విశాఖపట్నం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమనివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలో విశాఖపట్నంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్‌ను పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ ఇరవై రోజులు పార్టీ నాయకులు అయా నియోజకవర్గాల్లో ఓటర్లను కలిసి మెజార్టీ సాధించే దిశలో పని చేయాలి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల కోసం ఈరోజు నుంచి విశాఖలో వైయస్ఆర్ సీపీ ప్రత్యేక కార్యాలయం అందుబాటులో ఉంటుంది.
ధర్మాన ప్రసాదరావు, రెవిన్యూ శాఖ మంత్రి:
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీతంరాజు సుధాకర్‌ను బలపరుస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఆయనను గెలిపించుకుని ఈ ప్రాంతానికి మా పార్టీ, ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అందరూ గుర్తించేలా చేయాలని నిర్ణయించాం. అనేక దశాబ్ధాలుగా వెనకబడి ఉన్న ఈ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం శ్రీ వైయస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సామాజిక అసమానతలు, ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను పూర్తిగా మార్చడం కోసం మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పట్టభద్రులు గుర్తించాలి. అలాగే మాయమాటలు చెప్పి నమ్మించాలనే వారి మాయలో మీరు పడిపోవద్దు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మేము తప్పనిసరిగా విజయం సాధిస్తాం.
బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి:
ఈసీ సమావేశాలు పెట్టుకుంటుంది. అది నిరంతర ప్రక్రియ. చేత కాని వాడు ఫిర్యాదు చేయక ఇంకేం చేస్తాడు?. మేం ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించం. ఎప్పుడూ చట్టబద్ధంగా నడుచుకుంటాం. ఈ ఎన్నికల్లో 200 శాతం మేం గెలుస్తాం. అలాంటప్పుడు రాజధాని అంశాన్ని రెఫరెండంగా ఎందుకు తీసుకోవాలి?. పచ్చ మీడియా ఎప్పుడూ మాపై దుమ్మెత్తి పోస్తుంది కాబట్టి, మేము ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. గతంలో మా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇప్పుడు మాకు అభ్యర్థి ఉన్నాడు.