పోలవరంతో పాటు గిరిజనులూ ముఖ్యమే

  • పోలవరం కావాలి..బాధితులకు న్యాయం జరగాలి
  • బాబుకు పోలవరం కాంట్రాక్టర్‌పై ఉన్న ధ్యాస..భూములిచ్చిన రైతులపై లేదు
  • పట్టిసీమ బాధితులకు రూ.19 లక్షలు..పోలవరం నిర్వాసితులకు రూ.2 లక్షలేనా?
  • రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తోంది
  • మేమొచ్చాక ఎకరాకు రూ.19 లక్షల పరిహారం
  • పోలవరం ముంపు గ్రామాల్లో వైయస్‌ జగన్‌ పర్యటన
  • రంపచోడవరం నియోజకవర్గంలో బాధితులతో ప్రతిపక్ష నేత ముఖాముఖి
తూర్పు గోదావరి: పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో.. ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన గిరిజనులకు న్యాయం జరగడం కూడా అంతే ముఖ్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ అందరికీ కావాలని, ఇది నిర్మిస్తేనే ఆంధ్రప్రదేశ్‌ బాగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం నిర్మాణాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని..అయితే ఈ ప్రాజెక్ట్‌ కోసం త్యాగాలు చేసిన గిరిజనులకు న్యాయం జరగాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చే శారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న  జిల్లాలోని నాలుగు మండలాల్లో వైయస్‌ జగన్‌ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా రంపచోడవరంలో ఆయన బాధితులతో ముఖాముఖి నిర్వహించి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. 

వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని ధ్వజమెత్తారు. గిరిజనుల భూములు అన్యాయంగా లాక్కుంటున్నారని, వారికి న్యాయంగా రావాల్సిన పరిహారం కూడా ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులు న్యాయం చేయాలని వేడుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నాయని.. అయితే పోలవరం ముంపు బాధితులకు జరుగుతున్న నష్టం, అన్యాయంపై ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం కోసం భూములు త్యాగం చేసిన గిరిజనులకు న్యాయం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. భూములిచ్చిన రైతుల పరిస్థితి ప్రస్తుతం అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం గిరిజనుల భూములను అన్యాయంగా లాక్కుంటుందని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. బాధితులకు మంచి ప్యాకేజీ ఇవ్వాలన్న ఆలోచనే లేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్లపై చూపిస్తున్న ధ్యాస.. భూములిచ్చిన వారిపై చంద్రబాబు చూపడం లేదని ప్రతిపక్ష నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
చిచ్చుపెడుతున్న సర్కార్‌
ఒక్కొక్కరికి ఒక్కోలా ప్యాకేజీ ఇచ్చి స్థానికుల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోందని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ.2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అదే పట్టిసీమ బాధితులకు ఎకరాకు రూ.19 లక్షల చొప్పున పరిహారం చెల్లించారన్నారు. ఒక్కొక్కరికి ఒకలా పరిహారం ఇవ్వడం ధర్మమా? అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. స్థానికుల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతుందని మండిపడ్డారు. తక్కువ రేటు పొందిన వారు భూములు కొనుగోలు చేసే వీలు లేకుండా పోయిందన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలులో సర్కార్‌ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం భూమికి భూమి చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు ఒక్క ఎకరా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. అందరికీ ఒకే న్యాయం కావాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. గ్రామాలు ఖాళీ చేసే సమయంలో అప్పుడు ఉన్నవారందరికీ పరిహారం చెల్లించాలన్నారు. ఇప్పుడు అవార్డ్‌ ఫర్‌ ఎంక్వైరీ చేపడుతున్న తరుణంలో ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం చెల్లించాలన్నారు. ప్రతి కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే కనీసం రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

మహానేత పాలనలో భూమిపై హక్కు
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో గిరిజనులకు 8 లక్షల ఎకరాలపై  హక్కులు కల్పిõంచారని వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో బాధితులకు 165 పక్కా గృహాలు నిర్మించారని తెలిపారు. బాధితులకు భూమికి భూమి  ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరా ఇవ్వకపోగా భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఏ ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించడం లేదని ఫైర్‌ అయ్యారు. పోలవరం కావాలి, నిర్వాసితులకు న్యాయం’ జరగాలని వైయస్‌ జగన్‌ ఉద్ఘాటించారు.

పోలవరం బాధితులకు అండగా ఉంటాం
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు వైయస్‌ఆర్‌సీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  భరోసా ఇచ్చారు. పోలవరం కోసం భూములు ఇచ్చిన రైతులు, గిరిజనులకు న్యాయం జరిగేలా చంద్రబాబు సర్కారుపై ఒత్తిడి తీసుకున్నామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఎల్లకాలం సాగదని, ఇప్పుటికే మూడేళ్లు గడిచిపోయాయని, ఇంకా రెండేళ్లు ఓపిక పడితే ఆ తరువాత మన ప్రభుత్వం వస్తుందని, అది  ప్రజల ప్రభుత్వమని, అందులో పేదలకు న్యాయం జరుగుతుందని వైయస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. పోలవరం నిర్వాసితులు త్యాగాలు మర్చిపోమని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు రూ. 19 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇుచ్చారు. ఈ  సందర్భంగా పలువురు నిర్వాసితులను వైయస్‌ జగన్‌ మాట్లాడించారు.

సర్వం కోల్పోతున్నాం:  కిశోర్‌ సత్యనారాయణ
దేవిపట్నం మండలంలో 6 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. మేం ఐదుగురం అన్నదమ్ముళ్లం..మాకు 15 ఎకరాల భూమి ఉంది. అప్పట్లో ఎకరాకు రూ.2 లక్షల చొప్పున ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బులతో ఒక్క సెంటు భూమి కూడా కొనే పరిస్థితి లేదు.  పోలవరం కారణంగా సర్వస్వం కోల్పోతున్నాం. టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది. సరైన జవాబుదారితనం లేకుండా గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మాకు అన్నివిధాలా నష్టం చేశారు. భూమికి భూమి ఇస్తామని ఇవ్వలేదు. డబ్బులు తీసుకోని  2500 ఎకరాల రైతులు ఉన్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని అడుగుతున్నాం.
––––––––––––––––––
కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి: చల్లన్న దొర
ఉభయ గోదావరి జిల్లాల రైతుల మధ్య ప్రభుత్వం గొడవలు సృష్టిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రకంగా, తూర్పు గోదావరి జిల్లాలో మరోరకంగా భూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తున్నారు. మాకు 15 ఎకరాల పొలం ఉంది. అది పోలవరం ముంపునకు గురైంది. 2012లో భూములకు తక్కువ ధరలు ఇచ్చారు, ఇప్పుడు ఎక్కువ ధరకు భూములు తీసుకుంటున్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మాకు పరిహారం ఇవ్వాలి. అందరికీ ఒకే విధంగా న్యాయం చేయాలి.  
––––––––––––––––––
చదువుకున్న వారికి ఉద్యోగం ఇవ్వాలి: శ్రీను
అందరి ఆమోదంతో పోలవరం కట్టండి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 20 ఏళ్ల పాటు మా జీవనోపాధికి ప్రభుత్వం హామీయివ్వాలి. నిర్వాసితుల కుటుంబంలో చదువుకున్న వారికి పర్మినెంట్‌ ఉద్యోగం ఇవ్వాలి. పట్టిసీమ నిర్వాసితులకు ఇచ్చినట్టుగా పరిహారం కల్పించాలి. 6 పంచాయతీలు ముంపు ఎదుర్కొంటున్నాయి. మిగిలిన 8 పంచాయతీల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు.

 

 
Back to Top