టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా నంద్యాల వైయస్‌ఆర్ సీపీదేవైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిరమేష్బాబు ఇంటిపై అర్థరాత్రి పోలీసుల దాడిలయన్స్ క్లబ్ డబ్బు అని చెప్పినా నగదు స్వాధీనం ఆర్యవైశ్యుల గౌరవాన్ని చంద్రబాబు అవమానిస్తున్నాడు
నంద్యాల: ఓటమి భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లపై అక్రమంగా దాడులు చేయిస్తున్నాడని పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాలలో ఎన్ని కుట్రలు పన్నినా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. ప్రజలంతా టీడీపీ ఇచ్చే డబ్బు తీసుకుంటారు తప్ప ఆ పార్టీకి ఓటు వేయరని ఆయన ఎద్దేవా చేశారు. నంద్యాలలో వైయస్‌ఆర్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా చంద్రబాబు వైయస్‌ఆర్ సీపీ కౌన్సిలర్ ఇంటిపై అర్థరాత్రి దాడులు చేయించారని మండిపడ్డారు. మీరెన్ని రైడ్లు, దాడులు చేయించినా వైయస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడరని గుర్తుంచుకోవాలన్నారు. నిన్న అర్థరాత్రి లయన్స్ క్లబ్ నంద్యాల ప్రెసిడెంట్, వైయస్‌ఆర్ సీపీ అభిమాని రమేష్‌బాబు ఇంటిపై పోలీసులు దాడులు చేయడం దుర్మార్గమన్నారు. నంద్యాలలో మీరు చేసిన అభివృద్ధి, రాబోయే రోజుల్లో ఏం చేయబోతారో చెప్పి ఓట్లు అడగాలి కానీ ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా చేసి గెలవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనన్నారు. వైయస్‌ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల నంద్యాల ప్రజలు పూర్తి విధేయతతో ఉన్నారన్నారు. వైయస్ జగన్ రోడ్ షోకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక ఇటువంటి దాడులకు తెగబడుతున్నారన్నారు.
శిల్పా మోహన్‌రెడ్డి సన్నిహితుడిననే దాడులు: రమేష్బాబునంద్యాల ఉప ఎన్నికల వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడినని కుట్రతోనే ప్రభుత్వం తన ఇంటిపై పోలీసులతో దాడులు చేయించిందని బాధితుడు రమేష్ బాబు అన్నారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తాను బిజీగా ఉండడంతో ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేకపోయానన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి ఊరు అనే చిన్న కారణంతో తన ఇంటిపై దాడులు జరగాయన్నారు. అర్థరాత్రి గాడ నిద్రలో ఉన్న సమయంలో పోలీసులు బెడ్రూం కిటికీలు పగులగొట్టి భయబ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ సమయంలో వచ్చారేంటని అడిగితే.. ఇల్లు చెక్ చేయాలన్నారని తెలిపారు. ఆర్యవైశ్యులం మాకు సంఘంలో కొంత గౌరవం ఉందని, దయచేసి ఉదయాన్నే వచ్చి చెక్ చేసుకోవాలని ప్రాధేహపడినా వినిపించుకోకుండా అర్థరాత్రి దాడులు చేశారని ధ్వజమెత్తారు. ఇంట్లో ఉన్న లయన్స్ క్లబ్ డబ్బును, దుకాణంలో ఉన్న కొంత డబ్బుకు ఆధారాలు చూపిస్తున్నా పోలీసులు వినిపించుకోకుండా స్వాధీనం చేసుకున్నారన్నారు. దాదాపు రూ.3.57 లక్షల సొమ్మును తీసుకెళ్లారన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా ప్రజాసేవకు ఉపయోగపడే డబ్బును పోలీసులు లాక్కెళ్లడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ ఆర్యవైశ్యులను కించపరుస్తుందని విమర్శించారు.