అందరి హృదయాల్లో ఆరోగ్య ప్రదాత వైయస్‌ఆర్

నెల్లూరు : ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఆరోగ్యప్రదాతగా దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజలందరి హృదయాల్లోనూ చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా నిలిచారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు సీతారామపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 'రావమ్మా మహాలక్ష్మి' కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోనే మహానేత వైయస్‌ఆర్ తొలిసారిగా ‌ఆరోగ్య పథకాలు ప్రవేశపెట్టి ప్రజారోగ్యం కోసం పాటుపడ్డారన్నారని ప్రశంసించారు. అయితే, మహానేత ప్రవేశపెట్టిన పథకాలకే కాంగ్రెస్ ప్రభుత్వం పే‌ర్లు మార్చివేసి పునఃప్రవేశపెట్టింద‌ని ఆరోపించారు.

కాంగ్రెస్, టిడిపిలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రయోజనం ‌ఉండబోదని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఉదయగిరి ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మారుస్తామని పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గానికి దివంగత మహానేత వైయస్‌ హయాంలో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించారన్నారు. తాను వైయస్‌ర్‌సిపిలో ఉన్నందువల్లే ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు.

పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌కు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కోట్ల రూపాయలు మంజూరుచేసి శంకుస్థాపన చేస్తే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం పనులు నత్తనడకన సాగిస్తోందన్నారు. వైయస్ పథకాలన్నింటినీ నీరుగారుస్తూ ప్రజలు నష్టపోయే విధంగా ప్రభుత్వం ‌వ్యవహరిస్తోందన్నారు. మహానేత వైయస్ ప్రవేశపెట్టిన 108, 104 వాహనాల నిర్వహణ పరిస్థితి ఆయన మరణానంతరం దారుణంగా తయారైందన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా చింతంరెడ్డి సుబ్బారెడ్డి బ‌హూకరించిన చీరలను 90 మంది గర్భిణులకు ఎమ్మెల్యే మేకపాటి పంపిణీ చేశారు.
Back to Top