ఎమ్మెల్సీ పదవికి ఆదిరెడ్డి అప్పారావు నామినేషన్

హైదరాబాద్ 09 మార్చి 2013:

రాష్ట్ర శాసనమండలికి శాసనసభ నుంచి జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో వైయస్ఆర్  కాంగ్రెస్ అభ్యర్థి ఆదిరెడ్డి అప్పారావు శనివారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు వెంట రాగా ఉదయం 11 గంటలకు ఆయన రిటర్నింగ్ అధికారి రాజ సదారాంకు నామినేషన్ పత్రాలను అందజేశారు. మొత్తం రెండు సెట్ల నామినేషన్లను వేశారు. అప్పారావు పేరును ప్రతిపాదిస్తూ శాసనసభలో పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక సెట్, మేకతోటి సుచరిత మరో సెట్‌ వేశారు. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  అభ్యర్థి అప్పారావు తరపున బాలినేని శ్రీనివాసరెడ్డి పదివేల రూపాయల డిపాజిట్‌ను చెల్లించారు. అభ్యర్థి అప్పారావుతో ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఉంటానని రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు.

     ఎమ్మెల్యేలు టి.బాలరాజు, కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మద్దాలి రాజేష్, తానేటి వనిత, కె.చెన్నకేశవరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ సీజీసీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి, అధికార ప్రతినిధులు బి.జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ కుడిపూడి చిట్టెబ్బాయ్, మాజీ ఎమ్మెల్యేలు సర్రాజు, పెండెం దొరబాబు, చిర్ల జగ్గిరెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్ వేణుగోపాల్, జిల్లా పరిశీలకుడు పి.కె.రావు ఈ సందర్భంగా హాజరయ్యారు.

వైయస్ఆర్ కుటుంబ ఆశీస్సులతోనే...

      వైయస్ఆర్ కుటుంబ ఆశీస్సులతోనే ఎమ్ఎల్‌సీ అభ్యర్థిగా నామినేషన్ వేశానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్ఎల్‌సీ అభ్యర్థి ఆదిరెడ్డి అప్పారావు చెప్పారు. ఆయన శనివారం ఉదయం ఎమ్ఎల్‌సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీకి వచ్చే ఒక్క సీటును బీసీనైన తనకు కేటాయించి బీసీలకు ప్రాధాన్యత నిస్తానన్న హామీని నిలబెట్టుకుందని ఆయన చెప్పారు. పార్టీ ఆశయాలకోసం నిబద్ధతతో పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఆదిరెడ్డి అప్పారావు భార్య శ్రీమతి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ రాజమండ్రి నగర పాలక సంస్థకు మేయర్‌గా వ్యవహరించారు.

Back to Top