ఆటవిక రాజ్యం

  • గండికోట నిర్వాసితుల పట్ల సర్కార్‌ నియంతృత్వ ధోరణి
  • ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీపై స్పష్టత ఇవ్వకుండా ఖాళీ చేయించే ప్రయత్నం
  • అధికారుల తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన
  • రెండు రోజులుగా రోడ్డుపైనే వంటావార్పు
వైయస్‌ఆర్‌ జిల్లా: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. న్యాయం చేయండి మొర్రో అని మొత్తుకున్నా సర్కార్‌ కర్కశంగా వ్యవహరిస్తోంది. సాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం రైతులు తమ పొలాలను, ఇళ్ల స్థలాలను త్యాగం చేస్తే వారికి సరైన పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. వైయస్‌ఆర్‌  జిల్లా గండికోట నిర్వాసితుల పట్ల పాలకపక్షం నియంతృత్వ ధోరణి అవలంభిస్తోంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేస్తే ఖాళీ చేస్తామని బాధితులు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో కొండాపురం మండలం చవటపల్లె గ్రామస్తుల ఆందోళనకు దిగారు. పరిహారం ఇప్పిస్తే సంతోషంగా ఇళ్లు ఖాళీ చేస్తాం.. లేని పక్షంలో నీళ్లలో మునిగినా సరే అక్కడి నుంచి కదిలేది తమని స్పష్టం చేశారు. తమకు న్యాయమైన పరిహారం ఇవ్వకుంటే కదిలేది లేదంటూ వారు మంగళవారం ఉదయం నుంచి కడప–తాడిపత్రి జాతీయరహదారిపై చేపట్టిన ధర్నా.. బుధవారం కూడా కొనసాగుతోంది. 

రాత్రంతా రోడ్డుపైనే జాగరణ కాశారు. వంటావార్పు కూడా రోడ్డుపైనే చేస్తున్నారు. గండికోట రిజర్వాయరులో ముంపునకు గురయ్యే ఆరు గ్రామాల్లో చవటపల్లె మొదటిది. గత రెండు నెలల నుంచి అవుకు రిజర్వాయరు నుంచి గండికోటకు నీరు వచ్చి చేరుతోంది. ఏళ్ల తరబడి సమస్యతో సతమతమవుతున్నాం, ప్యాకేజీ వర్తింపజేసి నీరు నిల్వ చేయండంటే కలెక్టర్‌ నుంచి టీడీపీ నేతల వరకు హామీ ఇచ్చారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్రకారం పరిహారం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సర్కార్‌ అంగీకరించింది. అయితే, గ్రామంలోని ఇళ్ల చుట్టూ నీరు చేరుతున్నా పరిహారంపై ఉలుకూపలుకూ లేకపోవటంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 

బుధవారం ఉదయం కూడా రోడ్డుపైనే తమ ధర్నా కొనసాగిస్తున్నారు. పాలకుల సమాధానాన్ని నిర్వాసితులు విశ్వసించడం లేదు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేశారు. ఈ మేరకు బాధితులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన మాజీ మంత్రి, వైయస్సార్సీపీ సీనియర్ నేత వైయస్ వివేకానందరెడ్డి,  వైయస్‌ఆర్‌సీపీ నేత డాక్టర్‌ సుధీర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేసే వరకు ఉద్యమం ఆగదని వైయస్‌ఆర్‌సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
 
Back to Top