లింగారావుపాలెం (గుంటూరు జిల్లా), 11 మార్చి 2013: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీసీలకు ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అసలు బీసీలంటే ప్రేమే లేదని ఆమె వ్యాఖ్యానించారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ సరళికి, దానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్న చంద్రబాబు తీరుకు నిరసనగా శ్రీ జగన్ తరఫున శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర సోమవారం 87వ రోజున గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో కొనసాగింది. శ్రీమతి షర్మిల లింగారావుపాలెంలో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశేష జనవాహినిని ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.
దాడి వీరభద్రరావు బీసీ వర్గానికి చెందిన వారు కనుకనే ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదని శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఆయనకు మళ్ళీ సీటు ఇస్తానని హామీ ఇచ్చి మొండిచెయ్యి చూపించడాన్ని ఆమె తప్పుపట్టారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఆయనకే ద్రబాబు అలా చేశారంటే ఇక సామాన్య బడుగుజీవుల పట్ల ఆయనకున్న అక్కర, అభిమానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుకు బీసీ ఓట్లపైనే ప్రేమ తప్ప బీసీలపై కాదు అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.
డైలాగులతో బాబు డ్రామాలు :  2009 ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే కేవలం 44 సీట్లు మాత్రమే వారికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. మాట ఇవ్వడం అన్నా, దాని మీద నిలబడడం అన్నా చంద్రబాబుకు తెలిసిన అర్థం అది. తొమ్మిదేళ్ల పాలనలో బీసీల పురోగతి కోసం చంద్రబాబు చేసింది శూన్యం. కానీ ‘వస్తున్నా.. మీ కోసం’ పేరిట పాదయాత్ర చేస్తూ డైలాగులు చాలానే చెబుతున్నారు. డ్రామాలాడడంలో ఆయనకు ఆయనే సాటి అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.
బీసీ సీట్లపై జగనన్న ప్రతిపాదనకు స్పందన లేదు :  బీసీల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీసీలకే టిక్కెట్లు ఇవ్వాలన్న జగనన్న ప్రతిపాదనకు కాంగ్రెస్, టిడిపి సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించలేదని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేస్తే అసెంబ్లీకి కనీసం వంద మందిని పంపించే వీలు ఉంటుందని జగనన్న ప్రతిపాదించారన్నారు. బీసీల గురించి ఎవరైనా ఆలోచన చేశారూ అంటే ఇక ముందు కూడా ఆలోచన చేస్తారంటే అది కేవలం జగనన్న మాత్రమే అని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.
మహానేత ఆశయాలకు తిలోదకాలు :  రాష్ట్రంలో ఇప్పుడున్నది కాంగ్రెస్ పాలన. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న వీళ్లు.. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను మాత్రం పక్కన పడేశారు. వైయస్ ఉన్నప్పుడు ఏ ఒక్క చార్జీ కూడా పెంచలేదు. దానికి తోడు మరిన్ని ఉచిత పథకాలు అమలు చేశారు. లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. ఫీజు రీయింబర్సుమెంటుతో ఎంతో మంది పేద యువత ఉన్నత విద్యావంతులయ్యారు. ఆరోగ్య ప్రదాయని 108, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. కానీ ప్రజలపై ఒక్క రూపాయి భారం కూడా మోపలేదు. కానీ ప్రస్తుత సిఎం కిరణ్ కుమార్‌రెడ్డికి పేదలంటే లెక్కేలేదని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

బడుగుల బాగు కోసం పరితపించిన వైయస్:బీసీ సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చిత్తశుద్ధితో కృషి చేశారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. పేదలు, బీసీలకు ఉచితంగా ఉన్నత చదువులు చెప్పించారన్నారు. లక్షలాది పక్కా ఇళ్లు కట్టించారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా ఉన్నత స్థాయి వైద్యం అందజేశారన్నారు. బీసీలకు మహానేత వైయస్ 2009లో 77 స్థానాలు కేటాయించారని చెప్పారు. అట్టడుగు వర్గాలను ఉన్నత స్థాయిలోకి తేవాలని ఆయన పరితపించారన్నారు. మహానేత వైయస్‌ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, జగనన్న ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు మేలు జరుగుతుందని శ్రీమతి షర్మిల అన్నాది. తాగు, సాగునీరు సకాలంలో వస్తాయి. పక్కా ఇళ్లు, నున్నని రోడ్లు, కాలువలతో గ్రామాలు కళకళలాడతాయని ఆమె భరోసా ఇచ్చారు.
సోమవారంనాడు శ్రీమతి షర్మిల మొత్తం 14.3 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సోమవారం పాదయాత్ర షెడ్యూల్ ముగిసే సమయానికి శ్రీమతి షర్మిల 1200.7 కిలో మీటర్లు నడిచారు.