హైదరాబాద్ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోను, మంత్రి హరీశ్ రావుతోను కుట్ర పన్నారంటూ టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలపై మాజీమంత్రి బొత్సా సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వేసిన ప్రశ్నలకు కౌంటర్ గా వైఎస్ఆర్ సీపీ.. చంద్రబాబుకు, టీడీపీకి 23 ప్రశ్నలు సంధించింది. ఇవి వాస్తవమో కాదో చెప్పాలని సవాల్ విసిరింది. సుజనా చౌదరిని ఢిల్లీ పంపి.. అక్కడ కేటీఆర్ కాళ్లు పట్టించిన మాట వాస్తవం కాదా అని బొత్స అడిగారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ కాళ్లు పట్టకునేందుకు సిద్ధమైన మాట నిజం కాదా అని నిలదీశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను ఉపయోగించి ఎన్డీయే పెద్దలందరినీ ప్రాధేయపడ్డారన్నారు. ఇక గవర్నర్ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అసలెందుకు ఇలాంటి పరిపాలన చేస్తారు.. ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, రాష్ట్రానికి సంబంధించి ఆయనతో ఏమైనా ఇబ్బంది ఉంటే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవాలనే తాము చెప్పామని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. ఒకరేమో గంగిరెద్దు అని, మరొకరేమో ధ్రుతరాష్ట్రుడని వ్యాఖ్యానించారన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మాత్రం ఎవరినీ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటున్నారని.. అంటే రాజీ చేసుకుందామనా అని ప్రశ్నించారు. సెక్షన్ 8 అప్పుడే అమలు జరిగిపోయిందా.. ఎందుకు తగ్గారని నిలదీశారు. తప్పులన్నీ మీదగ్గర పెట్టుకుని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి కుట్ర అంటారా అంటూ మండిపడ్డారు.