ఆరోగ్యశ్రీపై సర్కారు నిర్లక్ష్యం

నందిగామ, 19 ఏప్రిల్ 2013:

మహానేత డాక్టర్ వైయస్ మరణించాక ఆరోగ్యశ్రీ పరిధిలోకొచ్చే రోగాల సంఖ్యను ప్రస్తుత పాలకులు కుదించారని శ్రీమతి వైయస్ షర్మిల మండిపడ్డారు. మహానేత జీవించి ఉన్నప్పుడు 108కు ఫోన్ చేస్తే.. కుయ్.. కుయ్ అంటూ 20 నిమిషాల్లో వచ్చేదనీ, ఇప్పుడు ఫోన్ చేస్తే.. అంబులెన్సులో డీజిల్ లేదంటున్నారనీ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.  ఇలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే చంద్రబాబు మద్దతివ్వకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ పెట్టిన ప్రతిపథకానికీ జగనన్న జీవం పోస్తారని ఆమె హామీ ఇచ్చారు.  గురువారంనాడు పాదయాత్ర ముగిసేనాటికి 124 రోజులు పూర్తయ్యింది. 1,679.9 కిలోమీటర్లు నడిచారు.

‘తాను అనారోగ్యానికి గురైనప్పుడు ఏవిధంగానైతే పెద్దాసుపత్రికి పోయి వైద్యం చేయించుకుంటానో.. అలాగే పేదోడికి కూడా రోగమొచ్చినప్పుడు వారు కూడా ధైర్యంగా అదే పెద్దాసుపత్రికి వచ్చి తన మంచం పక్కనే ఒక మంచం వేసుకొని వైద్యం చేయించుకోవాలనే గొప్ప ఆలోచనతో దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారు. ఆయన మరణించిన తర్వాత ఈ పాలకులు పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ పథకంలోని రోగాల సంఖ్యను కుదించారు. దీంతో పథకం వర్తించక, తాము భరించే ఆర్థిక స్తోమత లేక, ఆత్మీయుల్ని గాలికొదిలేసి చంపుకోలేక ప్రజలు నరకం చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ తాత మదార్ సాహెబ్ అల్లుళ్ల మరణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా?’ అని శ్రీమతి షర్మిల పాలకులను నిలదీశారు.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా దివంగత మహానేత తనయ డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి తరఫున శ్రీమతి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సాగింది.

ఈ సందర్భంగా వీరులపాడు మండల కేంద్రం మీదుగా శ్రీమతి షర్మిల వెళుతున్నప్పుడు మదార్ సాహెబ్ అనే ఓ నిర్భాగ్యుడు ఆమెను కలిసేందుకు ముందుకురావడానికి యత్నించాడు. అది చూసి రోడ్డు దిగి ఆయన దగ్గరకే వెళ్లి  పలకరించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం అందకపోవడం వల్ల తన కుటుంబం చితికిపోయిందని, తన అల్లుళ్లు మరణించారని గోడు చెప్పుకొంటూ సాహెబ్ కన్నీరుమున్నీరయ్యాడు. అది విని చలించిపోయిన శ్రీమతి షర్మిల ఉద్వేగంగా మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు.
ఆరోగ్యశ్రీ అందక ప్రజలు మరణిస్తున్నా.. ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ‘వైయస్ఆర్  సువర్ణయుగంలో 108 అంబులెన్సుకు ఫోన్ చేస్తే... ఫోన్ చేసిన 20 నిమిషాల లోపు కుయ్..కుయ్..కుయ్.. అనుకుంటూ అంబులెన్సు వచ్చి ఆ వ్యక్తిని తీసుకొని పోయేది. ఇప్పుడు 108కు ఫోన్ చేస్తే మా అంబులెన్సులో  డీజిల్ లేదు.. మా ఉద్యోగులకు జీతాలు లేక ధర్నా చేస్తున్నారనే సమాధానం చెప్తున్నారు. ప్రజల్ని గాలికొదిలేసిన ఈ ప్రభుత్వంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. తాతా.. మీకు మాటిచ్చి చెప్తున్నాను. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం తెస్తారు. రాజన్న రాజ్యంలో ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలతో పాటు వైయస్ఆర్ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకానికి జగనన్న జీవం పోస్తారు. అంతవరకు మీరు ఓపిగ్గా, ధైర్యంగా ఉండండి’ అని ఆమె భరోసా ఇచ్చారు. పాదయాత్ర 124వ రోజు గురువారం కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం తోటమూల నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వీరులపాడు, పల్లంపల్లి, దాములూరు మీదుగా యాత్ర చేసిన షర్మిల.. కొణతాత్మకూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top