తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం గౌతమ్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు సీఎం వైయస్ జగన్ ముందడుగులు వేస్తున్నారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న సీఎం వైయస్ జగన్‌కు ట్రేడ్ యూనియన్ తరుఫున గౌతమ్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. మూడు రాజధానుల అంశాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సదస్సులు చేపట్టనున్నట్లు కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్ని జిల్లాల్లో మేధావులు, సంఘటిత, అసంఘటిత కార్మికులతో సదస్సులు కూడా నిర్వహించనున్నట్లు వివరించారు.