వెర్రిగొర్రెల వాటం


ఓ ఊళ్లో ఓ మోతుబరి ఉన్నాడు. ఊరంతా ఒకదారైతే ఆ మోతుబరిది మరో దారి. అందరూ ఎంచక్కా రోడ్డు మీద నడుస్తుంటే ఆయన అడ్డదారుల్లో ప్రయాణం చేస్తుంటాడు. ఊరి ప్రజలంతా గుడికి వెళ్తుంటే ఈయన మంత్రగాళ్లను నమ్ముతుంటాడు. ఊరంతా ఏది వద్దంటే మొద్దు మోతుబరి అదే కావాలంటాడు. ఊరు మొత్తం దేన్ని వ్యతిరేకిస్తే దాన్నే సమర్థిస్తాడు. 
ఓ ఏడాది ఊరికి కష్టం వచ్చింది. పెద్ద కరువొచ్చి పడింది. పంటలు లేవు, దిగుబడులు లేవు, ఆదాయం లేదు, ఆనందం లేదు. దాంతో పన్నుల కట్టలేమని రాజుగారి వినతిపత్రాలు పంపింది. ఊరిని ఆదుకోవాలని కోరింది. కానీ రాజు దగ్గర్నుంచి సమాధానమే లేదు. ఆ సమయంలో ఊరంతా ఒక్కటై ఓ నిర్ణయానికొచ్చింది. ఊళ్లోని పిల్లాపెద్దా అంతా కలిసి రాజధానికి వెళ్లాలని, తమకు న్యాయం చేయమని అందరి సమక్షంలో రాజును అడగాలని అనుకున్నారు. ఒకరికొకరు చెప్పుకుని, ఎడ్లబళ్లు కట్టుకుని రాజధానికి బయలు దేరారు. నువ్వు కూడా రా బాబూ అంటూ మోతుబరిని పిలిచారు. కానీ ఆ మోతుబరి ఎడ్డమంటే తెడ్డం అనే రకం గదా. హాఠ్...నేనెందుకు రావాలి. కావాలంటే మీరెళ్లండి అన్నాడు. వీడిప్పుడూ ఇంతే అనుకుంటూ ఊరి వాళ్లు రాజును కలవడానికి రాజధానికి వెళ్లారు. హాశ్చర్యం. ఆ మోతుబరి అక్కడున్నాడు. అదేమిటి...రానన్నావ్...మా కంటే ముందు ఎలా వచ్చావ్ అడిగారు తోటి గ్రామస్తులు. మోతుబరి మీసం మెలేసి నవ్వాడు. చూడండి ఇక్కడ నేనేం చేస్తానో...మన ఊరి సమస్యను ఇట్టే తీర్చేస్తాను. నాకు బాగా తెలిసినవాళ్లు ఇక్కడ చాలామంది ఉన్నారు. రాజుగారిని సులువుగా కలిసేస్తాను అంటూ హడావిడి చేసాడు. ఎంత ఎదురు చూసినా వాళ్లకి రాజు దగ్గర్నుండి పిలుపేం రాలేదు. ఇక లాభం లేదని ఆ ఊరి ప్రజలంతా కోట బైట బైఠాయించారు. రాజుగార్ని కలిసేదాకా, తమ సమస్యలు తీరే దాకా ఇక్కడే ఉంటామని ప్రతిజ్ఞ చేసుకున్నారు. 
ఇదంతా జరిగేటప్పుడు మోతుబరి ఎటెళ్లిపోయాడో అనుకున్నారు కొందరు. రాజుకు కలిసేందుకు ఊరంతా ఒక్కటై కోట గుమ్మం దగ్గర ఉంటే మోతుబరి రాజధాని దాటి చల్లగా జారుకున్నాడు. రాజుగారి కళ్లలో పడితే, ఆయన కోపంతో భటులను పిలిచి జైల్లో పడేయంటే...అందుకే అవన్నీ ఆలోచించే ఊరివాళ్ల కోసం వచ్చినట్టే వచ్చి, వారికి కాకమ్మ కబుర్లు చెప్పి ఉడాయించేసాడు. అక్కడి నుంచి నెమ్మదిగా ఊరు చేరుకున్నాడు. ఇలా వచ్చేసావేమిటి...ఊరి కోసం నువ్వు మనవాళ్లతో ఎందుకు ఉండలేదని ఊళ్లోని మిగతా వాళ్లు అడుగుతారని తెలుసు ఆ మోతుబరికి. అందుకని తను నందిని పంది అంటే అవును పందే అని ఒప్పేసుకునే కొందరితో కలిసి ఓ పథకం వేసాడు. ఇదంతా ఊరి మేలుకే అని అన్ని ఊళ్లలో టముకులేయించాడు. ’ ఇందు మూలంగా యావన్మందికీ తెలియజేయునదేమనగా మన ఊరి పరిస్థితి బాగు పడాలని చక్రాల్లేని బండికి, ఎడ్లు లేని కాడెని కట్టి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాను..అన్నాడు...ఊళ్లో మిగిలిన వాళ్లంతా ఆ మోతుబరిని, అతడి వెనక నడుస్తున్న వాళ్లని చూసి  వెర్రి గొర్రెలు అని పిలవడం మొదలెట్టారు...
కథ అయిపోయిందనుకుంటున్నారా లేదు...నేటికీ ప్రజాస్వామ్య కాలంలోనూ ఇలాంటి వెర్రి గొర్రెలు చాలా ఉంటున్నాయి. జాగ్రత్తగా చూడండి...రోడ్ల మీద ఏ సైకిల్ తొక్కుతూనో, తింగరి మంగరి మాటలు మాట్లాడుతూనో కనిపిస్తాయి. 
 
Back to Top