అది ఎన్నికల 'ప్లాన్'!

దేవరకద్ర (మహబూబ్‌నగర్) 2 డిసెంబర్ 2012 : ఎస్.సీ, ఎస్.టీ సబ్‌ప్లాన్ చట్టబద్ధత అన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్టంట్ మాత్రమేనని షర్మిల అన్నారు. దళిత, గిరిజనులపై కాంగ్రెస్ సర్కార్ కపట ప్రేమను చూపుతోందని ఆమె దుయ్యబట్టారు. దళితులు, గిరిజనుల మీద ఈ సర్కారుకు ఈ రోజు కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందనీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత ప్రతిపాదించి హడావుడిగా అసెంబ్లీని సమావేశపరిచిందనీ, ఇదంతా ఓ బూటకమనీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పెద్దలు ఆడుతున్న నాటకమనీ షర్మిల వ్యాఖ్యానించారు. నిజంగా వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే వేల కోట్ల రూపాయలు దారితప్పుతున్నా ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా ఎందుకు ప్రవేశపెట్టడంలేదని ఆమె ప్రశ్నించారు.ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సభలో షర్మిల ప్రసంగించారు.
ఎన్నికలు ముందున్నాయని తెలిసే కాంగ్రెస్ పాలకులు ఈ సబ్‌ప్లాన్ చట్టం తేవాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. దళితులు, గిరిజనుల మీద వీళ్లకున్నది ప్రేమ కాదనీ, అది ఎన్నికలు వస్తున్నాయన్న భయమనీ ఆమె ఎద్దేవా చేశారు.

చిత్తశుద్ధితో కృషి చేసిన మహానేత
రాజశేఖర్ రెడ్డిగారి హయాంలో ఏ చట్టమూ లేకపోయినా ఆయనకు చిత్తశుద్ధి ఉంది కనుక ఎస్సీ, ఎస్టీల గురించి ఎంతగానో ఆలోచించారన్నారు. గిరిజనులకైతే 20 లక్షల ఎకరాల భూ పంపిణీ చేశారనీ, అందులో ఒకే రోజు 3.30 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారనీ ఆమె గుర్తు చేశారు. ఇది దేశంలో మరెక్కడా జరగలేదన్నారు. పంచిన భూమిని సాగుకు అనుకూలంగా మార్చడం కోసం, ఉపాధి హామీ పథకంతో దానిని అనుసంధానం చేసి రోజుకు రూ.150 కూలి ఇప్పించారన్నారు. క్రైస్తవులను కూడా ఎస్సీలలో చేర్చాలని దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారేనన్నారు. 17 లక్షల మంది ఎస్సీలకు వైయస్ రూ.1,100 కోట్ల రుణ మాఫీ చేశారని ఆమె చెప్పారు. 
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతమే మెస్ చార్జీలు పెంచారని ఆమె అన్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25% మెస్ చార్జీలను పెంచి ఆ మరుసటి సంవత్సరమే పెంపును 40 శాతం చేశారన్నారు. చంద్రబాబునాయుడు హయాంలో ఎస్సీల కోసం రూ.85 కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసి పంపిణీ చేస్తే వైఎస్సార్ హయాంలో రూ.530 కోట్ల విలువైన స్థలాలు ఇచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీల నిధులకు విడిగా ప్రణాళిక ఉండాలని తొలిసారిగా తీర్మానం చేసిన వ్యక్తి వైయస్సేనన్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల కోసం వైయస్ 5 వేల మంది విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు.

ఎస్సీ,ఎస్టీల కోసం చేసిందేమిటి?
మూడేళ్లుగా ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఎంత సహాయం చేసిందని ఆమె ప్రశ్నించారు. "వాళ్లకేమైనా కొత్త ఇళ్లు కట్టిచ్చారా? ఈ మూడేళ్ల కాలంలో దళితులు, గిరిజనుల కోసం ఎంత భూమి పంపిణీ చేశారు..? ఇంతకుముందే పంపిణీ చేసిన భూమిని సాగులోకి తేవడానికి ఏమైనాప్రయత్నాలు చేశారా?" అని షర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు.
వైయస్ 3 లక్షల మంది ఎస్సీఎస్టీలను విద్యావాలటీర్లుగా నియమించారని ఆమె చెప్పారు. ఉపాధి
హామీ పథకంలో ఎస్సీఎస్టీలకు వైయస్ రూ. 150 ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కిరణ్‌ ప్రభుత్వం ఇస్తోంది రూ. 30 మాత్రమేనని ఆమె విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? వాళ్లు తింటున్నారా? లేదా? అని ఒక్కసారైనా ఆలోచించిన పాపాన పోలేదని ఆమె కిరణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పైగా ఒక్కొక్క హాస్టల్‌కు ఏడాదికి ఆరు సిలిండర్లు మాత్రమే సబ్సిడీపై ఇస్తామంటున్నారనీ, ఈ పాలకులకు ఎస్సీ, ఎస్టీల మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలుననీ  అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదేనా దళితులపై ప్రేమ?
పెట్రో ధరలు, గ్యాస్ ధరలు, బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు ప్రతీదీ పెంచి ఈ పాలకులు చోద్యం చూస్తున్నారని షర్మిల విమర్శించారు. ధరల పెరుగుదల అల్పాదాయం కలిగిన దళిత, గిరిజనుల మీద ఎంతటి తీవ్ర ప్రభావం చూపిస్తుందో ఈ సర్కారు ఎప్పుడైనా ఆలోచన చేసిందా? అని ఆమె ప్రశ్నించారు. ఇటీవల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ జిల్లాకు వచ్చినప్పుడు 'సీఎం గారూ! మీరు 25 వేల మందికి పింఛన్లు తీసేశారు. వాటిని పునరుద్ధరించండి' అని వైయస్సార్‌ సీపీకి చెందిన ఎస్సీ నాయకురాలు బాలమణెమ్మ ఒక వినతిపత్రం ఇవ్వబోతే, ఆమెను, ఆమె అనుచరులను నాన్‌బెయిలబుల్ వారంటు కింద మూడ్రోజులు జైల్లో పెట్టారని షర్మిల విమర్శించారు. దళిత మహిళ అని కూడా చూడకుండా అక్రమంగా జైల్లో పెట్టడమేనా దళితులపై చూపించే ప్రేమ? అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. పాలమూరు జిల్లాలో కరువును రూపు మాపేందుకు వైయస్ 4 ప్రాజెక్టులను తెచ్చారన్నారు.
రామన్‌పాడు నిర్మాణం పూర్తి కాకపోవడంతో 46 గ్రామాలకు నీటి ఎద్దడి ఏర్పడిందని షర్మిల అన్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో దళిత, గిరిజనులకు చేసిందేమీలేదన్నారు. సభకు భారీగా జనం హాజరయ్యారు. 

          

Back to Top