రాజకీయాలను బహిరంగ వేలం వేస్తున్న బాబు

తండ్రీకొడుకులిద్దరూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు
మీడియాపైనా కక్షసాధింపుకు పాల్పడుతున్నారు
ప్రజల గొంతుక అయిన ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు
అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారు
కేంద్రం నుంచి నిధులు తెచ్చే దమ్ము బాబుకు లేకపోయిందిః అంబటి

హైదరాబాద్ః రాష్ట్రంలో టీడీపీ ఓ దుష్ట ప్రభుత్వంగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చని  చంద్ర‌బాబు స‌ర్కార్..  ప్ర‌జ‌ల మ‌న్న‌న కోల్పోయిందన్నారు. ప్ర‌జ‌ల‌కు కావాల్సిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలను చేప‌ట్ట‌డంలో రాష్ట్ర‌ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మై, తీవ్ర ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను ముట‌గ‌ట్టుకుందన్నారు. తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే,ప్రజాసమస్యలపై పోరాడాతున్న జనం గొంతుక అయిన ప్రతిపక్షాన్ని.... నిర్వీర్యం చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని అంబటి మండిపడ్డారు. 

చంద్రబాబు దుశ్చర్యలు కేవ‌లం ఒక్క రాజ‌కీయ పార్టీతోనే ఆగిపోలేద‌ని, ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల‌ు ఇలా అన్ని రంగాలను బెదిరిస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ లోకేష్ డబ్బులు పంచుతుంటే, చంద్రబాబు కండువాలు కప్పుతున్నారని అంబటి నిప్పులు చెరిగారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసే టీడీపీ నాయ‌కుల ఖ‌ర్చంతా తానే భరిస్తానని చెబుతున్నావ్. డబ్బులు మీ మామ ఇచ్చారా..?  లేక మీ న్నాన్న ఇచ్చారా..? ఇంత డ‌బ్బు ఎక్క‌డి నుంచి తీసుకొస్తారు బాబు అని అంబటి నిలదీశారు. రాజ‌కీయాల‌ను చంద్రబాబు బ‌హిరంగంగా వేలం వేస్తున్నారన్నార‌ని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని పైరయ్యారు. 

పార్టీ మారిన వారిని కాపాడుకోవడం కోసమే
బ‌డ్జెట్ స‌మావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు డివిజ‌న్ కోరితే...దానిపై చర్చకు రాకుండా పారిపోయిందని అంబటి ఎద్దేవా చేశారు.   స్పీక‌ర్‌, ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా, అదేవిధంగా ద్ర‌వ్య‌వినిమ‌య బిల్లుపై డివిజ‌న్ కోరితే.... దేనికీ అంగీక‌రించ‌కుండా ప్ర‌జాస్వామ్య విలువ‌లు, పార్ల‌మెంట‌రీ సంప్ర‌దాయాల‌ను బాబు సర్కార్ గంగలో కలిపేసిందని అంబటి విమర్శించారు. ఇందుకోసంస్పీక‌ర్ వ్య‌వ‌స్థ‌ను వాడుకోవడం దుర్మార్గమన్నారు. పార్టీ ఫిరాయింపుదారులను కాపాడుకోవడం కోసం చంద్రబాబు అసెంబ్లీని వాడుకోవడం దురదృష్టకరమని అంబటి వాపోయారు. 

తండ్రీకొడుకుల కక్షసాధింపు
నిష్పక్షపాతంగా పనిచేస్తున్న కొన్నిప‌త్రిక‌లు, ఛాన‌ళ్లపైనా తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అంబటి మండిపడ్డారు. దీనిలో భాగంగానే బాబులిద్దరూ కలిసి ఓ సీనియర్ జర్నలిస్టుపై కుట్ర పన్నారన్నారు. ఆయన ముఖం కనిపించకూడదని ఓ ఛాన‌ల్‌కు హుక్కం జారీ చేశారని చెప్పారు. ప్ర‌భుత్వాలు త‌ల‌చుకుంటే ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల‌కు మ‌న‌ుగ‌డ లేకుండా పోతాయ‌న్న  దుష్టసంప్రదాయానికి తండ్రీకొడుకులు తెరలేపారని అంబటి ఆగ్రహించారు.  ముఖ్య‌మంత్రి, ఆయ‌న త‌న‌యుడు మీడియా స్వేచ్ఛ‌పై విచ్చ‌ల‌విడిగా దౌర్జ‌న్యం చేస్తున్నారన‌డానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం ఏం కావాల‌న్నారు. 

చంద్రబాబు  గొప్ప‌వాడు, నీతిమంతుడు, నిజాయితీ ఉన్న వ్య‌క్తి అని ప‌దేప‌దే చెబుతున్న టీడీపీ నాయ‌కులు... దీనికి ఏం స‌మధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల‌పై దౌర్జన్యం చేయడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. ప్ర‌తిప‌క్ష‌మే కాదు ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడే ఏ సంస్థ‌నైనా, ఏ వ్య‌వ‌స్థ‌నైనా నిర్వీర్యం చేస్తాన‌న్న ధోర‌ణి చంద్ర‌బాబులో క‌న‌బ‌డుతుంద‌ని అంబటి అన్నారు.  దౌర్భాగ్యమైన, విచ్చ‌ల‌విడిగా దౌర్జ‌న్యాలకు పాల్పడుతున్న ఇలాంటి పరిపాలలను దేశంలో ఇంతవరకు తాను చూడ‌లేద‌న్నారు. 

రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును ఎన్నికల్లో ఖర్చుపెడుతాం. జ‌నం డ‌బ్బులు తీసుకొని ఓట్లు వేస్తారు. ఇక శాశ్వ‌తంగా నేనే ముఖ్య‌మంత్రిని. అడ్డ చెప్ప‌కండి అన్న తీరున చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అంబటి మండిపడ్డారు. డ‌బ్బుతోనే రాజ‌కీయం చేస్తామ‌న్న ఎంతోమంది మ‌ట్టిక‌రిచిన చ‌రిత్ర భార‌త‌దేశానికి ఉంద‌న్నారు.  అన్యాయంగా సంపాదించుకున్న డ‌బ్బుతో రాజ‌కీయం చేయాల‌నుకుంటే, ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయానుల‌కుంటే అది ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మన్నారు.  ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండి, ప్ర‌జ‌ల గొంతు వినిపించే వైఎస్సార్‌సీపీ నుంచి కొంతమంది వెళ్లిపోతే, పార్టీ నిర్వీర్య‌మ‌వుతుంద‌న్న భ్ర‌మ‌లో చంద్ర‌బాబు ఉన్నార‌ని అంబటి  ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను కొనడం కాకుండా ఎన్నిక‌ల్లో ఇచ్చిన వాగ్దానాల‌ను నెరవేరుస్తే బాగుంటుందని బాబుకు హితవు పలికారు. 

నిధులు తీసుకొచ్చే దమ్ము లేదు..
కేంద్ర ఆర్థిక‌మంత్రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానికి రూ. 2వేల కోట్లు కేటాయించాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి సూచిస్తే... దానికి ప్ర‌ధానిరూ. 2వేల కోట్లు అవ‌స‌రం లేదని రూ. 900 కోట్లు ఇస్తే సరిపోతుందని సూచించారన్నారు. అది కూడా యూటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించేంత వ‌ర‌కు ఈ డ‌బ్బును విడుద‌ల చేయోద్ద‌న్నారని  పేర్కొన్నారు. మిత్రపక్షం టీడీపీపై కేంద్రానికి నమ్మకం సడ‌లింద‌ని ఎద్దేవా చేశారు. కేంద్ర‌ం ఇచ్చిన నిధుల‌ను టీడీపీ సర్కార్ సక్రమంగా వినియోగించ‌లేద‌న్న ఆరోప‌ణాలు గ‌ట్టిగా వినిపిస్తున్నాయ‌న్నారు. చంద్రబాబుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే ద‌మ్ము లేదు అని అంబటి విమర్శించారు.  

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పార్టీ స్థాపించిన‌ప్పుడు రాజ‌కీయ ప‌రిస్థితులు వేర‌ని, అధికార కాంగ్రెస్ పార్టీ ప‌ద‌వులను తృణపాయంగా వ‌దిలిపెట్టి వైఎస్సార్సీపీలో చేరామ‌న్నారు.  వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై ఉన్న గౌర‌వం, వైఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఉన్న అభిమానం, న‌మ్మ‌కంతోనే... పార్టీ మారాం త‌ప్ప  బాబులాగా అక్ర‌మంగా వ‌చ్చే కోట్ల రూపాయ‌ల నిధుల కోసం కాద‌ని వివ‌రించారు.  వైఎస్సార్సీపీ సభ్యులకు అనుభవం లేదని మాట్లాడుతున్న చంద్రబాబుకు...ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు,  రూల్ 340(2) ప్ర‌కారం సంవ‌త్స‌రం పాటు స‌స్పెండ్ చేశామంటున్నయనమలకు ఉన్నది ఏపాటి అనుభవమో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ 5 నిమిషాలు మాట్లాడితే ఆ ఐదు నిమిషాల్లో 20 మంది టీడీపీ స‌భ్యులు లేచి అడ్డుప‌డ‌డమేనా అనుభవం అని చురక అంటించారు.

Back to Top