంధించిన కేసులో ఎంతో మందిని ముద్దాయిలుగా చూపారు. అందరి విషయంలో ఒకేలా వ్యవహరించరు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే 164 కింద రికార్డు చెస్తే బెయిలు ఇప్పిస్తామంటారు. కొందరినేమో కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తారు. సాక్షుల్ని బెదిరించే పని సిబిఐ తప్ప వేరెవరూ చేయడం లేదు. ఒక మంత్రికేమో బెయిలు సులువుగా వచ్చేస్తుంది. ఒక మంత్రికి రాదు. ఇద్దరూ ఒకే కేసులో ముద్దాయిలు. సిబిఐ ఇలా వ్యవహరించడం ధర్మమేనా? న్యాయమేనా? రాజకీయకక్షల్ని తీర్చుకోవడానికి సిబిఐ పావులా ఉపయోగపడడం ఘోరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయి ఈనెల 27కి ఆరుమాసాలు కావస్తుంది. జగన్ ఎప్పుడు బయటకు వస్తారని జనం అడుగుతున్నారు.  ఏవో సాకులు చెబుతూ ఒక ప్రజానాయకుడిని ఇలా నిర్బంధించడం సమంజసమేనా?  సిబిఐ ఒక రాజకీయ పార్టీలాగా వ్యవహరిస్తూ ఇంకా లీకులు ఇస్తూనే ఉంది. మీ వ్యవహారశైలిపై పునరాలోచించుకోండి.
ప్రజాస్పందన ఏ విధంగానైనా ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాడని ప్రజలు ఎన్నికల్లోనే తేల్చేశారు. లబ్ధి పొందడం అలా ఉంచి వికటిస్తుందని గమనించండి.
200 సీట్లు ఖాయం...
అటు కోర్టులోనూ, ఇటు ప్రజాకోర్టులోనూ పోరాటం చేస్తూనే ఉంటామనీ, ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఏ పరిస్థితుల్లో జరిగినా, సిబిఐ జాప్యం ఎత్తుగడలు ఎన్ని వేసినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండువందల స్థానాలకు మించి సీట్లను గెలుచుకుని అధికారంలోకి రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ఆధారం లేకుండా వార్త రాసిన 'ఆంధ్రజ్యోతిని ప్రశ్నించకుండా వైయస్ఆర్ సీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని తలకాయ పట్టుకుని పయ్యావుల కేశవ్ కంటతడి పెట్టుకోవడమేమిటని రాంబాబు విస్మయం వ్యక్తం చేశారు. వలసలు తప్పనిసరిగా ఉంటాయన్నారు. ఉమ్మారెడ్డి ప్రకటనను ఆయన ఈ సందర్భంగా ఉదాహరించారు. అంతటి సీనియర్ నాయకుడు మైండ్‌గేమ్ ఆడితే వస్తారా? అని రాంబాబు ప్రశ్నించారు. పార్టీ మారుతున్నారంటూ వార్తలు రాగా కంటతడి పెట్టిన పయ్యావులను చూసి, కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయించి తెలుగు దేశం పార్టీలో చేరి దానిని ముంచిన చంద్రబాబు సిగ్గుపడాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టిడిపి కూలుతున్న కోటలన్నారు.

Back to Top