అన్నదాతకు అండగా 25న ధర్నాలు

బాబొచ్చాడు.. రైతును సుడిగుండంలోకి నెట్టాడు

విత్తనాల కోసం రైతుల ఆందోళనలు

 రుణాలపై బ్యాంకుల నోటీసులు

 కొత్త రుణాలకు కానరాని అవకాశాలు

 కృష్ణా నీటి కేటాయింపులో అన్యాయం

 పొరుగురాష్ర్టంలో అనుమతుల్లేని కొత్త ప్రాజెక్టులు

 అయినా బాబు మీనమేషాలు

 

 ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలు సంక్షోభంలో కూరుకుపోయారు.
సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఆదుకోవలసిన రాష్ర్టప్రభుత్వాధినేత సొంత సమస్యల్లో
బిజీగా ఉన్నారు. రైతులకు విత్తనాలు లేవు.  రుణాలు
మాఫీ కాలేదు. కొత్తరుణాలు పుట్టే అవకాశాలు కనిపించడం లేదు.. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల
నుంచి నోటీసులు,
బంగారు వేలం వేస్తామంటూ బెదిరింపులు.. మద్దతుధరలను అరకొరగా పెంచిన కేంద్రం...
ఇదే సమయంలో కృష్ణానది నీటి కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం.... అనుమతులు లేకపోయినా
పొరుగురాష్ర్టంలో కొత్త ప్రాజెక్టులు... ఇన్ని జరుగుతున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. నిజానికి ఆయన ఆధ్వర్యంలోనే మన రైతులకు అన్యాయం
జరుగుతోంది. ఈ అంశాలన్నిటిపైనా ఈ నెల 25న కలెక్టరేట్ల ఎదుట ధర్నా
చేపట్టాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష
నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.

      ముఖ్యమంత్రే స్వయంగా అవినీతి సుడిగుండంలో
చిక్కుకుని పాలనను గాలికి వదిలేశారు. ఏడాదిగా వ్యవసాయ రుణాలు రద్దు కాకపోగా,
ఇంతింతై వటుడింతై అన్నట్టు ఏకంగా రూ.1 లక్ష కోట్లకు
చేరుకుంటున్నాయి. అదీగాక, జూన్ నెల నాలుగో వారం వచ్చినా ఇంతవరకు
రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగలేదు, వ్యవసాయ రుణాలు ఎంత
ఇస్తారో నిర్ణయమే కాలేదు. ఇలా జూన్ మూడో వారం వరకు ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్ జరగకపోవటం
చరిత్రలో ఇదే మొదటి సారి. మరోవైపు విత్తనాలు అందక రైతులు పడిగాపులు కాస్తున్నారు. చివరికి
విత్తనాల పంపిణీకి కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు. రైతుకు ఎలా ఇవ్వాలా అని మహానేత
డాక్టర్ వైఎస్సార్ ఆలోచిస్తే, రైతుకు ఎలా ఎగ్గొట్టాలా అన్న రీతిలోనే
చంద్రబాబు ఏడాది పాలన గడచిపోయింది. చంద్రబాబుగారి వాగ్దానాన్ని నమ్మి బంగారం తాకట్టు
పెట్టుకున్న వారందరికీ వేలం నోటీసులు వస్తున్నాయి. మరో వంక, కేంద్ర
ప్రభుత్వం వారు  ధాన్యం మద్దతు ధర వరుసగా రెండో
ఏడాది కేవలం రూ.50 పెంచి ఊరుకున్నారు. అయినా మద్దతుధరలు పెంచాలంటూ
రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి కనీసం ఒక లేఖ రాసే ధైర్యం చంద్రబాబు నాయుడుగారికి  లేదు.  అందుకే
ఈ అంశాలన్నింటిపైనా ఈ నెల 25న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల
ఎదుట ధర్నాకు పిలుపు ఇవ్వటం జరిగింది. ఈ పిలుపును అందుకుని భారీ సంఖ్యలో కలెక్టరేట్ల
ఎదుట ధర్నాలో పాల్గొనాల్సిందిగా పార్టీ విజ్ఞప్తి చేస్తోంది.

 

 అదునుకు విత్తనాలు అందించలేని అనుభవజ్ఞుడు

 ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్ మొదలైపోయింది.
అదును దాటిపోతుందన్న భయంతో అన్నదాతలు విత్తనాల కోసం అటూఇటూ పరుగులు పెడుతున్నారు. అనంతపురంలో
వేరుశనగ విత్తనాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రాయలసీమలో ఈ సీజన్‌లో రైతులకు
అవసరమైన విత్తనాలలో సగం కూడా సరఫరా చేయలేని స్థితిలో రాష్ర్ట ప్రభుత్వం ఉంది. విత్తనాల
కోసం రైతులు ధర్నాలు,
రాస్తారోకోలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా
లేదు. సర్కారు ఆధ్వర్యంలో సరఫరా కావలసిన విత్తనాలు అరకొరగా మాత్రమే సరఫరా అవుతున్నాయని
రైతులు ఆందోళన చేస్తున్నారు. అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు కనీసం విత్తనాలు
కూడా అందించలేకపోయారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం నాయకులు
విత్తనాల కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హీనమైన వ్యాఖ్యలు చేసే స్థాయికి దిగజారారు.
సబ్సిడీ వేరుశనగ విత్తనాలను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవడం కోసమే రైతులు ఆందోళనలు చేస్తున్నారని
తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. వేరుశనగ
విత్తనాల ధరలు పెరిగినందునే సబ్సిడీ విత్తనాలకు డిమాండ్ పెరిగిందని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

 

 ఎస్‌ఎల్‌బీసీ సమావేశం ఎప్పుడు బాబూ?

      మే 15న జరగాల్సిన
స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం ఇప్పటి వరకు జరగలేదు. జూన్ మూడో వారం ముగుస్తున్నా
ఇంతవరకు రాష్ట్ర వ్యవసాయ రుణ ప్రణాళిక ఖరారుకు ప్రభుత్వానికి తీరిక లేదు.కాబట్టే,
జూన్ మూడో వారం వచ్చినా ఇంతవరకూ రైతులకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పించాలనే
అంశంమీదే చంద్రబాబు నాయుడుకి ధ్యాస లేదు. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్ చంద్రబాబు వల్లే ఆగింది.
కాబట్టే, రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ
రైతులకు బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అదీగాక పూర్తిగా వ్యవసాయ రుణాలన్నీ
మాఫీ చేస్తాం అన్న చంద్రబాబు ఆ రుణాలు మాఫీ చేయకపోవటం వల్ల, 2014 ఏప్రిల్ 1 నాటికి ఉన్న వ్యవసాయ రుణాల మీద పడిన వడ్డీలో
సగానికి కూడా బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వకపోవటం వల్ల ఈరోజు ఏపీ రైతు రుణం విషయంలో దేశంలో
నెంబర్ 1 అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఇదీ చంద్రబాబు నాయుడు గారి
ఘనత. ఏపీ రైతుని వ్యవసాయ దిగుబడులోనో, వ్యవసాయం మీద వచ్చే ఆదాయంలోనో
చంద్రబాబు నెంబర్ 1 చేయలేదు. అప్పుల్లో నెంబర్1గా తయారు చేశాడు.

 

 అన్నదాతల ఆత్మహత్యలపై చలించని చంద్రబాబు

  ఇన్ని సమస్యలు చుట్టుముడుతుండబట్టే ఎప్పుడూ లేని
విధంగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి సభలోనే రైతు
ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తే... కనీసం 108 వాహనం కూడా అక్కడ లేదు. ఆ రైతును
పట్టించుకున్న దిక్కు లేదు. పైగా కళ్ళెదుటే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా ముఖ్యమంత్రి
చంద్రబాబులో చలనమే లేదు. ఏం లేదు.. ఏం లేదు.. మీరు కూర్చొండి అంటూ జనాన్ని,
మీడియాని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అలాగే గత రెండు మూడు రోజుల్లో
రాష్ట్రంలో నమోదు అయిన రైతుల ఆత్మహత్యల విషయంలో కూడా చంద్రబాబులో చలనం లేదు. రాష్ట్రంలో
అత్యధికంగా అనంతపురంలో ఆత్మహత్యలు నమోదు అయ్యాయి. మరి ఇప్పుడు ఆ జిల్లాలో పరిస్థితి
ఏమిటి?

 

 పదవిపై నున్న ధ్యాస ప్రజాసమస్యలపై ఏది?

 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టి
అంతా తన పదవిని ఎలా కాపాడుకోవాలి అన్నది మాత్రమే. ఆయన తక్షణం రాజీనామా చేసి వేరే వ్యక్తులకు
ముఖ్యమంత్రి పదవి అప్పగించి రైతుల సంక్షేమం, రాష్ట్ర ప్రజల సంక్షేమం దిగజారకుండా
కాపాడాలి. ఇప్పుడు పొద్దునలేస్తే గవర్నర్‌ను ఎప్పుడు కలవాలి, కేంద్ర మంత్రులతో ఎప్పుడు సమావేశం కావాలి, వెంకయ్య నాయుడుతో
ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడాలి, తన ఎంపీల ద్వారా, తన కేంద్ర మంత్రుల ద్వారా కేంద్రం ద్వారా ఎలా ఒత్తిడి తీసుకురావాలి,
తన ఇంటిలిజెన్స్, తన పోలీస్ బాస్‌లతో సమావేశమై
ఏం పథకాలు రూపొందించాలి... ఇదే కదా చంద్రబాబు గారి ఆలోచన. ఇందులో ఏపీ ప్రజల గురించి
ఆయన ఆలోచిస్తున్నదేముంది?

      వ్యవసాయం మీద, మన రాష్ట్రానికి చెందాల్సిన నీటి వనరుల మీద ఈ ప్రభుత్వానికి ఉన్న అశ్రద్ధకు,
బాధ్యతా రాహిత్యానికి నిరసనగా ఈ నెల 25న వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రాలన్నింటిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.

Back to Top