వైయస్‌ఆర్ కాంగ్రెస్ పిలుపు హైదరాబాద్, 28 ఆగస్టు 2012 : రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన విద్యుత్ కోతలకు నిరసనగా ఈ నెల 31న రాష్ట్ర బంద్కు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిందని పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు. ఈ బంద్‌కు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో శోభానాగిరెడ్డి మాట్లాడారు. విద్యుత్ సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని విమర్శించారు. ఈ అసమర్థ కాంగ్రెస్ పరిపాలనలో విద్యుత్ కోతల కారణంగా రాష్ట్రంలోని అనేక పరిశ్రమలు మూసివేసే పరిస్థితి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.విద్యుత్ సమస్యపై ప్రజలే తమంతట తాముగా స్పందించడాన్ని గమనిస్తే సమస్య తీవ్రత అర్థమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారని శోభా నాగిరెడ్డి ప్రస్తావించారు. విద్యుత్ సంక్షోభం వస్తుందని ముందే తెలిసినా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు అదనపు గ్యాస్ కోసం కేంద్రంపై వత్తిడి తీసుకురావడంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దారుణంగా విఫలమయ్యారని శోభా నాగిరెడ్డి తూర్పారబట్టారు.మన పొరుగునే ఉన్న రాష్ట్రాలలో మనకంటే చాలా తక్కువమంది ఎంపిలు ఉన్నా, వారు కేంద్రంలో పనులు చేయించుకోగలుతున్నారని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నా ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు.వైయస్ హయాంలో కూడా సమస్యలు వచ్చేవని, వాటిని ఆనాడు ఆయన సమర్థవంతంగా పరిష్కరించేవారని శోభా నాగిరెడ్డి తెలిపారు.విద్యుత్ సమస్యపై తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం రాత్రి రాష్ట్ర సచివాలయంలో 'రాజకీయ డ్రామా' ఆడారని శోభా నాగిరెడ్డి విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో బషీర్బాగ్‌లో రైతులపై నిర్వహించిన కాల్పుల ఘటన నుంచి ప్రజలు, మీడియా దృష్టిని మళ్లించేందుకే టీడీపీ ఇలాంటి డ్రామాలకు తెరతీసిందన్నారు. ఎన్డీటీవీ సర్వే చూసి అయినా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ వాస్తవాలు తెలుసుకోవాలని ఆమె సలహా ఇచ్చారు. ఏ సర్వే అయినా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజాదరణ ఉందని స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి గమనించాలన్నారు. వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితుల్లో టీడీపీ నేతలు లేరని అన్నారు.విద్యుత్ సమస్య రోజురోజుకూ పెరిగిపోతున్నందున్న చర్చించేందుకు శాసనసభ సమావేశాలు తక్షణమే ఏర్పాటు చేయాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యతో పాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ఇతర సమస్యలపైన కూడా అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.రాష్ట్రంలో ప్రజల సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రికి మాత్రం ఎమ్మెల్యేలను కలిసే తీరికే లేకుండా పోయిందని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. విదేశీ ప్రతినిధులకు ఇస్తున్నంత ప్రాధాన్యం రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు ఇవ్వడంలేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు విలేకరుల ఈ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.