'అభివృద్ధి, సంక్షేమం జగన్‌తోనే సాధ్యం'

కర్నూలు : రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగేలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే సత్తా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి మాత్రమే ఉన్నాయని పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్‌ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ప్రస్తుత సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజల సంక్షేమం ఎండమావిగా మారిందని ఆయన దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖ‌రరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని గౌరు వెంకటరెడ్డి అన్నారు.

సహకార ఎన్నికలకు ప్రజలను సమాయత్తం చేసేందుకు శనివారంనాడు రేమట గ్రామంలో గౌరు వెంకటరెడ్డి పర్యటించారు. కోట్ల హరి చక్రపాణి రెడ్డి, ఎదురూరు రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన స్థానికులతో సమావేశమయ్యారు. తొమ్మిదేళ్లు పిఎంగా పనిచేసిన చంద్రబాబు తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపారని గౌరు విమర్శించారు. 2004 ఎన్నికల సమయంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యు‌త్ ఇస్తామని ‌మహానేత డాక్టర్‌ వై‌యస్ హామీ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేసిన చంద్రబాబు ‌ఇప్పుడు అదే హామీతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని ఆరోపించారు. ఇంటికో ఇంజనీరునో, డాక్టర్‌నో తయారుచేయాలనే సదుద్దేశ్యంతో మహానేత వైయస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబ‌ర్సుమెంట్ పథకానికి ‌అడ్డగోలుగా నిబంధనలు విధిస్తూ కిరణ్ ‌ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీరు కారణంగా ఎందరో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీయాల్సిన ప్రతిపక్షం దానితో కుమ్మక్కయిందని గౌరు ఆరోపించారు. దీంతో ప్రజా సమస్యలపై పోరాడేందుకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. శ్రీ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అధికార, ప్రతిపక్షం కుమ్మక్కై అక్రమంగా అరెస్టు చేయించాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజల తరఫున వైయస్‌ఆర్‌సిపి అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. హరి చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, సహకార ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి మద్దతుదారులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
Back to Top