బహిరంగ చర్చకు సిద్ధమా చంద్రబాబు

ఇసుకలో భారీ అక్రమాలు
టీడీపీ అధినాయకుల రూ.వేల కోట్ల దోపిడీ
హోదా ఎగ్గొట్టేందుకు ఇద్దరు నాయుళ్ల కుట్ర
ఏకాభిప్రాయమంటూ డొంకతిరుగుడు మాటలు
సీజేపీగా మారిన బీజేపీ

హైదరాబాద్ః రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక అమ్మకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం అధినాయకుల జేబుల్లోకి వెళ్లాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక అమ్మకాల వల్ల ఆదాయం రాలేదు, తాము వచ్చాక  సంవత్సరకాలంలో రూ.517.30 కోట్లు ఆదాయం వచ్చిందని చంద్రబాబు అంకెల గారడీ చేస్తున్నారని అంబటి విరుచుకుపడ్డారు. శ్వేతపత్రం పేరుతో ఇసుక దోపిడీపై అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. దమ్ముంటే ఇసుకలూటీపై  చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.   

అంకెల గారడీ..!
కాంగ్రెస్ హయాంలో క్యూబిక్ మీటర్ ఇసుక రూ.40 ఉంటే..చంద్రబాబు వచ్చాక రూ.600కు చేసి సుమారు 17 రెట్లు ధర పెంచాడన్నారు. తద్వార రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు రూ.500 కోట్లు మాత్రమే వచ్చిందనడంపై సమాధానం చెప్పాలన్నారు.  మీరు, మాతాబేదారులు వేల కోట్లు కాజేసింది వాస్తవం కాదా అని చంద్రబాబును నిలదీశారు. ఇసుక దందాలో ప్రతి ఎమ్మెల్యే, మంత్రికి, లోకేష్ కు వాటాలున్నాయన్నారు. వాటాలు పెట్టుకొని ఇసుద దోపిడీకి పాల్పడుతూ ఎవరికీ తెలియదన్నట్లు చంద్రబాబు గారడీ చేస్తున్నారని దుయ్యబట్టారు.   

నాయుళ్ల డొంకతిరుగుడు మాటలు..!
రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురాకుండా ఇద్దరు నాయుళ్లు కుట్రపన్నుతున్నారని అంబటి రాంబాబు చంద్రబాబు, వెంకయ్యనాయుడలపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏకాభిప్రాయం కావాలంటూ వెంకయ్యనాయుడు రాష్ర్ట ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలను ఏకాభిప్రాయంతోనే  విభజించారా...? అని అంబటి వెంకయ్యనాయుడుని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు ఏకాభిప్రాయంతో ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పలేదా అని నిలదీశారు. 18 మాసాలు అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా హోదాను ఎగ్గొట్టాలనే ప్రయత్నంలో టీడీపీ, బీజేపీలు ఉన్నాయని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో  ప్రజలను ఏవిధంగా మోసం చేయాలన్న ఆలోచనే తప్ప మరొకటి చేయలేదన్నారు.

చంద్రబాబు జనతాపార్టీగా బీజేపీ..!
కాంగ్రెస్ వాగ్దానాలను ఏకరవుగా చదువుతున్న వెంకయ్యనాయుడు....హోదా గురించి మాట్లాడితే ఎందుకు మొహం తిప్పుకుంటున్నారని అంబటి  ప్రశ్నించారు. చంద్రబాబు ఈవెంట్ మేనేజర్, వెంకయ్యనాయుడు మార్కెటింగ్ మేనేజర్ అని అంబటి విమర్శించారు. మోడీని పొగడడం మానేసి చంద్రబాబును ఆకాశానికెత్తుతూ వెంకయ్యనాయుడు రాష్ట్రంలో బీజేపీని సీజేపీగా మార్చారని ఎద్దేవా చేశారు. దానికి వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉన్నాడన్నారు. హోదాను ఎగ్గొడితే తెలుగు ప్రజలు సహించరని , ఏకభిప్రాయమనే డొంకతిరుగుడు మాటలు మాని తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పినందుకే బిహార్ ప్రజలు బీజేపీని ఓడించారని  తూర్పారబట్టారు. 
Back to Top