ఎన్టీఆర్‌ గౌరవాన్ని, ఆయన ఊరి పేరునూ మంటగలిపేశారని వాపోయారు..




30–04–2018, సోమవారం
పర్ణశాల, కృష్ణా జిల్లా


కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలను ఉత్తేజితుల్ని చేస్తూ.. ఉర్రూతలూగిస్తూ గీతాలు రాసిన మహాప్రస్థానం సృష్టికర్త.. మహాకవి శ్రీ శ్రీ జయంతి రోజున ‘కదిలేది.. కదిలించేది.. పెనునిద్దుర వదిలించేది..’ అన్న ఆయన మాటలు స్ఫూర్తిగా ప్రజా సంకల్ప యాత్ర ముందుకు సాగింది. విశాఖలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహించిన వంచన వ్యతిరేక దీక్షకు సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు, నలుపు దుస్తులు ధరించి నాతోపాటు పాదయాత్ర కొనసాగించారు జనం.  

 నిడుమోలు వద్ద చిన్నం మీరాబాయి అనే అవ్వ నన్ను కలిసింది. ‘సారూ.. నా కాలికి ఇన్‌ఫెక్షన్‌ సోకి తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రికెళితే రూ.6 లక్షలు ఖర్చయింది. ఆరోగ్యశ్రీ వర్తించక, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయమూ అందక.. ఉన్న కాస్త ఆస్తినీ తనఖా పెట్టి అప్పులపాలయ్యాం’ అంటూ కన్నీటిపర్యంతమైంది. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు రోడ్డు విస్తరణలో నాలుగు సెంట్ల స్థలమూ పోయిందట. ఇంతవరకు పరిహారం కూడా అందలేదట. ‘మీ ప్రభుత్వం వచ్చాకైనా సాయం చేయండయ్యా..’ అంటూ దీనంగా విన్నవించుకుంది. జీవితాంతం కష్టపడి, పైసాపైసా కూడబెట్టిన సొమ్మంతా వైద్యానికే హారతి కర్పూరమైతే.. సామాన్యుల బతుకుబండి నడిచేదెలా? 


 రాష్ట్రమంతా అవినీతికి పాల్పడినా, కనీసం.. దివంగత ఎన్టీ రామారావుగారి స్వగ్రామం.. చినబాబు లోకేశ్‌ అభివృద్ధి చేస్తానంటూ దత్తత తీసుకున్న గ్రామం.. నిమ్మకూరులోనైనా ఆదర్శంగా ఉంటారేమోనన్న భావన మనసులో ఏమూలో ఉండేది. కానీ అక్కడికి వెళ్లగానే మిణుకు మిణుకుమంటున్న ఆ ఆశ కూడా ఆవిరైంది. నిమ్మకూరులో గ్రామస్తులు, నందమూరి వంశస్తులు ఘన స్వాగతం పలికారు. నందమూరి ప్రభుకుమార్, నందమూరి వెంకటేశ్వరరావు.. అనే అన్నలు నన్ను రోడ్డుపక్కనే ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్లారు. టీడీపీ నాయకులు తమ ఇష్టారాజ్యంగా దాదాపు 50 అడుగుల లోతుకు అడ్డంగా తవ్వేసిన ఆ ఊరి చెరువును, అక్కడే ఉన్న పొక్లెయిన్‌ను చూపించి.. అవినీతికి ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుందన్నా.. అని ప్రశ్నించారు. మహానుభావుడు ఎన్టీ రామారావుగారి గౌరవాన్ని, ఈ ఊరి పేరునూ మంటగలిపేశారంటూ మండిపడ్డారు. ‘మా ఊరిని అభివృద్ధి చేసింది రామారావుగారు, రాజశేఖరరెడ్డిగారే.

మీరు నిలబడ్డ ఈ రోడ్డు సైతం మీ నాన్నగారి చలవే. ఆయన హయాంలో మా ఊరంతా సిమెంట్‌ రోడ్లు వచ్చాయి. పేదలందరికీ పట్టాలిచ్చి కాలనీ కట్టించారు. పార్టీలకతీతంగా అందరికీ తెల్లకార్డులు, పింఛన్లు వచ్చాయి. కానీ ఈ చంద్రబాబు పాలనలో.. అర్హతలున్నా పార్టీ వివక్షతో పింఛన్లు ఇవ్వడం లేదు. ఇదిగో ఈయనే అందుకు నిదర్శనం’ అంటూ అక్కడే ఉన్న కుదరవల్లి సుబ్రహ్మణ్యం అనే పెద్దాయనను చూపించారు. ‘ఎన్టీఆర్, వైఎస్సార్‌ల హయాంలో మా ఊళ్లో అభివృద్ధి పరుగులిడితే.. చంద్రబాబు, లోకేశ్‌ జమానాలో అవినీతి రాజ్యమేలుతోంది’ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు పుట్టిన ఊరైనా, ఎన్టీఆర్‌ స్వగ్రామం అయినా, మరే ఊరైనా.. వీరి అవినీతికి అతీతం కాదని తేటతెల్లమైంది. ‘అన్నా.. ప్రభుత్వం వచ్చాక మా ఊరిని బాగా చూసుకోండన్నా’ అని నందమూరి వంశస్తులు అడుగుతుంటే.. మీ ఊరిని బాగా చూసుకోవడమే కాదు ఈ జిల్లాకు సైతం ఎన్టీఆర్‌గారి పేరు పెడతానని ప్రకటించాను. ‘చంద్రబాబుతో సహా తెలుగుదేశం పార్టీ.. రామారావుగారి పేరును కరివేపాకులా వాడుకుంటుండగా వైఎస్సార్‌ తనయుడైన మీరు.. మేమంతా గర్వించదగ్గ స్థాయిలో రామారావుగారికి గౌరవాన్నివ్వడం చాలా సంతోషం’ అంటూ నిమ్మకూరు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలుగునేల కళా వారసత్వానికి, తెలుగువాడి తెగువకు ప్రతీకలాంటి ఎన్టీ రామారావుగారి పేరుపెట్టడాన్ని నేను గర్వంగా భావిస్తే.. కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు.. ఆ విషయాన్ని తప్పుబడుతూ క్షుద్రరాజకీయ ప్రయోజనాలు అంటగట్టడం సిగ్గుచేటైన విషయం.   

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రత్యేక హోదా విషయమై నేను పదే పదే సంధించిన ప్రశ్నలకు నేటి మీ తిరుపతి సభలోనైనా సమాధానం వస్తుందని ఆశించాం. కానీ అక్కడా మీ నైజాన్ని చాటుకుంటూ.. ఆత్మస్తుతి పరనిందగా మీ సభను సాగించారు. సమాధానాలు చెప్పడంలేదంటే.. ఈ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా విషయంలో మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టే కదా?!  
- వైయ‌స్‌ జగన్‌

Back to Top