చంద్రబాబు స్క్రిప్ట్‌లా పురంధేశ్వరి మాటలు 

మంత్రి గుడివాడ అమర్నాథ్‌

విశాఖ: చంద్రబాబు స్క్రిప్ట్‌లా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాటలున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు. చంద్రబాబు పార్టీని గెలిపించడానికి పురంధేశ్వరి తాపత్రయ పడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పురంధేశ్వరి దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాలు ఇచ్చే ఆదాయాన్ని కేంద్రం తిరిగి  ఇస్తోందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీకి కనిపించడం లేదా అని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు ఏపీలో అమలవుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని మంత్రి తెలిపారు.

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్  ఏం మాట్లాడారంటే:

పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులా..? బాబు గారి జనతా పార్టీకి అధ్యక్షులా..?:
- రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోతోందని, రాష్ట్రం అప్పుల పాలవుతుందని, కేంద్రం నుంచి వస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపిస్తున్నారు. 
- అధికారకంగా కొన్ని లెక్కలు, అనధికారికంగా మరికొన్ని లెక్కలు చెప్తున్నామని అంటున్నారు. 
- వాస్తవానికి పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులా..? బాబు గారి జనతా పార్టీకి అధ్యక్షులా..? 
- బీజేపీలోని పెద్దలు గతంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడి ఉండొచ్చు. 
- కానీ చిన్నమ్మ గారు మాట్లాడేది మరిది గారి స్క్రిప్ట్‌ మాట్లాడినట్లుంది తప్ప సొంతగా మాట్లాడారని అనిపించడం లేదు. 
- ఎక్కడికెళ్లినా ఇదే సినిమా కన్పిస్తోంది...ఆయన బండెక్కి మాట్లాడినా, పదవి తీసుకుని ఈమె మాట్లాడినా స్క్రిప్ట్‌లో మాత్రం తేడా ఉండటం లేదు. 
- చిన్నమ్మ గారికి రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనే తపన ఉంటే తండ్రిగారు పెట్టిన పార్టీ ఉంది కదా..?
- తండ్రిగారు పెట్టిన పార్టీనేమో మరిదిగారు నడుపుతారు...ఈమె వేరే పార్టీలో ఉండి మరిది గారు చెప్పిన మాటలు మాట్లాడుతున్నారు. 
- ఎటొచ్చి తండ్రిగారి పెట్టిన, మరిదిగారు నడుపుతున్న రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వేరే పార్టీలో ఉండి మాట్లాడటం దేనికి..? 
- అదేదో వీరు కూడా ఆ పార్టీలోకి వెళ్లి..మరిదిగారిని పక్కన పెట్టి ఆ పార్టీకి రాష్ట్రానికో..జాతీయ అధ్యక్షులో అయ్యి రాజకీయాలు చేయవచ్చు. 
- వాస్తవానికి రాజకీయ వారసులు కొడుకులు కానీ, కూతర్లు కానీ అవుతారు. 
- సరే కొడుకుల సంగతి పక్కన పెడతాం. ఆయన ఎలాగూ పిల్లనిచ్చాడు కాబట్టి మాట్లాడటానికి అవకాశం లేదు. 
- కనీసం నీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్లు టీడీపీలో రింగ్‌ మాస్టర్‌. ఆనాడు ఎన్టీఆర్‌ వద్ద ఏ నిర్ణయం తీసుకోవాలంటే వెంకటేశ్వరరావుగారి సలహా లేకుండా పార్టీ నడిచేది కాదు. 
- అటువంటి మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ మాయల పకీరు మాయలో పడి రాజకీయంగా ఏం చేశాడో అందరికీ తెలుసు. 
- మళ్లీ ఆ మాయలో మీరు కూడా పడిపోయి మీ రాజకీయ భవిష్యత్తును మీవారిలా చేసుకోవాలనుకుంటే మేమేం చేయలేం. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యం నుంచి ఆదాయం రావట్లేదా..?:
- రాష్ట్రంలో నడుస్తున్న సంక్షేమ పథకాలన్నీ మద్యం నుంచి వచ్చే ఆదాయంతోనే ఇస్తున్నారని ఆమె అంటున్నారు. 
- బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా మద్యపానం లేదా..? దానితో ఆదాయం రావడం లేదా..?
- ప్రతి రాష్ట్రంలో వివిధ విభాగాల నుంచి ఆదాయం వస్తుంది....
- ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటాం. 
- ఈ ప్రక్రియలో కేంద్రం నుంచి ఇస్తున్న డబ్బుల నుంచి ఇస్తున్నాం అంటూ మాట్లాడటం విడ్డూరం. 
- మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం నుంచి 2021–22లో రూ.400 కోట్లు మాత్రమే వచ్చింది. 
- కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన రూ.1100 కోట్లు మీరిచ్చారా..? 
- కేంద్రం నుంచే నిధులు రాష్ట్రం నుంచి వచ్చే పన్నుల నుంచి వచ్చేవి కాదా..? కొత్తగా ఏమైనా ప్రింట్‌ చేసి ఇస్తున్నారా..? 
- దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నిధులనే మళ్లీ రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. 
- అలా వ్యత్యాసం చూస్తే మనం కట్టే పన్నులెంత..మాకు ఇచ్చేదెంత..? అనే లెక్కలు తీస్తే మేం చర్చకు సిద్ధం. 
- మీరు నార్త్‌ ఇండియాలో రాష్ట్రాలకు, సౌత్‌ ఇండియాలోని రాష్ట్రాలకు ఇస్తున్న నిధులెంతో చర్చిద్దామా..? 
- మీరు మాట్లాడుతున్నవన్నీ కేంద్రం నుంచి వచ్చిన లెక్కల్లా కనిపించడం లేదు..
- మీరు మాట్లాడే మాటలన్నీ మరిదిగారి మాటల్లా కనిపిస్తున్నాయి తప్ప మీ పార్టీ, ప్రభుత్వం మాట్లాడిన మాటలుగా అనిపించడం లేదు. 

విశాఖ ఉక్కుపై ఎందుకు స్పందించలేదు చిన్నమ్మా..?
- నేడు విశాఖలో భూములపై ఉన్న శ్రద్ధ రాష్ట్రం మీద లేదంటూ విమర్శిస్తున్నారు. 
- మీ మరిది గారి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన భూస్కామ్‌ల గురించి ఎందుకు మాట్లాడలేదు..? 
- మీరు ‘బాబుగారి జనతా పారీ’్టలోకి మారిన తర్వాత అన్ని సమస్యలు గుర్తుకువస్తున్నాయి. 
- ఇదే విశాఖ నుంచి ఐదేళ్ల పాటు పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన మీకు విశాఖకు రైల్వే జోన్‌పై పెద్ద ఉద్యమం జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు..? 
- ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదు..అందుకే పెట్టడం లేదని మాట్లాడుతున్నారు. 
- రేపే చెప్పండి..కేకే లైన్‌తో కూడిన పూర్వపు వాల్తేర్‌ డివిజన్‌ను ఉంచుతూ మేం రైల్వే జోన్‌ ఇస్తామని చెప్పండి. 
- ఒక మంత్రిగా నేను సీఎంగారిని ఒప్పించి 24 గంటల్లో భూమిని ఇస్తాం. 
- దాదాపు రెండున్నరేళ్లుగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఉద్యమం జరుగుతుంటే దాని గురించి మాట్లాడటం లేదు. 
- దాని గురించి ఎందుకు స్పందించలేదమ్మా చిన్నమ్మా..? 
- ఇదే ప్రాంతానికి మీరు ప్రాతినిధ్యం వహించారు కదా..ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు, సమస్యలు మీకు తెలుసు కదా. 
- మీకు అత్యంత సమీప బంధువు గీతం కాలేజీ వారు 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు..? 
- కొన్ని వేల ఎకరాల ప్రభుత్వం భూములు మీ మరిదిగారి ప్రభుత్వంలో అన్యాక్రాంతం అయిపోతే దాని గురించి ఆనాడు ఎందుకు మాట్లాడలేదు..? 

విశాఖ నుంచే పదేళ్లు ప్రత్యేక హోదా అన్నారు..ఏదీ ఎక్కడ..?:
- 2014లో బీజేపీ తన మేనిఫెస్టోను ఇదే విశాఖలో ప్రకటించారు. ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. 
- ప్రత్యేక హోదా ఏమైంది..మీరు ఎందుకు హోదాపై స్పందించడం లేదు..? 
- మీ మరిదిగారు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న దానికి మీరు ఏకీభవిస్తారా..? 
- చేస్తున్న అప్పులకు, క్రియేట్‌ అవుతున్న ఆస్తులకు పొంతన ఉండటం లేదని పురందేశ్వరి అన్నారు. 
- ఆదాయం పెరగడం అంటే పేదవాడి జీవన శైలి మారడమే. 
- పేదవాడికి అనేక పథకాల ద్వారా హ్యూమన్‌ క్యాపిటల్‌పై ఇన్వెస్ట్‌చేస్తున్న ప్రభుత్వం జగన్‌ గారి ప్రభుత్వం. 
- వారిపై ఇన్వెస్ట్‌ చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని మేం చెప్పడం లేదు..నీతి అయోగ్‌ కూడా చెప్తోంది. 
- రాష్ట్రంలో పేదరికం ఏ విధంగా తగ్గుతూ వస్తుందో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి అయోగ్‌ చెప్తోంది. 
- మీరు కానీ మీ మాయల పకీర్‌ మరిది గారి ఉచ్చులో పడితే మీ భర్త వెంకటేశ్వరరావు గారిలాగే మీ రాజకీయ చరిత్ర కూడా ముగిసిపోతుంది. 
- మీ భర్త ఆనాడు మీ మరిదిగారిపై పుస్తకం రాశారు. మీరు మళ్లీ ఆయన ట్రాప్‌లో పడిపోతే ఆ పుస్తకం రెండో పార్ట్‌ రాయాల్సి వస్తుంది. 
- మీ నాన్న గారు పెట్టిన పార్టీని తిరిగి స్వాధీనం చేసుకోండి...
- కాంగ్రెస్‌ పార్టీలో మీరు పదేళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీకి మీరు స్వస్తి పలికారు. 
- గత పదేళ్లుగా బీజేపీతో ఉన్నారు. కాంగ్రెస్‌ను మోసం చేసినట్లే మోడీ, అమిత్‌షాలను మోసం చేసి మీ మరిదిగారి మాయలో పడితే ఇబ్బందిపడతారు. 

రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలూ ఒక్కటీ మీకు కనిపించడం లేదా..?:
- రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదంటూ మాట్లాడుతున్నారు. 
- మీ మరిది గారు పెట్టుబడుల సదస్సు పెట్టినప్పుడు గూర్ఖాలు పండగ చేసుకున్నారు. 
- ఈ చుట్టుపక్కల ఎక్కడా వాచ్‌మెన్లు కూడా దొరకలేదు. 
- మేం ఒకే ఒక్క సారి పెట్టుబడుల సదస్సు పెట్టాం. దానికి అంబానీ, ఆదానీ, జిందాల్, దాల్మియా వంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. 
- ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సులో చేసుకున్న ఒప్పందాల మేరకు అన్నీ గ్రౌండ్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. 
- బీమిలిలో ఓబెరాయ్, మేఫేర్‌ వాళ్లవి రిసార్ట్స్‌ వస్తున్నాయి. అచ్యుతాపురంలో అనేక పరిశ్రమల స్థాపనకు మొన్నటి క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. 
- గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ 1200 ఎకరాల్లో పెట్టాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నాం. 
- మొండలేజ్‌ అనే ఒక అంతర్జాతీయ సంస్థ నెల్లూరులో రూ.1600 కోట్లు పెట్టుబడులు పెట్టబోతోంది. 
- అది ఏసియాలోనే అతి పెద్ద పెట్టుబడి, ఇండస్ట్రీగా చేపడుతున్నారు. 
- దేశంలో ప్రముఖ ఏసీ తయారీదారులు బ్లూస్టార్, డైకిన్, పానసోనిక్‌ వంటి వాటికి రాష్ట్రం హబ్‌గా మారుతోంది. 
- మరో రెండేళ్లలో దేశంలో వంద ఏసీలు తయారైతే అందులో 45–48 ఏసీలు మన రాష్ట్రంలోనే తయారు కాబోతున్నాయి. 
- టీసీఎల్‌ వంటి సంస్థలు, టీవీ ప్యానెల్స్‌ సంస్థలు వంటివి అనేకం వస్తున్నాయి. 
- ఒక్క ఫార్మా రంగం నుంచే విశాఖ పోర్టు నుంచే 2 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు చేశాం. ఇవేమీ మీకు కనిపించకపోతే ఎలా..? 
- ఇక్కడ అక్రమాలు, అన్యాయాలు జరిగిపోతున్నాయి అంటే ఎలా..? 
- ఒక్క సారి మణిపూర్‌ వెళ్లి చూడండి..దాని గురించి మాట్లాడితే ఇక్కడ జరుగుతున్న అంశాలు గురించి తర్వాత మాట్లాడొచ్చు. 

నాడు ఆరాచకం అనిపించలేదా..?
- మీ మరిదిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరులో మేయర్‌ని చాంబర్‌లోకి వెళ్లి చంపేశారు. 
- మరి మీరు అప్పుడు అరాచకం అని ఎందుకు మాట్లాడలేదు. 
- మీరంతా కలిసి ఏదో రకంగా జగన్‌ గారిని గద్దె దించి, మరిది గారిని ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయపడుతున్నారు. 
- తిరిగి మాయ, మోసం చేసి రాష్ట్ర ప్రజలను మళ్లీ పేదరికంలోకి నెట్టేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. 
- మీరు ముసుగులు వేసుకుని వివిధ రాజకీయ పార్టీలకు వెళ్లి...అందరూ కలిసి జగన్‌ గారిపై యుద్ధం చేస్తున్నారు. 
- టీడీపీ, బీజేపీ, జనసేన అంతా కలిసి వచ్చినా 2024లో కూడా ఇంతకు మించి సీట్లతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతోంది. 
- బాబు గారి జనతా పార్టీ అధ్యక్షులుగా మీరు, మీ పార్టీలో ఉన్న బాబుగారి కోవర్టులు అంతా కలిసినా మమ్మల్ని ఏం చేయలేరు. 
- మీ భర్త గారు మరో పుస్తకం రాయకుండా చూసుకోవాలని మా తాపత్రయం. 
- ఎన్టీఆర్‌ బిడ్డగా మీపై మాకు గౌరవం ఉంది..
- మా కోరికల్లా మాయలపకీరు మరిది గారి ట్రాప్‌లో పడొద్దని మా విజ్ఞప్తి. 
- అధికారికంగా బీజేపీలో ఉండి...అనధికారికంగా టీడీపీ ప్రయోజనాల కోసం పాటుపడవద్దని మేం చెప్తున్నాం. 
- మీరు విమర్శలు చేసేటప్పుడు ఆచితూచి చేస్తే మంచిదని మా సూచన. 

అప్పులపై కేంద్రం నుంచి డేటా తీసుకోండి..మీ మరిది గారి నుంచి కాదు:
- చిన్నమ్మ గారు మాజీ కేంద్ర మంత్రి...కిషన్‌ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కదా..
- ఆయన మొన్న తెలంగాణలో మాట్లాడేటప్పుడు ఆయన పక్క రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నారు..తెలంగాణ వారు ఆ రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నారు. 
- మరి ఆయన లెక్కలు తీసుకోవాలా..? నిన్న కాక మొన్న పదవి తీసుకున్న చిన్నమ్మ మాట నమ్మాలా..? 
- దేశంలోనే 20 శాతం నిర్మాణాలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నాయి. 
- మేం పేదవారికి 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్లే అది సాధ్యమైంది. 
- రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవాలన్నా...రూపాయి ఖర్చు పెట్టాలన్నా రికార్డు ఉంటుంది. 
- ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి పైసా ఖర్చు పెడుతున్నామని వారు తెలుసుకోవాలి. 
- ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతాల నిధులు వస్తే వాటిని వేరే చోట ఖర్చు పెట్టిన వ్యక్తి ఆమె మరిదిగారు. 
- అప్పుల్లో టాప్‌ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉందా..? ఒక్క పైసా కూడా వృథాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టదు. 
- కేంద్రం నుంచి డేటా తీసుకుని చూస్తే ఇవన్నీ తెలుస్తాయి..మరిది గారి నుంచి డేటా తీసుకుని చదివితే ఇవన్నీ ఏం తెలుస్తాయి..? 

Back to Top