ఇద్దరు పండితులు-ఇద్దరు పుత్రులు

"కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడురా " అన్నారు అప్పారావు మాస్టారు.
అంటే ఏటండీ అని  అడిగాడు శిష్యుడు గోపాత్రుడు.
"మరేం లేదురా...ఇపుడు  మన  చంద్రబాబు నాయుడు ఉన్నారనుకో...ఆయన  బోలెడు బిజీలో ఉంటే..పాపం ఆయన  కొడుకు లోకేష్ బాబు  పార్టీ వ్యవహారాలు..ప్రభుత్వ వ్యవహారాలూ కూడా చక్కబెడుతున్నారు కదా. అలాగన్నమాట"
గోపాత్రుడికి ఎక్కడలేని ఆనందం తన్నుకొచ్చింది.ఎందుకంటే వాడు చంద్రబాబు వీరాభిమాని.
"అంటే మా గురూగోరి కొడుకు కూడా  మా గురూగోరిలాగే పెద్ద పొజిషన్ లోకి వెళ్లిపోతారన్నమాట" అన్నాడు.
అప్పారావు మాస్టారు నవ్వేశారు. 

పోనీ అలాగే అనుకుందాంరా తప్పేటీ? అన్నారు మాస్టారు.
మరయితే లోకేష్ బాబు కూడా సిఎం అయిపోతారా అని అడిగాడు గోపాత్రుడు.
"సిఎం అవుతారో లేదో  చెప్పలేను కానీ..ఢిల్లీ వెళ్లి మా బాగా చక్రం తిప్పుతారని అంటున్నార్రా" అన్నారు మాస్టారు.
గోపాత్రుడికి అది అర్ధం కాలేదు.
సెక్రం తిప్పడమేటండీ బాబూ. అంటే ఏటీ? ఏం సెక్రం తిప్పుతారు? అయినా సెక్రం తిప్పే కర్మ ఆయనకేటి. ఆయన వీలకానీ వేస్తే పది మంది వచ్చి సెక్రం తిప్పి పోతారు కదండీ బాబూ అని కొంచెం ఆవేశంగానే అడిగాడు గోపాత్రుడు.
అప్పారావు మాస్టారు నవ్వాపుకోలేకపోయారు.
చక్రాలు ఎవరిని పడితే వారి చేతి తిప్పించకూడదురా.
అవి ఎవరికి వారే తిప్పుకోవాలి. అని మాస్టారు వివరించారు.
అప్పటికీ గోపాత్రుడికి అర్ధం కాలేదు.
వాడి అవస్థ చూసి జాలి పడి మాస్టారే మళ్లీ చెప్పడం మొదలు పెట్టారు.

అది కాదురా ఒరేయ్..ఇపుడు  సోనియా గాంధీగారు ఉన్నారు కదా. పాపం ఆవిడకి ఏడు పదుల వయసు దాటేసింది. ఎక్కువ ఓపిక లేదు. అందుకే పార్టీ పనులు గట్రా  కొడుకు చూసుకుంటే..తాను గాంధీ..నెహ్రూ అంటూ కాలక్షేపం చేద్దామనుకుంటోందావిడ. అంతే ఆవిడ కష్టాన్ని అర్ధం చేసుకున్న  రాహుల్ గాంధీ ఏం చేశాడు? చక్కగా పార్టీ పనులన్నీ చక్కబెడుతున్నాడా లేదా?  లోకేష్ బాబులాగే రాహుల్ గాంధీ కూడా  నడిచొచ్చిన కొడుకే అన్నమాట" అని వివరించారు మాస్టారు.
గోపాత్రుడు అంతకు ముందే టీవీలో చూసిన వార్త ఒకటి గుర్తుకొచ్చింది.
మరి రాహుల్ బాబేటండీ.. అక్కడ అసెంబ్లీలోనో ఎక్కడో అందరూ మీటింగ్ లో మాట్లాడుకుంటా ఉంటే సుబ్బరంగా నిద్రపోయారంట కదండీ బాబూ అని గోపాత్రుడు డౌట్ బయట పెట్టాడు.

"వార్నీ నీకు  కరెంట్ అఫైర్స్ మీద కూడా  అవగాహన ఉందేంటి? అన్న మాస్టారు...రాహుల్ గాంధీ నిజంగా పడుక్కోలేదురా బాబూ. ఊరికే కళ్లు మూసుకుని ఈ దేశాన్ని ఎలా బాగుచేయాలా అని ఆలోచిస్తున్నారట. అపోజిషన్ వాళ్లు పని గట్టుకుని ఆయన నిద్రపోతున్నాడని దుష్ప్రచారం చేసేశారు...పాపం రాహుల్ గాంధీ అలా నిద్రపోయే రకం కాదురా బాబూ అని చెప్పారు మాస్టారు.
లోకేష్ బాబుకీ..రాహుల్ గాంధీకి సమ్మందం ఏటండీ బాబూ నాకర్దం కావడం లేదు అన్నాడు గోపాత్రుడు బుర్ర గోక్కుంటూ.
మాస్టారు నవ్వాపుకుని..." ఇద్దరికీ కొన్ని పోలికలు ఉన్నాయిరా. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో తిరుగులేని పండితుడు. రాజీవ్ గాంధీ  పరిపాలనలో  మంచి పండితుడు.ఈ ఇద్దరు పండితులకూ..బంగారంలాంటి కొడుకులే పుట్టారు. చంద్రబాబుకి లోకేష్ బాబు..రాజీవ్ గాంధీకి రాహుల్ గాంధీ తమ తమ తండ్రులను మించిన   గొప్పవాళ్లురా బాబూ."అని మాస్టారు చెప్పారు.
అంటే ఇద్దరూ కూడా గొప్పేళ్లంటారా బాబూ " అన్నాడు గోపాత్రుడు.

మాస్టారు తడుముకోకుండా అవున్రా .. ఇపుడు చంద్రబాబు దేశ విదేశాల్లో తిరుగుతూ ఉంటే లోకేష్ బాబు అన్ని పనులూ చక్కబెడుతున్నాడా లేదా  అలాగే రాహుల్ గాంధీ కూడా  కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే ..పార్లమెంటులో  మెడిటేషన్  చేస్తూ  పార్టీని..దేశాన్నీ  అభివృద్ధి చేయడానికి పాటు పడుతున్నారు కదా.అందుకే ఇద్దరూ కూడా గొప్పవాళ్లన్నమాట" అన్నారు మాస్టారు.
మరయితే ఇపుడు లోకేష్ బాబు ఢిల్లీ వెళ్తే ఏటవుతుందండీ అని అడిగాడు గోపాత్రుడు.
"ఏమవుతుందిరా?  రాహుల్ గాంధీ లాగే లోకేష్ బాబు కూడా తమ పార్టీని అభివృద్ధి చేస్తారన్నమాట" అన్నారు మాస్టారు.
మాస్టారి మాటలపై గోపాత్రుడికి నమ్మకం కలగలేదు.
మాస్టారి మాటలకు అర్ధాలు వేరే ఉంటాయని వాడి అనుమానం.
రాహుల్ గాంధీ పార్లమెంటులో నిద్రపోవడంపై అన్ని పార్టీలూ  చెవులు కొరుక్కుంటూ ఉంటే మాస్టారేమో  ఆయన నిద్రపోవడం లేదంటున్నారు.
రాహుల్ గాంధీలా లోకేష్ బాబు పార్టీని అభివృద్ధి చేస్తాడని అంటున్నారు.
రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ప్రతీ చోటా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ వస్తోంది కదా.
అంటే లోకేష్ బాబు కూడా  తెలుగుదేశం పార్టీని అలాగే చేస్తారా ఏటి కొంపదీసి అని సణుక్కుంటూ గోపాత్రుడు చుట్ట పీక తీసి నోట్లో పెట్టుకుని వెలిగించాడు.
......................
-కవికాకి
-----------------


తాజా వీడియోలు

Back to Top