బాబుది తుగ్లక్ పాలన

భీమవరంః నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు శుక్రవారం నుంచి గడపగడపకు వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెలే, వైయస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ గ్రంథి శ్రీనివాస్‌ చెప్పారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాలన తుగ్లక్‌ పరిపాలనను మరిపిస్తుందని విమర్శించారు. పేదలకు చౌకడిపోల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర వస్తువులను నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలు, డీలర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరక్ష్యరాస్యులు అధికంగా ఉండే గ్రామాల్లో సైతం నగదు రహితంపై ముందుగా ఎటువంటి అవగాహనా కల్పించకుండా ఆ విధానాన్నిఅమలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఫిబ్రవరిలో 10 రోజులు గడిచిపోతున్నా పేదలు చౌకడిపోల నుంచి నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లలేక అవస్థలు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకొక కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతూ పేద వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి ఏకరువు పెట్టేందుకే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. శుక్రవారం నుంచి భీమవరం పట్టణంలోని 29వ వార్డులో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సమస్యల పరిష్కారానికి అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేపడతామని శ్రీనివాస్‌ హెచ్చరించారు. 
 
Back to Top