మ్యానిఫెస్టోలో ఉంది కదా, చెప్పు అంటే బాబు చెప్పరు. ఆ హామీలను చూసే కదా జనం అధికారం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో అడగడం- చెప్పడం- జవాబు దారీ తనం ఉండవా ? చెప్పు అంటే చెప్పను గాక చెప్పను అంటారు బాబు. ఒక్కో హామీని ఒక్కో మెట్టుగా చేసుకుని అన్ని మెట్లెక్కి అధికార పీఠంపై కూర్చున్నప్పుడు ఒక్కో మెట్టు అడగదా? అడగకూడదు ? అమరావతి వనంలో నవనిర్మాణం అంటూ తెలంగాణా రాష్ట్రావిర్భావదినోత్సవ కె.సి.ఆర్ తో సమానంగా, ఆ మాట కొస్తే ఇంకాస్త ఎక్కువే మీడియా స్పేస్ సంపాదించడంలో చూపిన సృజనాత్మకత, చొరవ, ప్రతిభాపాటవాలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడంలో కూడా బాబు చూపితే బావుంటుందని అనుకున్న వాడిదే అఙ్ఞానమైంది. అవిభక్త రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి వెంటవోయి తెలుగువాడ.... తగదింట నడుమ గోడ అంటూ చెయ్యెత్తి జై కొట్టిన సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు కుడిఎడమలు నడవగా విజయవాడలో బాబు ఉద్వేగ భరిత ప్రసంగం చేసినట్లు మీడియా ఉద్విగ్న వార్తనొకటి వండి వార్చింది. ఇటలీ, జర్మనీ, ముస్సోరీ, కాంస్టాంటినోపుల్, బెర్లిన్ గోడ లాంటి ప్రపంచ చారిత్రక పరిభాష వాడులూ బాబు నవనిర్మాణంలో ఇటలీ సోనియాను ప్రస్తుతిస్తూ పరవశించారు. ఆవువ్యాసంలో లాగా చివర ప్రతిపక్ష నాయకుడిని ప్రస్తావించకుండా ముగించలేక పోయారు. అయితే రెండేళ్ళుగా బాబులో ఒక విషయంలో మాత్రం కసితీరలేదు- తగ్గలేదు- బహుశా తగ్గదేమో కూడా విభజించిన వారే కుళ్లికుళ్లి ఏడ్చేలా, అసూయ పడేలా, స్పృహదప్పి పడిపోయేలా రాష్ట్రాన్ని రాత్రింబవళ్లు అభివృద్ధి చేస్తానంటుంటారు. అతడు సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ ఒకటి - `` ఒరేయ్ బాబ్జీ ఎవరైనా కోపంగా కొడతారు, కసిగా కొడతారు, గట్టిగా కొడతారు, వీడెంట్రా ఇలా కొట్టాడు ? ``అని. అలా బాబు కూడా ఏపీని ఎలా కట్టాడురా బాబ్జీ అని త్రివిక్రమ్ డైలాగ్‌ను తిరగ రాసుకునేలా కడుతున్నారు. ప్రతి మాటకు ముందు వెనుక బాబు తప్పని సరిగా అనే మాట - హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంపై నేనే పెట్టాను. రాజధాని లేని రాష్ట్రంలో గుడారాల్లో, గుడ్డిదీపాల కింద పాలించాల్సివస్తోంది అని పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా హక్కుల గురించి అందరికంటే బాబుకే బాగా తెలుసు. అందుకు వీలుగా హైదరాబాద్ సెక్రటేరియట్ లో, రాజ్‌భవన్ రోడ్ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ లో,చివరకు తాను ఎంతో కాలంగా ఉంటున్న జూబ్లీహిల్స్ ఇంటిని కూడా రీమోడల్ ప్రారంభించారు. ఈ లోపు `` మన వాళ్లు బ్రీఫ్‌డ్‌మీ `` అంటూ రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌లో ఆడియో, వీడియో, నోట్ల కట్టలు వగైరా చిన్నాచితక సవాలక్ష గొలుసుకట్టు సమస్యల్లో కూరుకుపోయారు. చివరకు లేక్‌వ్యూల్లో సెక్రటేరియట్‌లో ఉంటే ఊపిరాదేలా లేదని పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా ఊరొదిలి వెళ్లి పోయారని లోకం కోడైకూస్తోంది. హైదరాబాద్ పై ఉన్న అధికారం, మమకారం బాబు ఎందుకొదులుకున్నారని ఎవ్వరూ అడగరు- అడగకూడదు. అదొక బహిరంగ రహస్యం. తానే మ్యానిఫెస్టోలో పెట్టి, తానే వాటిని మరచిపోయి, తానే హైదరాబాద్ ఇంటిని స్వర్గధామం చేసుకుంటూ, సేదతీరగడానికి స్టార్ హోటల్లో, ఫామ్ హౌస్ లో , అద్దె ఇంట్లో ఉంటూ తానే బ్రీఫ్‌డ్‌మీ అంటూ మెడకు ఫోన్ వైర్ బింగించుకుని తనకు తానే హైదరాబాద్ లో ఉండలేని ఒప్పందాల్లో ఇరుక్కుని ఇటలీని, ఇజ్రాయిల్‌ను, ఇస్తాంబుల్‌ను బాబు ఎందుకు తిడుతున్నారో చూసే వారికి, వినే వారికి అర్థంకాదు. కానీ, బాబు మాటల భాష్యకారులు, మహోభాష్యకారులు, వాచ్చకారులుంటారు. వారికి తెలుసు ఏ చేత కాని తనాన్ని ఎవరిపై నెట్టడానికి ఏ కాన్సెప్టులు ఎలా పుడతాయో ? వాటిని ప్రచారంలో పెట్టడానికి ఎవరు ఎలా భుజాన వేసుకుని వేడి తగ్గకుండా ఎలా చూస్తారో. ఒక బూచిని, ఒక విలన్‌ను ప్రజల ముందు నిత్యం నానేలా చేస్తూ తాను హీరోలా ఎలా ఉండాలనుకుంటారో ? అందుకు ఆయన ఆరాటమెంతో? దాని విలువెంతో? అన్నీ భాష్యకారులకు తెలుసు. ఎవరి ప్రయోజనాలు వారివి. చప్పున ఎవరూ చెప్పరు. తెలిసినా చెప్పరు. తెలుసుకుని అసలే చెప్పరు. ఊరికే చెప్పమంటే చెప్పనే చెప్పరు. గట్టిగా అడిగినా చెప్పరు. ప్రతిపక్షం బాధ్యత కదా అడగడం అన్నా చెప్పరు. ఇలా అయితే ఇంకెలా చెప్పు....!