అనపర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

కాపులను కించపరచడం మానుకోవాలి 

వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు పేపకాయల మణికంఠ హెచ్చరిక

అనపర్తి: ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుసరిస్తున్న వైఖరి సభ్యతలేని, సంస్కారహీన రాజకీయాలకు పరాకాష్టగా మారుతోందని రంగంపేట మండలానికి చెందిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేపకాయల మణికంఠ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ విమర్శల పేరుతో కాపు సామాజిక వర్గాన్ని, కాపు నాయకులను కించపరచే వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో, వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పాట రూపంలో ప్రజలకు వివరించగా, దానిపై స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయని మణికంఠ ఆగ్రహం వ్యక్తం చేశారు. “రికార్డింగ్ డ్యాన్స్ కంపెనీ పెట్టుకోవాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలు కాదని, అవి పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఇది తొలిసారి కాదని, ఇటీవల స్వర్గీయ వంగవీటి మోహన రంగా   37వ వర్ధంతి సందర్భంగా సుభద్రంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ సమయంలో మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ గారిని స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అవమానించిన ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు. అప్పుడూ, ఇప్పుడూ కాపు నాయకులను లక్ష్యంగా చేసుకుని అవమానించడం ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏ పార్టీకి చెందిన వారైనా సరే, కాపు సామాజిక వర్గం గురించి, కాపు నాయకుల గురించి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని మణికంఠ సూచించారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రజలే తగిన మూల్యం చెల్లింపజేస్తారని హెచ్చరించారు.

ఎన్నికల ప్రచార సమయంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రిక్షా తొక్కిన విషయాన్ని గుర్తు చేస్తూ, “మేము అప్పట్లో రిక్షా కంపెనీ పెట్టుకో అంటూ విమర్శించలేదు. రాజకీయాల్లో ఎలా మెలగాలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి  మాకు సభ్యత, సంస్కారం నేర్పారు” అని మణికంఠ తెలిపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను వరుసగా కించపరుస్తూ, అవమానిస్తూ ముందుకు వెళ్తే చివరికి ప్రజలే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Back to Top