బాబు అవినీతి గురించి మాట్లాడడమా?

ఓటుకు కోట్లు
వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి
నోటి వెంట అవినీతి అనే పదం వినిపించే సరికి చిత్తూరు జిల్లా ప్రజలకు నోటమాట రాలేదు.
రాష్ర్టంలో అవినీతి పెరిగిపోతోందని, దానిని పారదోలేంత వరకు నిద్రపోనని
చంద్రబాబు శపథం చేసేసరికి జనానికి మూర్ఛ వచ్చినంత పనైందట. ప్రభుత్వ శాఖల్లో ఒక్క పైసా
కూడా అవినీతి జరగకుండా చూస్తానని, ప్రజలకు అవినీతి రహిత పాలన
అందిస్తానని చంద్రబాబు చెబుతుంటే జనానికి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. అంతేకాదు అభివృద్ధిని
తాను యజ్ఞంలా చేస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారు. అభివృద్ధిని కాదు అవినీతిని ఆయన
యజ్ఞంలా చేస్తున్నారు. పట్టిసీమ మొదలుకుని చంద్రన్న కానుకల వరకు ప్రతి కార్యక్రమంలోనూ
అవినీతి ఏరులై పారుతున్న సంగతి జనానికి తెలియదని ఆయన అనుకుంటున్నట్లున్నారు. తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేని ఐదుకోట్లతో కొనడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయి
కూడా మరలా అవినీతి రహిత పాలన అందిస్తానని చంద్రబాబు చెబుతుండడం జనానికి ఆశ్చర్యం కలిగించింది.  తెలంగాణ ప్రభుత్వంతో కలసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తప్పుడు
రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించడం చూస్తే ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడడం
కోసమే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని జనం చర్చించుకోవడం కనిపించింది. ఎమ్మెల్యే
ఓట్లు కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి వేరెవరినో అనడమెందుకని ప్రజలు వ్యాఖ్యానించడం
కనిపించింది.

Back to Top