తమ్ముళ్ళూ దయచూడండి: బాబు వేడుకోలు

కర్నూలు, 16 అక్టోబర్ 2012:‌ 'డిసిప్లిన్‌గా ఉంటే నీకు మైక్‌ ఇచ్చేవాడిని. నీకు డిసిప్లిన్‌ లేదు. ఏం తమ్ముడూ.. వినమ్మా... ఏయ్‌ తమ్ముళ్ళూ... మీరు కూడా ఉండాలి. మీరూ వినాలి. (అప్పటికే కొందరు తమ్ముళ్ళు బాబు సభ నుంచి తిరుగుముఖం పట్టారు) ఏయ్‌ వినాలి నువ్వు. 14వ రోజు. కాలు బాగా నొప్పిగా ఉంది. 14 రోజులు నడిచివచ్చి, మళ్ళా మీ దగ్గర రెండు గంటలు నిలడుతున్నానంటే మీకు కూడా కాస్తయినా దయ ఉండాలి కదా నా మీద!' ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా?! మారిన మనిషిగా వస్తున్నా... మీ కోసం అంటూ పాదయాత్ర చేస్తున్న టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాను చెప్పేది వినాలంటూ అర్థించే పరిస్థితి ఎదురైంది ఆయనకు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్ళ పాటు హైటెక్కుతో పరిపాలించిన చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళను దీనంగా, బాధతో వేడుకున్న సంఘటన ఇది.

దేశ ప్రధానిని, రాష్ట్రపతిని తానే నియమించానని ఎంతో గొప్పగా చెప్పుకునే చంద్రబాబుకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది కర్నూలు జిల్లా ఆలూరులో. అసలు తననే ప్రధానిగా ఉండాలని వత్తిడి వచ్చినా కూడా ఆ పదవిని త్యాగం చేశానని చెప్పుకునే ఆయనకు తెలుగు తమ్ముళ్ళ నుంచే వ్యతిరేకత ఎదురవడం గమనార్హం.

'వస్తున్నా... మీ కోసం' అంటూ చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర సోమవారంనాడు కర్నూలు జిల్లా ఆలూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మైకు తీసుకుని మాట్లాడడం మొదలు పెట్టారు. అయితే, ఆయన చెప్పే మాటలు స్థానిక తెలుగు తమ్ముళ్ళ చెవికి ఎక్కలేదు. పైగా తాము మాట్లాడతామని, మైకు ఇమ్మని ఆయనను వత్తిడి చేశారు. దీనితో చంద్రబాబులో కాస్త అసహనం చోటుచేసుకుంది. తాను మాట్లాడుతుండగా అల్లరికి దిగిన తమ్ముళ్ళను ముందు గద్దించారు. అయినా ఆయన కోపాన్ని ఎవ్వరూ లెక్కచేయలేదు. సరి కదా.. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. ఇక వినమ్మా అని తమ్ముళ్ళను బతిమాలుకునే స్థితికి వెళ్ళిపోయారు బాబు.

తాజా వీడియోలు

Back to Top