పర్యాటకులను ఆకర్షించేలా జూ పార్క్‌ల అభివృద్ధి

 అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
 

 అమరావతి: పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలోని జూ పార్క్‌ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన జూ అథారిటీ ఆఫ్‌ ఏపీ గవర్నింగ్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించేలా విశాఖ, తిరుపతి జూ పార్క్‌లను తీర్చిదిద్దేందుకు.. దేశంలోని పలు జూ పార్క్‌ల అథారిటీలతో జంతువుల మారి్పడి కోసం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. 

జంతువులను సంరక్షించే సిబ్బంది నియామకాలు, రెగ్యులరైజేషన్‌పై హేతుబద్ధత కోసం సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విశాఖ జూ పార్క్‌కు సంబంధించిన కొత్త లోగోను, జంతువులను పోలిన పలు వస్తువులను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. జంతువుల చిత్రాలతో రూపొందించిన టీషర్ట్‌లు, టోపీలు, గృహాలంకరణ వస్తువులను పరిశీలించారు. అటవీదళాల అధిపతి మధుసూదన్‌రెడ్డి, అడిషనల్‌ పీసీపీఎఫ్‌ శాంతిప్రియపాండే, అటవీ శాఖ స్పెషల్‌ సెక్రటరీ చలపతిరావు, విశాఖ క్యూరేటర్‌ నందినీ సలారియా, తిరుపతి క్యూరేటర్‌ సెల్వం, విశాఖ సర్కిల్‌ హెడ్‌ శ్రీకంఠనాథరెడ్డి, తిరుపతి సర్కిల్‌ హెడ్‌ ఎన్‌.నాగేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.

Back to Top