'ఏపీలో 93శాతం మంది రైతులు రుణభారంతో ఉన్నారు'

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సన్నిహితుల పరిశ్రమలకు రూ. 2,060 కోట్ల రాయితీలు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కోటరీలో ఉన్న పారిశ్రామికవేత్తలకే ప్రోత్సాహకాలు దక్కాయని, ఈ ప్రోత్సాహకాల వెనుక చంద్రబాబు కుటుంబానికి రూ. 700 కోట్లు అందినట్లు ఆధారాలున్నాయని ఆయన అన్నారు. ఇది రాష్ట్ర ఖజానాను దోచిపెట్టే కార్యక్రమమని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కనపెట్టి, కమీషన్ల కోసం ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు కమీషన్లు రావనే రుణమాఫీ చేయలేదని అంబటి అన్నారు.

ఏపీలో 93 శాతం మంది రైతులు రుణభారంతో ఉన్నారని జాతీయపత్రికల్లో కథనాలు వచ్చిన విషయాన్ని రాంబాబు గుర్తుచేశారు. పది లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుచేస్తే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి చెప్పిన సమాధానం సిగ్గుతో తలదించుకునేలా ఉందని అంబటి రాంబాబు మండిపడ్డారు. నరేంద్రమోదీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన డిమాండ్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top