విశాఖ: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఇవాళ వైయస్ జగన్ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటిస్తుండగా ప్రభుత్వం ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు, బారీకెడ్స్ ఏర్పాటు చేసి అడ్డుకుంటుందని ఆయన మండిపడ్డారు. విశాఖ ఎయిర్‌పోర్టు మొదలుకుని ప్రతిచోటా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కాన్వాయ్ వెనుక పార్టీ నాయకుల వాహనాలను అనుమతించడం లేదని ధ్వజమెత్తారు. ప్రతిచోటా ఆంక్షలు, నియంత్రణలు పెడుతున్నారని, అనకాపల్లి నుంచి మాకవరపాలెం వరకూ ప్రజలెవ్వరినీ రానివ్వడం లేదంటూ పోలీసుల తీరును తప్పుపట్టారు. ప్రజలను అడ్డుకునేందుకు దాదాపు 3 వేల మంది పోలీసులను పెట్టి చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తోందని విమర్శించారు. రాజకీయ పార్టీలకు ఉండే హక్కులను హరిస్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.