జగన్మోహన్ రెడ్డికి బెయిలు మంజూరు

హైదరాబాద్ 23 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిలు మంజూరైంది. రెండు లక్షల రూపాయల పూచికత్తు, ఇద్దరి హామీ, సాక్షులను ప్రభావితం చేయకూడదన్న మూడు షరతులతో  నాంపల్లి సీబీఐ కోర్టు సోమవారం బెయిలు మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్ళరాదని కూడా తీర్పులో పేర్కొన్నారు. సోమవారం ఉదయం నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులతో సహా రాష్ట్ర ప్రజలంతా నాంపల్లి కోర్టు తీర్పుపై ఉత్కంఠగా ఎదురు చూశారు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు సీబీఐ న్యాయమూర్తి శ్రీ జగన్మోహన్ రెడ్డికి బెయిలు మంజూరు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. తీర్పు వెలువడిన వెంటనే పార్టీ కార్యాలయంలో హర్షధ్వానాలు మిన్నంటాయి. బాణసంచ కాల్పులతో దద్దరిల్లింది. 484 రోజుల అనంతరం ఆయనకు బెయిలు లభించింది. ఇంతకు ముందు మొత్తం ఆరుసార్లు బెయిలు పిటిషను దాఖలు చేశారు. విచారణ పూర్తయ్యిందని పేర్కొనడంతో ఏడోసారి దాఖలు చేసిన బెయిలు పిటిషనుపై వాదనల అనంరం బెయిలు మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
తొలుత సీబీఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ తన వాదనలను వినిపించిన సీబీఐ లాయర్ శ్రీ జగన్ కేసులో క్విడ్ ప్రో కో చోటుచేసుకున్నట్లు ఎలాంటి ఆధారమూ లభించలేదని తెలిపారు. ఈ విషయాన్ని పేర్కొంటూ ఒక మెమోను దాఖలు చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది.

మంత్రి డెవలపర్సు, జూబ్లీ కమ్యూనికేషన్సు, సండూర్ పవర్, కార్మెల్ ఆసియా, ఆర్ఆర్ గ్లోబల్, పివిపి బిజినెస్ వెంచర్సు, క్లాసిక్ రియాలిటీ, సరస్వతి పవర్, ఇండస్ట్రీస్ సంస్థలు శ్రీ జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఆ మెమోలో వివరించింది.
కోల్‌కతా కేంద్రంగా నడుస్తున్న 16 కంపెనీకు సంబంధించిన విచారణ నివేదికను ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులకు సమర్పించామనీ, అవి విచారణను కొనసాగిస్తాయనీ కూడా ఆ మెమోలో పేర్కొన్నారు.  
మే 27 2012న సీబీఐ అరెస్టు చేసింది. మూడు రోజుల పాటు హైదరాబాద్ దిల్‌కుషా అతిథి గృహంలో విచారించిన అనంతరం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మాజీ మంత్రి డాక్టర్ శంకరరావు, టీడీపీ నాయకుడు అశోక్ గజపతి రాజు దాఖలు చేసిన ఫిర్యాదులతో హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కేసులో సీబీఐ 73మందిని విచారించి, అనేక కంపెనీలను సోదా చేసింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top