బాబు అండ్ కో ముందే సర్దుకున్నారు

విజయవాడ :పెద్దనోట్ల రద్దు చంద్రబాబుకు ముందే తెలుసని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  క్రెడిట్ కొట్టేసేందుకు ముందుగా ఆయన మోదీకి లేఖ రాశారని చెప్పారు. పెద్దనోట్ల రద్దు ప్రక్రియ అంతా సాఫీగా జరిగి ఉంటే చంద్రబాబు దాని క్రెడిట్ తీసుకునేవారని, కానీ ఇప్పుడు బాగా జరగలేదు కాబట్టి మోదీ బ్యాడ్ అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన అనుయాయులు అన్నీ ముందే చక్కబెట్టేసుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుకు సరిగ్గా రెండు రోజుల ముందే హెరిటేజ్ షేర్లను ఆయన ఫ్యూచర్ గ్రూపునకు అమ్మేశారని, ఇది ఎలా చేయగలరని ప్రశ్నించారు. ఐటీ దాడుల్లో పెద్దపెద్దోళ్ల ఇళ్లల్లో కోట్లకు కోట్ల కొత్తనోట్లు దొరుకుతున్నాయనని.. బీదవాళ్లు మాత్రం క్యూలో నిలబడి గట్టిగా రెండు వేలు తెచ్చుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు. ఇది బ్లాక్‌మనీ మీద పోరాటమా లేక పేదలను కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలనే ఆరాటమా అని ప్రశ్నించారు. 
 
పెద్దనోట్ల రద్దు అనేది నల్లధనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం కాదని, పన్నుల పరిధిలోకి మరింతమందిని తీసుకురావాలన్న దృక్పథంతోనే ఇది జరుగుతోందని అన్నారు. మొత్తం రద్దయిన 14.5 లక్షల కోట్లలో ఇప్పటికే 13 లక్షల కోట్లు వచ్చేశాయని, నెలాఖరులోగా మిగిలిన డబ్బులు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. మన దేశంలో 90 శాతం నగదు ఆధార ఆర్థిక వ్యవస్థేనని తెలిపారు. వ్యవసాయ రంగం మొత్తం నగదు లావాదేవీల మీదే ఆధారపడి ఉందన్నారు.
Back to Top