'అవిశ్వాసం' పెడతాం, మీరు మద్దతు ఇస్తారా?

హైదరాబాద్ 15 నవంబర్ 2012 : "అసెంబ్లీ వేదికగా ప్రజాసమస్యలను చర్చించడం కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై మేము 'అవిశ్వాస తీర్మానం' ప్రవేశపెడితే మీరు మద్దతు ఇస్తారా?" అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు డాక్టర్ ఎం.వి.మైసూరా రెడ్డి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిపాలన అన్నదే లేకుండా పోయి రాజకీయ అనిశ్చితి నెలకొన్నదనీ, అవిశ్వాస తీర్మానానికి ఇంతకంటే అనువైన సమయం లేదనీ ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు 'అవిశ్వాసాన్ని' ఆయుధంగా చేసుకుని గుర్తింపు ఉన్న ప్రధాన ప్రతిపక్షమే అవిశ్వాసం పెట్టాలని ఆయన అన్నారు. వైయస్ఆర్ సీపీ  కేంద్ర కార్యాలయంలో గురువారం మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా కుశంకలు లేవనెత్తకుండా 'అవిశ్వాసం' పెట్టేందుకు టీడీపీ ముందుకు రావాలన్నారు. టిడిపి 'అవిశ్వాసం' పెడితే తాము తప్పక మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. అవిశ్వాసం పెడితే బేరసారాలు ఎవరు చేసుకుంటారో కూడా ప్రజలకు తేటతెల్లమౌతుందన్నారు. టీడీపీ మద్దతు ఇస్తే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి తాను సిద్ధమేనన్నారు.
ఆయన మాటల్లోనే...
"ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు సరఫరా ఆందోళనకరంగా ఉంది. పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి ఉంది. రైతాంగం నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. దీన్నంతా పట్టించుకోకుండా కరెంట్‌పై సర్‌చార్జ్‌ మాత్రం విధిస్తున్నారు. సద్దికంటే ఊరగాయ ఖర్చెక్కువైనట్లు.. చార్జి కంటే రెండింతలు సర్‌చార్జీ. ఆర్టీసీ చార్జీలు కూడా పెంచి ప్రజలపై భారం మోపారు. వినిమయవస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించిపోయింది. సంక్షేమపథకాలు పడకేసాయి. పరిపాలన అస్తవ్యస్తం. అసలే లేదని చెప్పవచ్చు. కేబినేట్ మంత్రులు రోజూ  పోట్లాడుకోవడం, సయోధ్య చేసుకోవడం, ఢిల్లీకి పరిగెత్తడం జరుగుతోంది. రాజకీయ అనిశ్చిత స్థితి కూడా ఉంది. రాజకీయపార్టీలలో, ప్రభుత్వంలో, ప్రజలలో ఒక విధమైన అనిశ్చితి ఏర్పడింది. కనుక అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ఇంతకంటే అనువైన సమయం మరొకటి ఉండదు. ప్రజాశ్రేయస్సు కోరేవారు, ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నవారికి శాసనసభను వేదికగా ఉపయోగించుకుని అవిశ్వాసం అనేది రాజకీయ పార్టీల చేతుల్లో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం చేతిల్లో ఆయుధం. ఆ ఆయుధాన్ని ప్రయోగించి ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని నిలదీసి శాసనసభను వేదికగా ఉపయోగించుకోవాలి. అవిశ్వాసం అంటే కేవలం ప్రభుత్వాన్ని కూల్చడమనే కాదు. ప్రజాసమస్యల పరిష్కారానికి అవిశ్వాసం ఉపయోగపడుతుందన్నది మా పార్టీ అభిప్రాయం. నైతికంగా ప్రభుత్వానికి బలం లేకపోతే అది బలనిరూపణకు కూడా ఉపకరిస్తుంది.అందుకే అవిశ్వాసం పెట్టమని టిడిపిని కోరుతున్నాం. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టమంటే ఏవేవో కుశంకలు లేవనెత్తడం, సమస్యను పక్కదోవ పట్టించడం బాధ్యత కలిగిన ప్రతిపక్షానికి సరికాదు. చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల నిబద్ధత ఉంటే అవిశ్వాసం ప్రవేశపెట్టాలి. బేరసారాలు చేసుకుంటారని అంటున్నారు. మరి అవిశ్వాసం పెడితే బేరసారాల సంగతి కూడా తేలిపోతుంది. ప్రజలకు ఎవరు బేరసారాలు చేసుకున్నారో తేటతెల్లమౌతుంది కదా! మీరు ఏ బేరసారాలు చేసుకుని ప్రవేశపెట్టడం లేదో కూడా తెలుస్తుంది. మీరు ప్రవేశపెట్టవచ్చు కదా అంటున్నారు. కానీ మాకు తగినంత సంఖ్యాబలం లేదు. ఒక్క సభ్యుడైనా అవిశ్వాసం నోటీసు ఇవ్వవచ్చు. కానీ శాసనసభలో అవిశ్వాసం చర్చకు రావాలంటే పదింట ఒకవంతు శాసనసభ్యుల బలం ( 30 మంది ఎమ్మెల్యేల మద్దతు) కావాలి. లేనిదే అది చర్చకు రాదు. ఊరకే నోటీసు ఇస్తే ప్రయోజనం ఏముంటుంది? మీలో కొందరు కలిశారు కదా? అంటున్నారు. కానీ ఆ బలం కూడా సరిపోదు. దాని వల్ల అనర్హత వేటుపడి ఉప ఎన్నికలే వస్తాయి. ప్రజాధనం దుర్వినియోగమౌతుంది. పరిపాలన వైఫల్యం చెందిందని బయట మాట్లాడే బదులు శాసనసభ వేదికగా అవిశ్వాసం పెట్టాలి. మీకు సంఖ్యాబలం ఉంది కనుక మీరు ప్రవేశపెట్టండి. లేదా మేం ప్రవేశపెడతాం. మీరు మద్దతు ఇవ్వందే అది చర్చకు రాదు. బాధ్యత గల ప్రతిపక్షంగా మీరు మద్దతు ఇస్తారా?" అని మైసూరా సూటిగా ప్రశ్నించారు.
టీఆర్ఎస్ కానీ, వైయస్ఆర్ సీపీ కానీ శాసనసభలో గుర్తింపు ఉన్న రాజకీయ గ్రూపులు కావని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సంఖ్యాపరంగా తమకు గుర్తింపు ఇవ్వవలసి ఉన్నా స్పీకర్ ఆ గుర్తింపు ఇంతదాకా ఇవ్వలేదన్నారు. కానీ గుర్తింపు ఉన్న ప్రతిపక్షంగా టీడీపీకి బాధ్యత ఉందన్నారు. అవసరమైతే గవర్నర్‌ను శాసనసభను సమావేశపరచమని అడుగుతామన్నారు. శాసనసభ నియమావళి ప్రకారం ప్రధాన ప్రతిపక్షానికి కొన్ని బాధ్యతలు ఉంటాయన్నారు. వాటిని టీడీపీ నిర్వర్తించడానికి ముందుకు రావాలన్నారు. ప్రతిపక్షం తన బాధ్యతలు విస్మరిస్తే గుర్తు చేయాల్సిన అవసరమూ ఉందన్నారు. అందుకే అవిశ్వాసం పెట్టాలంటూ కోరుతున్నామన్నారు. ప్రజల సమస్యలపై మొత్తం మంత్రివర్గం సమాధానం చెప్పేది ఒక్క అవిశ్వాస తీర్మానం పైనేనన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే ప్రభుత్వంతో ప్రధాన ప్రతిపక్షం లాలూచీ పడిందనుకోవలసి వస్తుందన్నారు.
30 ఎంపీ సీట్లు వస్తాయి :
ఎన్నికలు జరిగితే వైయస్ఆర్ సీపీ జాతీయ రాజకీయాల్లో సైతం కీలక పాత్ర పోషిస్తుందని మైసూరా రెడ్డి అన్నారు. "కాంగ్రెస్‌తో బేరసారాలంటున్నారు, నిజానికి ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దేశమంతా కలిపి 60, 70 సీట్లు కూడా రాకపోవచ్చు. ఈ సారి కేంద్రంలో కాంగ్రెస్సేతర, బిజెపియేతర ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రాంతీయపార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నికల్లో 25 నుండి 30 స్థానాలు సంపాదించుకుంటుందని సర్వేలున్నాయి. దేశంలోనే కాంగ్రెస్సేతర, బిజెపియేతర పక్షాల్లో నంబర్ టూ పార్టీ కావచ్చు. కాబట్టి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుంది." అని మైసూరా రెడ్డి అన్నారు.

Back to Top