బాబూ.. పాదయాత్ర ఆపు: శ్రీనివాసులు

రైల్వేకోడూరు: రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ఆపుకోవాలని ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైయస్ అతిథి గృహంలో విలేకరుల సమావేశం వారు మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్న 9 ఏళ్లలో వర్షాలు రాక రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే సకాలంలో వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండేదన్నారు. ఆయన అకాల మరణం తరువాత రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. వైఎస్ పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకొని సీఎం అయ్యాక ప్రజలకు మంచి సేవలందించారన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా నేడు చంద్రబాబు పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయని, చంద్రబాబు పాదయాత్రతో పడే వర్షాలు కూడా ఆగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్, ఉప కన్వీనర్ రౌఫ్, ఆర్‌వీ రమణ పాల్గొన్నారు.

Back to Top