50 రోజులు పూర్తిచేసుకున్న షర్మిల పాదయాత్ర

హైదరాబాద్, డిసెంబర్ 6:

వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనూ శ్రీమతి వైయస్ షర్మిలకు ప్రజలు జయజయధ్వానాలు పలుకుతూ  ఆదరిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చెప్పారు.  అక్టోబర్ 18న వైయస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో మొదలైన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు డిసెంబరు 6వ తేదీతో  50 రోజులు పూర్తవుతుందని తెలిపారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల యాత్రను రాష్ట్రంలోని తొమ్మిది కోట్లమంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న  16 కోట్ల తెలుగు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారన్నారు. ఆమె యాత్ర అజేయంగా అవిశ్రాంతంగా సాగుతోందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో దిగ్విజయ యాత్రగా నడుస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 700 కిమీ దూరం నడిచిన శ్రీమతి షర్మిల 200 గ్రామాలు, పది మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలోని 30 లక్షల మంది ప్రజలను కలిశారని వివరించారు. ప్రపంచంలోనే  ఇది అరుదైన యాత్రని చెప్పారు. ఏ మహిళా ఇంతవరకూ 300 కిమీ పాదయాత్ర కూడా చేయలేదన్నారు. షర్మిల 3000 కిమీ యాత్రను  లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తన యాత్రలో ఆమె ప్రజల కడగండ్లను చూసి, కన్నీళ్ళను తుడిచి , భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతూ, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను వివరిస్తూ సాగుతున్నారని తెలిపారు. ప్రజలను చైతన్యులను  చేస్తూ రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ, చంద్రబాబు పార్టీలు కలిసి రాజకీయాలను గందరగోళం చేశాయని ధ్వజమెత్తారు. వీరిద్దరూ జగన్ నాయకత్వ హననానికి పూనుకున్నారని ఆరోపించారు. అధికారంలో భాగస్వామి కాని శ్రీ జగన్మోహన్ రెడ్డిపై అభాండాలు మోపి సీబీఐ సాయంతో జైలులో పెట్టించిన విషయాన్నీ, ఆర్నెల్లయినా బెయిలు రాకుండా చేయడాన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

చంద్రబాబుది రసహీన యాత్ర

     శ్రీమతి షర్మిల యాత్ర ప్రజల గుండెల్ని గెలుచుకున్న దిగ్విజయ యాత్రగా కరుణాకర రెడ్డి అభివర్ణించారు. మరోవంక చంద్రబాబు చేస్తున్న యాత్ర రస హీన యాత్రగా మారిందన్నారు.  కొనుగోలు చేసిన వ్యక్తులతో బాబు యాత్ర సాగుతోందనీ,  అవిటి యాత్రగా మారిందనీ వివరించారు.  షర్మిల యాత్రను కోట్లాదిమంది గమనిస్తున్నారనీ,  తరతమభేదాలు లేకుండా ఎక్కడకెళ్ళినా ఆశీర్వచనాలు అందుకుంటోందనీ చెప్పారు.  

ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తిప్పికొడతారు

    వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా చెల్లదన్నారు. ప్రజలు తమకే మద్దతు పలుకుతున్నారని స్పష్టంచేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తమకు తిరుగులేని మెజారిటీని అప్పగిస్తారని పేర్కొన్నారు. ఎక్కువమంది అభ్యర్థుల్ని గెలిపించడానికి ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు.  తెలంగాణలోని మరిన్ని జిల్లాల్లో సాగి కోస్తా ఆంధ్ర మీదుగా ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురంలో శ్రీమతి షర్మిల యాత్ర ముగుస్తుందని కరుణాకరరెడ్డి చెప్పారు.

Back to Top