<strong>మహబూబ్‌నగర్:</strong> పాలమూరు జిల్లా కేంద్రంలో శ్రీమతి షర్మిల పాదయాత్రపై పాలమూరు వర్సిటీ విద్యార్థులు టమోటాలు, గుడ్లు, రాళ్లు విసిరితే భయపడి ఆమె బస్సెక్కారని తప్పుడు వార్తలు రాసిన కొన్ని పత్రికలు (సాక్షి కాదు), టివి చానళ్లపై జాతీయ ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.<br/>పాలమూరు వర్సిటీ విద్యార్థులు దాడి చేసినప్పటికీ శ్రీమతి షర్మిల వారి వైపు చేయి చూపుతూ, అభివాదం చేసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్లారని ఎడ్మ తెలిపారు. విద్యార్థులు వ్యూహం ప్రకారం దాడికి దిగినా ఎలాంటి ప్రతిదాడులనూ ప్రోత్సహించకుండా ఆమె ప్రశాంతంగా యాత్ర కొనసాగించారని చెప్పారు. జిల్లాలో విజయవంతంగా సాగుతున్న యాత్రపై ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికే ఇలాంటి అసత్య వార్తలను ఆ మీడియా రాసి, ప్రసారం చేసినట్లు ఆయన విమర్శించారు.<br/>జిల్లాలోని ఆలంపూర్, గద్వాల, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన శ్రీమతి షర్మిల పాదయాత్రకు అనూహ్యమైన జనస్పందన లభించిందని కిష్టారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పలుచోట్ల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలతో శ్రీమతి షర్మిల మమేకం అయ్యారని ఆయన గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ అనుబంధ విభాగాల కన్వీనర్ శంభు పుల్లయ్య శెట్టి, ఆర్.రవిప్రకాశ్, సయ్యద్ సిరాజుద్దీన్, పార్టీ నేత లింగారెడ్డి పాల్గొన్నారు.