ప్రజలు..బాబు రుణం అట్టేపెట్టుకోరు

మా గోపాత్రుడికి చంద్రబాబు నాయుడంటే భలే ఇష్టం. ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబులా మ్యాజిక్కులు చేసే పొలిటీషియన్ ఇంకెవరూ లేరని మా గోపాత్రుడు పదే పదే చెబుతూ ఉంటాడు. అసలు గురజాడ వారి గిరీశం కూడా చంద్రబాబుతో మాట్లాడితే చంద్రబాబు తెలివితేటలకి డంగైపోతాడని గోపాత్రుడి నమ్మకం. 
నేను పేపర్ చదువుకుంటోంటే  గోపాత్రుడు తనలోతానే ఏదో మాట్లాడుకుంటూ వచ్చాడు.
ఏరా గోపాత్రుడూ ఏంట్రా కబుర్లు అని అడిగాను.
మనం దేని గురించి అడిగినా గోపాత్రుడు చంద్రబాబు దగ్గరకు వెళ్లిపోతాడు. 
ఇప్పుడూ అదే చేశాడు. "ఏం ఉంది గురూగోరూ  మా చందరబాబుగోరిని చూశారా? అదరగొట్టేశారండీ బాబూ" అన్నాడు చాలా గర్వంగా.
ఏమైందో అర్ధం కాక అడిగాను. "ఏం అదరగొట్టాడురా  మీ చంద్రబాబు అంత  సంబరపడిపోతున్నావు అన్నా" 
వాడికి బాగా కోపం వచ్చింది. "అదేంటి గురూగోరూ చందరబాబు ఏం చేసినా మీరు గుర్తించరు "అన్నాడు  డీలాగా పోజు పెట్టి. అది కాదురా బాబూ ఏం చేశాడో చెప్పు మెచ్చుకుంటానులే అన్నాను ఊరడింపుగా.
వాడి కళ్లు మెరిసాయి." మరేం లేందండీ గురూ గోరూ ఇక చంద్రబాబుగోరి పాలనలో రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేస్తారట" అన్నాడు.
"దీనికేనా నువ్వు అంత సంబరపడిపోయింది" అని అడిగాను.
గోపాత్రుడు చిన్నబుచ్చుకుని " ఇదే కాదండీ బాబూ  ప్రపంచానికే  ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీలో పాఠాలు చెప్పిన చంద్రబాబుగోరు  రాష్ట్రాన్ని  పేపర్ రహిత రాష్ట్రంగా మార్చేస్తారటండీ" అన్నాడు గర్వంగా.
"అంతేనే ఇంకేమన్నా ఉందా"? అని అడిగాను.
"మీరసలు చంద్రబాబును మెచ్చుకోనే మెచ్చుకోరు " అని ఉక్రోషంగా అన్నాడు గోపాత్రుడు.
"అది కాదులేరా ఇంకేం చేశాడో చెప్పు "అన్నాను.
"ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చేస్తారట" అన్నాడు గోపాత్రుడు.
"చాలా మంచి పనులురా మూడూనూ "అని మెచ్చుకున్నాను.
గోపాత్రుడికి బోలెడు ఆనందమేసింది.
"ధ్యాంక్స్ గురూగోరూ మా చంద్రబాబంటేనే అంతండి మరి" అన్నాడు గోపాత్రుడు.
అవున్రోయ్ గోపాత్రుడు మీ చంద్రబాబు నిన్నేం చేశాడనుకుంటున్నావు అసలు నీళ్లే  లేకుండా  విజయనగరం లో  తోటపల్లి  రిజర్వాయర్ ను మొదలెట్టేశాడ్రోయ్. అంటే  నీటి రహిత ప్రాజెక్టన్నమాట.అన్నాను.
" గోపాత్రుడు గర్వంగా నవ్వుకున్నాడు"
అలాగే పట్టిసీమ దగ్గర చూశావో లేదో గోదావరి కృష్ణాజలాలు కలపకుండానే నదుల అనుసంధానం చేశానని చెప్పుకున్నాడు. అంటే వాస్తవ రహిత  ప్రాజెక్టులన్నమాట అన్నాను.
అందులో  వెటకారం వాడికి అర్ధం కాలేదు.
"మా చంద్రబాబంటే మరేటనుకున్నారు" అన్నాడు కాలరెగరేసుకుంటూ.
అంతకు ముందు రుణాలు మాఫీ చేయకుండానే రుణమాఫీ చేసేశాం అని కూడా చంద్రబాబు ప్రచారం చేశాడ్రోయ్. అంటే  సత్యరహిత ప్రచారమన్నమాట." అన్నాను.
గోపాత్రుడికెందుకో అనుమానమొచ్చింది. 
"మీరు నిజంగానే పొగుడుతున్నారా? లేక  వెటకారం చేస్తున్నారా?" అని ఆరా తీశాడు.
"లేదురా బాబూ నిజంగానే పొగుడుతున్నాను." అన్నాను వాడిని సంతోష పెట్టడానికి
మరి ఇన్ని మంచి పనులు చేసిన చంద్రబాబుగోరి రుణం ఈ రాష్ట్ర ప్రజలు తీర్చుకోవాలా వద్దా "అని అడిగాడు గోపాత్రుడు.
"తప్పకుండా తీర్చుకోవాలిరా బాబూ. లేదంటే అంతకన్నా అన్యాయం మరోటి ఉంటుందా?"
అన్నాను.
గోపాత్రుడు  ఆనందంలో తలమునకలైపోయి గింగిరాలు తిరుగుతున్నాడు.
రుణం ఎలా తీర్చుకుంటారు గురూ గోరూ? వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లోనూ  బాబు ప్రభుత్వాన్నే తెస్తారా" అని అడిగాడు.
వచ్చే ఎన్నికల్లో చూసుకోరా..బాబు రహిత ప్రభుత్వాన్ని తెచ్చి ప్రజలు ఆయన రుణం తీర్చుకుంటారు "అన్నాను.
గోపాత్రుడికి అర్ధం కాలేదు. అయినా నవ్వలేదు.వాడికి ఏదో అనుమానం వేసింది.
నేను ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను.
గోపాత్రుడు ఆలోచిస్తూ ఉండిపోయాడు.
-కవికాకి
Back to Top