బాబు పాలనలో బీసీలకు అన్యాయం

  • బీసీలను బాబు ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు
  • ప్రతి పేద విద్యార్థిని ఉచితంగా చదివించిన ఘనత వైయస్ఆర్ ది
  • బాబు విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపారు
  • ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వకపోవడం బాబు నిరంకుశ పాలనకు పరాకాష్ట

ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌
వెలగపూడి: చంద్రబాబు నాయుడు బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. బీసీ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు వారికి తీరని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే బీసీ సంక్షేమ నిధి కింద ప్రతీ సంవత్సరం రూ. 10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా దానికి నిధులు ఖర్చు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమంపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు నిమిషాల అవకాశం ఇవ్వపోవడం చంద్రబాబు నిరంకుశ పాలనకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్‌గానే చేశాయి కానీ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బీసీ విద్యార్థుల కోసం ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ చలవతో లక్షలమంది విద్యార్థులు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదువులు చదివి ఉద్యోగులయ్యారన్నారు. చంద్రబాబు హయాంలో గత మూడు సంవత్సరాలుగా ఫీజురియంబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోగా, ఫీజుల భారాన్ని విద్యార్థులపై మోపారని ఫైరయ్యారు. బీసీల సమస్యపై వైయస్‌ జగన్‌ మాట్లాడితే చంద్రబాబు వారిపై చూపించే కపటప్రేమ ఎక్కడ బయటపడుతుందోనని అవకాశం ఇవ్వలేదన్నారు. కొత్త రాజధాని నూతన అసెంబ్లీ భవనంలోనైనా మనుషులు, పద్దతులు మారివుంటాయని అనుకుంటే కొత్త సీసాలో పాత సారాలాగే సర్కార్‌ వైఖరి ఉందన్నారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటాలు తప్ప బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తీసుకొస్తామన్నారు. అదేమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు మోసాలు పక్కనబెట్టి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

బీసీలకు పెద్దపీట వేసేది వైయస్సార్సీపీనే
బీసీలకు చంద్రబాబు ఏమాత్రం న్యాయం చేయడం లేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న బీసీ రైతులు బాబు పాలనలో పిల్లలను చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు. కాలేజీల్లో 80వేల ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం కనీసం 35వేలు కూడా కేటాయించకపోవడంపై మండిపడ్డారు. ప్రతి పేద విద్యార్థిని ఉచితంగా చదివించి డాక్టర్లు, ఇంజినీర్లు చేసిన ఘనత వైయస్ఆర్ దని కొనియాడారు. వాల్మీకి జాతికి ఫెడరేషన్ అని చెప్పి 100కోట్లు కేటాయిస్తామన్న బాబు రూ.100కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు.ఇంతకన్నా దరిద్రమైన ప్రభుత్వం మరొకటి ఉండదని నిప్పులు చెరిగారు. టీడీపీ పాలనలో బీసీలకు ఎలాంటి న్యాయం జరగదని, బీసీలకు పెద్దపీట వేసేది వైయస్సార్సీపీ మాత్రమేనన్న సంగతి బీసీ ప్రజలంతా గుర్తుంచుకోవాలన్నారు.  


Back to Top