- వైయస్ జగన్ మోడీని కలిస్తే ఎందుకంత ఉలికిపాటు
- దోచుకున్న డబ్బును ఎక్కడ కక్కిస్తారోనన్న భయంలో బాబు సర్కార్
- ప్రతిపక్షనేత ప్రధానిని కలిస్తే తప్పేంటీ?
- చంద్రబాబు అవినీతి చిట్టాను మోడీకిచ్చిన వైయస్ జగన్
- ఓటుకు కోట్లు కేసు విచారణ చేస్తారన్న భయంలో టీడీపీ
- కల్లుతాగిన కోతుల్లా చిందులేస్తున్న మంత్రులు
- వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే టీడీపీ నేతలకు ఎందుకంత ఉలికిపాటని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. వైయస్ జగన్ ప్రధానిని ఎందుకు కలిశారో మీడియాకు వివరించినా.. టీడీపీ నేతలు ఇంకా భయంతో వణికిపోతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీని ప్రతిపక్షనేత కలిస్తే తప్పేంటని నిలదీశారు. కేసులు మాఫీ చేసుకోవడానికి మోడీని వైయస్ జగన్ కలిశారని వంకర కూతలు కూసిన టీడీపీ నేతలుపై రోజా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పరిపాలనను గాలికొదిలేసి ప్రజలను బాబు అష్టకష్టాలు పెడుతుంటే... ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సమస్యలను దూరం చేయడానికి మోడీని ప్రతిపక్షనేత కలిశారన్నారు. అధికార పార్టీ నేతలు చేయాల్సిన పనిని బాధ్యతగా ప్రతిపక్షనేత చేస్తే దానికి విమర్శలు చేస్తారా అని నిలదీశారు. కేసులు కోర్టులు చూసుకుంటాయ్.. వైయస్ జగన్ ఏమైనా చంద్రబాబు అనుకుంటున్నారా.. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోవడానికి, వైయస్ జగన్ చంద్రబాబు అనుకుంటున్నారా.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి దొంగలా పారిపోవడానికి, వైయస్ జగన్ తుప్పుబట్టిన బాబు అనుకుంటున్నారా.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి అని టీడీపీ నేతలకు చురకలంటించారు. చంద్రబాబు తన అవసరాల కోసం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టగల ఘనుడని రోజా విమర్శించారు. ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయినప్పుడు సెక్షన్ 8 పెడతానని బీరాలు పలికిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి కృష్ణానది ఒడ్డున అక్రమ నిర్మాణంలో తలదాచుకుంది అందరికీ తెలిసిన సత్యం అన్నారు. తనకు రాజకీయంగా దెబ్బపడుతుందనుకుంటే ఎవరిపైనైనా నిందలు వేయడానికి వెనుకాడడని స్పష్టం చేశారు.
బాబు జైలుకెళ్తాడని టీడీపీ నేతలకు చెమటలు
చంద్రబాబు అవినీతి చిట్టాను మొత్తం వైయస్ జగన్ ప్రధాని మోడీ చేతికి ఇచ్చారని తెలియగానే టీడీపీ నేతలకు పిచ్చిపట్టినట్లుగా అయ్యిందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అమెరికా నుంచి చంద్రబాబు ఇండియాకు రాగానే ఓటుకు కోట్ల కేసు విచారణ ఎక్కడ ప్రారంభిస్తారోనని టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. ఓటుకు కోట్లు కేసు విచారణ స్టార్ట్ చేసి చంద్రబాబు జైలుకు వెళితే టీడీపీకి దిక్కెవరని వారికి చెమటలు పడుతున్నాయని, అందుకే కల్లుతాగిన కోతుల్లా చిందులేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో లోకేష్ నుంచి మంత్రి పుల్లారావు వరకు చంద్రబాబు బినామీలంతా ఎంత మెక్కారో.. అవన్నీ ఎక్కడ కక్కిస్తారోనని భయంతో ఉన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టులో అడ్డగొలుగా దోచుకున్న కమీషన్లపై విచారణ వస్తే పరిస్థితి ఏంటని టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైందన్నారు. అమెరికాలో ఉన్న చంద్రబాబుకు పిచ్చెక్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తన మంత్రులను ఉసిగొలిపి ఇలా మాట్లాడిస్తున్నారని రోజా మండిపడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ పనికిరాడని, రాష్ట్రంలోకి వస్తే ఉరితీస్తారన్న చంద్రబాబు ఎన్నికల్లో పొత్తెందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను పట్టించుకోకుండా బాబు తన కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు.
వైయస్ జగన్‌ను నేరుగా ఎదుర్కోలేకే నీచ రాజకీయాలు
వైయస్ జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. కాంగ్రెస్‌తో చేతులు కలిసి జననేతపై దొంగ కేసులు పెట్టించింది వాస్తవమా.. కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ఏ తప్పు చేయని వైయస్ జగన్ నిర్ధోషిగా బయటకు వస్తారన్నారన్నారు. గౌరవప్రదమైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్టు చేస్తున్నామని వైయస్ జగన్ ప్రకటించగానే కేసుల కోసం బీజేపీతో కలిసిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేరుగా కేంద్రాన్ని తిట్టలేక వైయస్‌ఆర్‌సీపీపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చకామెర్ల వాడికి లోకం పచ్చగా కనిపిస్తుందన్న సామెత ఈ పచ్చ పార్టీ కోసమే కనిపెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మోడీపై చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ నేతలకు నమ్మకం లేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు ఇస్తే కలిసిపోయినట్టా అని రోజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆడియో, వీడియో టేపులతో సహా ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు తనపై ఉన్న కేసులను స్టే తెచ్చుకోకుండా ఒక్కటైనా ధైర్యంగా ఎదుర్కున్నారా అని ప్రశ్నించారు.
ప్రజల కోసం వైయస్ జగన్ ఎన్నో పోరాటాలు, దీక్షలు
తన సొంత జిల్లాకు, సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేని ఇరిగేషన్ మంత్రి దేవినేనికి వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పట్టిసీమలో రూ. 400 కోట్లు దోచుకున్న ఉమా ప్రతిపక్షనేతపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అదే విధంగా అడ్డగొలు మంత్రి అచ్చెన్నాయుడును చూసి సొంత జిల్లా ప్రజలే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ బిక్షపెట్టిన తన అన్న కుటుంబాన్ని కూడా అచ్చెన్నాయుడు ఏ విధంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. రాజకీయంగా నష్టం వస్తుందని, ఆరోగ్యానికి హాని కలుగుతుందని తెలిసినా.. తన తండ్రి మహానేత వైయస్‌ఆర్ చూపిన బాటలో ప్రజల కోసం జగన్ ఎన్నో పోరాటాలు, దీక్షలు చేశారన్నారు. పత్రికలు వాస్తవాలు తెలియనివ్వకుండా ప్రజలను పక్కదారిపట్టించడం వల్లే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమ, దోపిడీ పాలనపై వైయస్ జగన్ ప్రధాని మోడీకి క్షుణ్ణంగా వివరించారని రోజా మరోసారి స్పష్టం చేశారు.