<br/>బాబుగారి ధర్మపోరాట సభలకు పహారాలు కాస్తారు. ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు పైకి లేవకుండా సాధ్యమైనంత సాయం చేస్తారు.అధినాయక వర్గానికి కావాల్సినంత సేవ చేస్తారు.ప్రజల అసంతృప్తి సెగ పాలకులపై పడకుండా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడతారు.పబ్లిక్ మీటింగుల్లో పగలూ రాత్రి ప్రభుత్వం కోసం పనిచేస్తారు.ప్రజలకోసం పోలీసులు అనే విషయాన్ని కూడా మరిచి అధికార పక్షానికి దాసోహులు అన్నంతగా తమని తాము తీర్చిదిద్దుకుంటారు. లాఠీ ఛార్జ్ చేయమంటే కాల్పులు జరిపేంత ప్రభుత్వ భక్తి ప్రదర్శిస్తారు.ప్రజా ఉద్యమాలను ప్రభుత్వ కనుసైగతో అణిచేస్తారు.రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వికలాంగులు అనే తేడా లేకుండా సర్కార్ పై నిరసన తెలిపేవాళ్లకు ఖాకీల పవర్ రుచి చూపిస్తారు. అన్యాయం అని అడిగినా, ఇదేమిటని ప్రశ్నించినా కేసులు పెట్టి స్టేషన్లలో కూలేస్తారు. ఇంత చేస్తున్న పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన తోఫా చూస్తే ఎవ్వరికైనా జాలేస్తుంది పాపం. అదీ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున చంద్రబాబు గారు పోలీసులకు ఇచ్చిన వరాలు చూస్తే అంగట్లో పూల మీద చల్లే చిరుజల్లులా అనిపిస్తున్నాయి. జన్మానికో శివరాత్రిలాగా పోలీసు కానిస్టేబుల్ జీవితానికో ప్రమోషన్ ఉండేలా చూస్తామంటూ మహా ఉదారంగా వరం ఇచ్చారు బాబుగారు. అంతే కాదు పోలీసు సంక్షేమ నిథికి 15 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అంత పెద్ద మొత్తాన్ని పోలీసుల కోసం ఇచ్చిన బాబుగారి పెద్ద మనసుకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కాక ఎపి పోలీస్ శాఖ మొత్తం మౌనం పాటించింది.