రాబోయే రోజుల్లో గుండుసూదులై గుచ్చుకుంటాయ్‌

నెల్లూరు: ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో గుండు సూదులై గుచ్చుకుంటాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా చంద్రబాబు పాలన ఉందని మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని వీఆర్‌ కళాశాల మైదానంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్ష వేదికపై మేరుగు మాట్లాడుతూ.. రాష్ట్రానికి విభజన అంశాలను సాధించాల్సిన చేతులు ఎత్తేసి.. ప్రత్యేక హోదాను గాలికొదిలేశాడని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం అనేక ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రజలకు అండగా నేను ఉన్నానంటూ అనేక పోరాటాలు చేశారన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఒక సంజీవని, భావితరాలకు ఉపయోగపడే అంశం అని వైయస్‌ఆర్‌ సీపీ హోదా కోసం పోరాడుతుందన్నారు. 

ప్రత్యేక హోదా అంటే జైలుకే అని ఉద్యమకారులపై అనేక కేసులు బనాయించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ వైయస్‌ జగన్‌కు ఎక్కడ క్రెడిట్‌ వస్తుందోనని హోదా అని నాటకం ఆడుతున్నాడన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అని, హోదాతో ఒరిగేది ఏముందని అనేక కుట్రలు చేశాడని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను ఏ ఒక్కటి నెరవేర్చని ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. అన్ని సామాజిక వర్గాలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేశాయని వంచనపై గర్జన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. వైయస్‌ జగన్‌ చేస్తున్న దీక్షలు, పోరాటాలు, ప్రజల్లోకి వెలుతున్న తీరును ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. 
Back to Top