బాబు అభివృద్ధి మాటలన్నీ పచ్చిఅబద్ధాలు


ఇల్లుకు అర్జీ పెట్టుకుంటే జగన్‌ పార్టీ అని వేరుచేస్తున్నారు

ఎవరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటానని వైయస్‌ జగన్‌ హామీ

గుంటూరు: ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని చంద్రబాబు చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని పెద్దకూరపాడు నియోజకవర్గం పాటిబండ్ల గ్రామ ముస్లింలు ధ్వజమెత్తారు. పార్టీల పేరు చెప్పి సంక్షేమ పథకాలు ప్రజలకు అందనివ్వకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు వారి సమస్యలన్నింటినీ వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పెద్దకూరపాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాటిబండ్ల చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు రాజన్న బిడ్డను కలుసుకొని వారి సమస్యలు చెప్పుకున్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందామని, ముస్లింలకు ప్రత్యేకంగా 4 శాతం రిజర్వేషన్‌లు కల్పించారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు నాలుగేళ్లుగా ముస్లింలను మోసం చేశాడన్నారు. ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే.. మీరు జగన్‌ పార్టీ వారని ఇల్లు ఇవ్వడం లేదని వాపోయారు. కానీ వైయస్‌ఆర్‌ పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందించారన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి పెన్షన్‌ రావడం లేదని ఓ వృద్ధ ముస్లిం మహిళ వైయస్‌ జగన్‌కు తన సమస్య చెప్పుకుంది. ఈ మేరకు జననేత స్పందిస్తూ అధికారంలోకి వచ్చాక ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తానని, ఎవరికీ ఏ కష్టం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. 
Back to Top