రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తారా?

గుంటూరు, 30 జూలై 2013:

ఆంధ్రరాష్ట్రాన్ని చీల్చి అగ్నిగుండంగా మార్చి, కుక్కలు చింపిన విస్తరిగా తయారు చేయడానికే కాంగ్రెస్‌ పూనుకున్నదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. అందుకే ఈ పరిస్థితుల్లో విభజనను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. చర్చలు లేని, సీమాంధ్ర ప్రజల సమస్యలను పట్టించుకోని అడ్డగోలు ఈ విభజన సరైనది కాదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నది అన్నారు. విభజన తరువాత ఉత్పన్నమయ్యే నీటి సమస్యపై ముందుగానే చర్చించాలన్నారు. హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తే.. కృష్ణా డెల్టా ఏమైపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టు ఏమైపోతుందని ప్రశ్నించారు. ఇలాంటి సమస్యలన్నింటినీ పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజిస్తే.. చంద్రబాబులా కళ్ళప్పగించి చూస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీమాంధ్ర ప్రజలు ఊరుకోబోరని అంబటి హెచ్చరించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. ఇరు ప్రాంతాలకూ సమన్యాయం జరిగేలా విభజనపై నిర్ణయం తీసుకోవాలని తాము కోరుకున్నామన్నారు.

'సాయంత్రానికి ఢిల్లీ నుంచి ఒక వార్త వెలువడుతుందని ఆంధ్రప్రదేశ్‌ అంతా ఎదురు చూస్తూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఒక తీపి కబురు అందుతుందని, సీమాంధ్ర ప్రాంతానికి ఒక పిడుగు లాంటి వార్త అందుతుందని భయాందోళన చెందుతున్న సమయం ఇది. ఢిల్లీలో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంతకు ముందే సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్‌ పెద్దలందరూ సోనియాను కలిశారు. ధైర్యంగా ఉండమని సోనియా చెప్పారని వారు చెప్పారు. తెలంగాణ పక్కన అంతా అయిపోయిన తరువాత సీమాంధ్రకు న్యాయం చేస్తామన్నారట. తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తారట. అంటే రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి నిర్ణయించేసుకుని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న తరుణం ఇది' అని అంబటి అన్నారు.

రాష్ట్రాన్ని విభజించినా.. సమైక్యంగా ఉంచినా.. అది భారత ప్రభుత్వం ఇష్టమని ఇంతకు ముందు చాలాసార్లు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెప్పిందని అంబటి గుర్తుచేశారు. అయితే ఒక తండ్రి లాగా ఇద్దరు బిడ్డలనూ సమానంగా చూసుకుని భాగ పంపకాలు చేసే ప్రక్రియ ప్రారంభించాలని కోరుకున్నాం తప్ప మరొక విధంగా కాదన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ విధానం మార్చిందేమిటని అడుగుతున్నారని అలాంటి వారిని తాను ఒక్కటే అడుగుతున్నానన్నారు. రాజధాని సమస్య ఏమైపోయిందన్నారు. సీమాంధ్రను, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించిన తరువా వచ్చే పరిణామాలు ఏమిటి అనే ప్రశ్నకు వారు సమాధానం చెప్పడానికి గాని, ప్రజలకు చెప్పేందుకు కాని ప్రయత్నం చేశారా అన్నారు.

ఇవాళ ప్రత్యేక తెలంగాణ ప్రకటిస్తే తెలంగాణ సోదరులు సంతోషపడతారు. మా సోదరులు సంతోషపడడం మాకూ ఇష్టమే. ఎందుకంటే వారికి పరిపూర్ణమైన ఒక రాజధాని ఉంది. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి అయిన హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకుని తెలంగాణ విడిపోతు సీమాంధ్ర పరిస్థితి ఏమిటని అంబటి ప్రశ్నించారు. సీమాంధ్రులు రాజధానిని ఎక్కడ పెట్టుకోవాలని అన్నారు. విజయవాడలో పెట్టుకుంటే తిరుపతి వారు అంగీకరిస్తారా? తిరుపతిలో పెట్టుకుంటే విజయవాడ వారు ఒప్పుకుంటారా? ఈ రెండుచోట్లా పెట్టుకుంటే వైజాగ్‌ వారు అంగీకరిస్తారా? అని సందేహాన్ని వ్యక్తంచేశారు.

తెలంగాణ ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని టిడిపి వారు కేంద్రానికి లేఖ ఇచ్చిన వైనాన్ని అంబటి గుర్తుచేశారు. లేఖ ఇచ్చినప్పటికీ సమస్యలను పరిష్కరించే విషయంలో నోరు విప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఎందుకు ఉండిపోయారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని అన్నారు. తనకు తెలిసిన సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రే అహ్మద్‌ పటేల్‌, గులాం నబీ ఆజాద్‌, మరో పది మంది ముఖ్య కాంగ్రెస్‌ నాయకులతో ఫోన్‌ చేసి మాట్లాడారని అంబటి తెలిపారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో చంద్రబాబు ఏం మాట్లాడారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఈ రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు సిఎంగా పనిచేసి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు బెల్లం కొట్టిన రాయిలా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అయితే, టిడిపి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమైక్యాంధ్రపై బాహాటంగా మాట్లాడడం శెభాష్‌ అని అంబటి అభినందించారు. చంద్రబాబు లేఖ ఇచ్చిన తరువాత మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ఈ పరిణామాలకు శ్రీకారం చుట్టిందని ఆయన ఆరోపించారు. గతంలో కేసీఆర్‌కు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోవడం, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం అనే రెండు తప్పులు చేశారని అంబటి విమర్శించారు. ఈ సమస్యలను ప్రస్తావించేందుకు చంద్రబాబు ముందుకు రాకపోతే ఆయనను తెలుగు జాతి క్షమించదన్నారు.

గతంలో ఆంధ్రలో, తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగాయని అంబటి గుర్తుచేశారు. దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక ఉద్యమాలు జరిగినా కూడా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచడానికి సర్వశక్తులూ ఒడ్డి కృషి చేశారని పేర్కొన్నారు. ఉద్యమాలు వచ్చే సరికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడానికి సోనియాగాంధీ సిద్ధమయ్యారని విమర్శించారు. తన కుమారుడు ప్రధాన మంత్రి కావడానికి కేవలం 17 లోక్‌సభ సీట్లు ఉన్న తెలంగాణలో పది స్థానాలైనా ఉపయోగపడతాయన్న స్వార్థంతోనే ఆమె మన రాష్ట్ర విభజనకు పూనుకున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రయత్నం చేస్తే.. ఇప్పుడు విచ్ఛిన్నం చేయడానికే సోనియాగాంధీ కంకణం కట్టుకున్నారని అంబటి ఆరోపించారు. శ్రీమతి ఇందిరాగాంధీ 'ఇండియా గాంధీ'.. సోనియాగాంధీ 'ఇటలీ గాంధీ' అని అంబటి అభివర్ణించారు. శ్రీమతి ఇందిరాగాంధీకి ఈ దేశ నైసర్గిక స్వరూపం, జీవనదులు ప్రవహించే తీరు, భారతీయ సంప్రదాయాలు, జాతుల మనోభావాలు తెలిసిన వ్యక్తి అన్నారు. భారతదేశంలోనే పుట్టి, పెరిగిన వ్యక్తి కనుక శ్రీమతి ఇందిరాగాంధీకి అన్నీ తెలుసన్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన సోనియాకు మన దేశం గురించి ఏమి తెలుసని అంబటి నిలదీశారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం రాజకీయాల్లో చేరాలని మాత్రమే చీరకట్టు నేర్చుకున్న వ్యక్తి సోనియా అని ఆయన ఆరోపించారు. అలాంటి సోనియాగాంధీ ఇంతకన్నా గొప్పగా చేస్తారని భావించక్కర్లేదన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేసే ప్రక్రియను ప్రారంభించారని దుయ్యబట్టారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రగల్భాలు పలికిన ఉండవల్లి అరుణ్‌ కుమార్, చిరంజీవి, కె.ఎస్.రావు, లగడపాటి లాంటి కాంగ్రెస్‌ వస్తాదులు ఏమైపోయారని అంబటి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే ఉంచలేకపోయారు గానీ సోనియా దగ్గరకు వెళ్ళి రాజధాని, నీళ్ళ సమస్య మీద మాట్లాడమంటే ఆమె వద్ద నీళ్ళు నమిలి, అన్నీ సక్రమంగా చేస్తామన్నారని చెప్పారని ఎద్దేవా చేశారు. ముందు నరికే కార్యక్రమం కానివ్వండి.. భవిష్యత్తులో మీకు న్యాయం చేస్తామంటే.. చీల్చిన తరువాత ఏమి న్యాయం చేస్తారో తనకైతే అర్థం కాలేదన్నారు. సీమాంధ్రలోని రాజకీయ నాయకులకు నిజంగా పౌరుషం ఉంటే.. ధైర్యం ఉంటే.. న్యాయం కోసం పోరాడాలనే చిత్తశుద్ధి ఉంటే.. సమస్యకు పరిష్కారం కోసం రాజీనామాలను విసిరిపారేయాలని డిమాండ్‌ చేశారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి, చిరంజీవి, కె.ఎస్.రావు, జెడి శీలం లాంటి సీమాంధ్ర నాయకులంతా రాజీనామాలు చేస్తే కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ పరిస్థితి కల్పిస్తే తప్ప గత్యంతరం లేదన్నారు. కాని నోరు మూసుకుని కూర్చుంటే చరిత్రహీనులుగా సీమాంధ్ర నాయకులకు మిగిలిపోతారని అంబటి హెచ్చరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం రెండు ముక్కలైపోయిందన్న నీచ చరిత్ర దక్కుతుందన్నారు. వీళ్ళంతా పదవులున్నాయని మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో కుక్కిన పేనులా ఉంటారని వీరందరికీ కాంగ్రెస్‌ అధిష్టానం పదవులు ఇచ్చింది తప్ప వారేదో దేశాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తారని, తమ శాఖలను ఉద్ధరిస్తారని మాత్రం కాదని అంబటి ఆరోపించారు. ఈ సమయం ఆ పదవులను వదిలేసి వచ్చి తెలుగుజాతిలో కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాన్ని పోగొట్టుకోవద్దని హితవు పలికారు.

చంద్రబాబు నాయుడు నిన్న, మొన్నా ఏమి మాట్లాడడం లేదని అంబటి అన్నారు. రాష్ట్ర విభజన తనకు అంగీకారమే అయితే.. సమస్యలకు పరిష్కారం ఏమిటి? అని చంద్రబాబును ఆయన నిలదీశారు. రాష్ట్రంలోని రాజధాని, నీటి సమస్యల గురించి ఆయన మాట్లాడకుండా కూర్చుని చరిత్ర హీనుడిగా చంద్రబాబు మిగిలిపోతున్నారని విమర్శించారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగుజాతి నాదన్నారు. రాయలసీమ నాదన్నారు. తెలంగాణ నాదన్నారు. కోస్తా ఆంధ్ర నాదని ఎలుగెత్తి చాటారన్నారు. ఆయన వారసుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చారని, జరుగుతున్న అన్యాయాన్ని చెప్పే ధైర్యం కూడా లేకుండా కూర్చున్నారని విమర్శించారు. అందుకు సోనియా గాంధీతో ఏమి ప్యాకేజిలో మాట్లాడుకున్నారని చంద్రబాబును అంబటి నిలదీశారు. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొని ప్రక్రియలను నిలువరించాలని, సమస్య పరిష్కరించిన తరువాత ప్రక్రియ కొనసాగించేందుకు అంగీకరించాలని అన్ని రాజకీయ పక్షాలకూ ఆయన పిలుపునిచ్చారు. అలా చేయకపోతే.. భవిష్యత్‌ తరాలు క్షమించబోరని అంబటి హెచ్చరించారు.

నీటి సమస్యపై ఇరు ప్రాంతాల మధ్యా కొట్లాటలు జరిగే ప్రమాదం వస్తుందని అందుకే ఆ సమస్యను పరిష్కరించిన తరువాత మాత్రమే విభజించాలని తాము కోరుతున్నామన్నారు. అంతే కానీ రాష్ట్ర విభజన వీల్లేదని తాము అనడం లేదన్నారు. ఎన్నికల హడావుడిలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ విభజనకు పూనుకున్నదని ఆరోపించారు. ఇంతకు ముందు 33 సీట్లున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ఒక్క స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టే ఏదో విధంగా కొన్ని సీట్లయినా సాధించాలనే కుటిల రాజకీయంతోనే ఈ చర్యకు పాల్పడుతోందన్నారు. అంతే కానీ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించే విధానం ఇది కాదన్నారు. తండ్రిలా కాకుండా సవతితల్లిలా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందన్నదే తమ బాధ అన్నారు.

తాజా వీడియోలు

Back to Top